కోహ్లి కాదు!.. అత‌డు 50 ఏళ్ల వ‌య‌సులోనూ క్రికెట్ ఆడ‌గ‌ల‌డు! | Sakshi
Sakshi News home page

కోహ్లి కాదు!.. అత‌డు 50 ఏళ్ల వ‌య‌సులోనూ క్రికెట్ ఆడ‌గ‌ల‌డు!

Published Tue, May 14 2024 2:39 PM

Rohit Sharma Never Thought About Fitness: Yograj Singh Bold Remark On Hitman Future

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మకు గ‌త కొంత‌కాలంగా పొట్టి ఫార్మాట్లో ఏదీ క‌లిసి రావ‌డం లేదు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2022 సెమీస్‌లోనే భార‌త జ‌ట్టు నిష్క్ర‌మించిన త‌ర్వాత.. సుదీర్ఘ‌కాలం అంత‌ర్జాతీయ టీ20ల‌కు దూరంగా ఉన్నాడు హిట్‌మ్యాన్‌.

ప్లే ఆఫ్స్ చేర్చినా
గ‌తేడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా బ‌రిలోకి దిగిన రోహిత్ బ్యాట‌ర్‌గా స్థాయికి త‌గ్గ‌ట్లు రాణించ‌లేదు. ఈ ఓపెనింగ్ బ్యాట‌ర్‌ 16 మ్యాచ్‌ల‌లో క‌లిపి 332 పరుగులు మాత్ర‌మే చేశాడు. ఇక జ‌ట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సార‌థిగా స‌ఫ‌ల‌మైనా.. ముంబై ఫ్రాంఛైజీ అత‌డిపై ఈసారి వేటు వేసింది.

గుజ‌రాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్ప‌గించింది. ఈ క్ర‌మంలో తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైన రోహిత్ శ‌ర్మ వ‌చ్చే ఏడాది ఫ్రాంఛైజీని వీడేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

ఫోక‌స్ చేయ‌లేక‌
ఇక పాండ్యా ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయిన రోహిత్ బ్యాటింగ్‌పై కూడా ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌లేక‌పోతున్నాడ‌ని గ‌ణాంకాల‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఐపీఎల్‌-2024లో ఇప్ప‌టి దాకా 13 మ్యాచ్‌లు ఆడి 349 ప‌రుగులు చేశాడు. 

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ త‌ర్వాత టీమిండియా జూన్ 1నుంచి మొద‌లుకానున్న ప్ర‌పంచ‌క‌ప్‌-2024కు స‌న్న‌ద్ధంకానుంది. ఇందుకోసం ఇప్ప‌టికే రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో బీసీసీఐ 15 మంది స‌భ్యుల‌తో జ‌ట్టును ప్ర‌క‌టించింది.

అయితే, ఈ మెగా టోర్నీ త‌ర్వాత 37 ఏళ్ల రోహిత్ శ‌ర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌ల‌కనున్న‌ట్లు స‌మాచారం. వ‌య‌సు, ఫిట్‌నెస్ రీత్యా రెండు ఫార్మాట్లకు కూడా గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

అది నిజం కాదు
ఈ నేప‌థ్యంలో  టీమిండియా మాజీ స్టార్ యువ‌రాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్‌ రోహిత్ శ‌ర్మ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. "అస‌లు వ‌య‌సు గురించి ఎందుకు మాట్లాడ‌తారో అర్థం కాదు.

40, 42.. 45 ఏళ్ల వ‌య‌సులోనూ ఫిట్‌నెస్‌తో ఉండి.. బాగా ఆడుతుంటే.. ఆ ఆట‌గాడి రిటైర్‌మెంట్ గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏముంది? 

మ‌న దేశంలో చాలా మంది 40 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చిందంటే.. పిల్ల‌ల పెంపకం గురించి ఆలోచిస్తూ కాలం గ‌డిపేయాల‌నే ఆలోచ‌న‌తో ఉంటారు. వ‌య‌సు అయిపోయింద‌ని.. ఆట‌కు ప‌నికిరామ‌ని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

 50 ఏళ్ల వ‌య‌సులోనూ క్రికెట్ ఆడ‌గ‌ల‌డు
టీమిండియా తొలిసారి వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన‌పుడు మొహింద‌ర్ అమ‌ర్‌నాథ్ వ‌య‌సు 38 ఏళ్లు.  ఫైన‌ల్లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అత‌డే. అస‌లు ఏజ్ గురించి టీమిండియాలో చ‌ర్చ అన‌వ‌స‌రం అంటాను.

రోహిత్ శ‌ర్మ‌, వీరేంద్ర సెహ్వాగ్ వంటి గొప్ప ప్లేయ‌ర్లు ఫిట్‌నెస్ గురించి పెద్ద‌గా అవ‌స‌రం లేదు.  ఒక‌వేళ రోహిత్ ఆడాల‌నుకుంటే 50 ఏళ్ల వ‌య‌సులోనూ క్రికెట్ ఆడ‌గ‌ల‌డు" అని యోగ్‌రాజ్ సింగ్ అని స్పోర్ట్స్‌18తో చెప్పుకొచ్చాడు.

కాగా ఫిట్‌నెస్‌కు మారుపేరైన విరాట్ కోహ్లి కెరీర్ సుదీర్ఘ‌కాలం కొన‌సాగించ‌గ‌ల‌డ‌న్న విశ్లేష‌ణ‌ల నేప‌థ్యంలో అత‌డి పేరు ఎత్త‌కుండా యోగ్‌రాజ్ కేవ‌లం రోహిత్‌, వీరూ పేర్లు చెప్ప‌డం విశేషం.

చ‌ద‌వండి: T20 WC: హార్దిక్‌ను సెలక్ట్ చేయ‌డం రోహిత్‌కు ఇష్టం లేదు.. కానీ!

Advertisement
 
Advertisement
 
Advertisement