సెమీస్‌లో భారత్‌.. ఒలింపిక్స్‌ బెర్త్‌ అవకాశాలు సజీవం | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో భారత్‌.. ఒలింపిక్స్‌ బెర్త్‌ అవకాశాలు సజీవం

Published Wed, Jan 17 2024 7:23 AM

Womens Hockey Olympic Qualifier: India Beat Italy To Qualify For Semifinal - Sakshi

రాంచీ: పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలను భారత మహిళల హాకీ జట్టు సజీవంగా నిలబెట్టుకుంది. ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో సవితా పూనియా సారథ్యంలోని భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఇటలీ జట్టుతో జరిగిన చివరిదైన మూడో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 5–1 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది.

భారత్‌ తరఫున ఉదిత రెండు గోల్స్‌ (1వ, 55వ ని.లో) చేయగా... దీపిక (41వ ని.లో), సలీమా టెటె (45వ ని.లో), నవ్‌నీత్‌ కౌర్‌ (53వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. ఇటలీ జట్టుకు కామిలా మాచిన్‌ (ప్లస్‌ 60వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో అమెరికా 1–0తో న్యూజిలాండ్‌ను ఓడించింది.

దాంతో గ్రూప్‌ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన అమెరికా 9 పాయింట్లతో టాపర్‌గా నిలువగా... రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ 6 పాయింట్లతో రెండో స్థానం సంపాదించి సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో జపాన్‌తో అమెరికా; జర్మనీతో భారత్‌ తలపడతాయి. ఈ టోర్నీలో టాప్‌–3లో నిలిచిన జట్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement