ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు బిగ్ షాక్‌.. రిషబ్ పంత్‌పై సస్పెన్షన్ వేటు | Sakshi
Sakshi News home page

IPL 2024: ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు బిగ్ షాక్‌.. రిషబ్ పంత్‌పై సస్పెన్షన్ వేటు

Published Sat, May 11 2024 4:32 PM

BCCI suspends Rishabh Pant, slaps Rs 30 lakh fine

ఐపీఎల్‌-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ చ‌ర్య‌లు తీసుకుంది. ఈ ఏడాది సీజ‌న్‌లో  మూడోసారి స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్‌ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. 

అంతేకాకుండా రూ. 30 లక్షల జరిమానా కూడా విధించింది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత స‌మ‌యంలో త‌మ బౌలింగ్ కోటాను పూర్తి చేయ‌లేక‌పోయింది. ఢిల్లీ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం ఇది మూడో సారి. 

అయితే ఐపీఎల్‌ నియమావళి ప్రకారం వ‌రుస‌గా మూడో సారి  స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేస్తే.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడంతో పాటు మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. 

ఏప్రిల్ 4న వైజాగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసినందుకు రిషబ్ పంత్‌కు రూ.24 లక్షల జరిమానా విధించారు. అంతకుముందు వైజాగ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించిన పంత్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. 

ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సారి నియమావళి ఉల్లంఘించినందుకు పంత్‌పై ఐపీఎల్ మెనెజ్‌మెంట్ చ‌ర్య‌లు తీసుకుంది.  ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌కు పంత్‌ దూరం కానున్నాడు. కాగా ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే  ఆర్సీబీతో జ‌రిగే మ్యాచ్ చాలా కీల‌కం.
 

Advertisement
 
Advertisement
 
Advertisement