రుణమాఫీకి రూ.40 వేల కోట్లు! | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి రూ.40 వేల కోట్లు!

Published Thu, May 16 2024 4:44 AM

CM said that he will waive the loan under any circumstances by August 15

నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు 

దాదాపు 40 లక్షల మంది రైతుల బకాయిలుంటాయన్న అధికారులు 

ఆగస్టు 15లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేస్తామన్న సీఎం

అసలు, వడ్డీ కలిపితే రూ.40 వేల కోట్లకు పైగా అవసరం

సాక్షి, హైదరాబాద్‌:     రైతు రుణమాఫీకి నిధుల సర్దుబాటు అంశం ఆర్థిక శాఖను కలవరానికి గురి చేస్తోంది. బహిరంగ మార్కెట్లో తీసుకునే అప్పులు, కేంద్ర గ్రాంట్లు, రాష్ట్రానికి వచ్చే నెలసరి ఆదాయం మొత్తం.. రెవెన్యూ వ్యయం, ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాలు, గతంలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపులకే సరిపోతుంటే.. రుణమాఫీకి నిధులు ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 15వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నిధుల వేటలో తలమునకలైంది. రైతు రుణాలు అసలు, వడ్డీ కలుపుకొని దాదాపు రూ.40 వేల కోట్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

సంక్షేమం, గృహ నిర్మాణం ఎలా?
ఎన్నికల సమయంలో గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న రైతు సంక్షేమ మండలి (ఎఫ్‌డబ్ల్యూసీ)కి రైతు రుణాలన్నింటినీ బదలాయించి, రైతుల పాస్‌ పుస్తకాలను విడిపించి వారికి అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. 

అయితే కార్పొరేషన్‌కు రుణ మొత్తాన్ని బదలాయించినా..ఆ మొత్తం ‘ఆర్థిక జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ’ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిలోకే వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే రుణం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. ఈ ఒక్క పథకానికే భారీ మొత్తంలో నిధులు తీసుకుంటే, మిగిలిన సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణం తదితర పథకాలకు నిధులెలా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. 

అప్పు చెల్లించడానికి అప్పు కుదురుతుందా?
దాదాపు 40 లక్షల మంది రైతుల బకాయిలకు సంబంధించి ఐదేళ్ల కాలంలో బ్యాంకులకు వడ్డీ, అసలు కలుపుకొని రూ.40 వేల కోట్ల వరకు అవుతుందని అంచనా. కాగా ఇప్పటికే దాదాపు ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకవేళ ఆర్బీఐ, ఆర్థిక సంస్థలు అంగీకరించినా.. రుణమాఫీ కింద ప్రతినెలా చెల్లించేందుకు రూ.800 కోట్లకు పైగానే కచ్చితంగా పక్కన పెట్టాల్సి వస్తుందని అంటున్నారు. 

ఇప్పటికే అనివార్య ఖర్చుల భారం పెరిగి ఇతర కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు కావడం లేదని, ఇప్పుడు కొత్తగా చేరే రుణమాఫీ పద్దు ఖజానాకు భారమేనని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు అప్పు చెల్లించడం కోసం తిరిగి అప్పు చేయడానికి ఆర్థిక సంస్థలు ఎంతవరకు అంగీకరిస్తాయన్నది అనుమానమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

 ఇక మహాలక్ష్మి, ఉద్యోగుల పీఆర్‌సీ, ఇతర పథకాలు దశల వారీగా అమలు చేసినా.. వాటికి కూడా నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అయితే రైతు రుణమాఫీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారవర్గాలు అందుకు ఉన్న మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి.

తొలి మూడు నెలల్లో రూ.11 వేల కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.59 వేల కోట్ల మేర అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ ప్రణాళికల్లో ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్‌బీఐ ద్వారా తొలి త్రైమాసికంలో (ఏప్రిల్, మే, జూన్‌) రూ.11 వేల కోట్లను రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించింది. 

ఆ మొత్తంలో ఇప్పటికే రూ.6 వేల కోట్లు పూర్తి కాగా, మే నెలలోనే మరో రూ.2 వేల కోట్ల రుణ సేకరణ ఆర్‌బీఐ వద్ద షెడ్యూల్‌ అయి ఉంది. జూన్‌లో మరో రూ.3వేల కోట్లను తీసుకోనుంది. మొత్తం మీద ఆర్‌బీఐకి ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఈ మూడు నెలల్లో  రూ.11 వేల కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. 

ఎన్నికల వేళ అప్పుల మోత
ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్పుల మోత మోగించింది. ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే రూ.6 వేల కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించింది. ఆర్‌బీఐ ద్వారా సెక్యూరిటీలను వేలం వేసి ఈ మొత్తాన్ని తీసుకుంది.

ఏప్రిల్‌ నెలలో రెండు దఫాల్లో రూ.2 వేల కోట్లు తీసుకోగా, మే నెలలో రెండు దఫాల్లో రూ.4 వేల కోట్లను సేకరించింది. ఏప్రిల్‌ 23న రూ.1,000 కోట్లు, అదే నెల రెండో తేదీన రూ.1,000 కోట్లు, మే  7వ తేదీన రూ.3 వేల కోట్లు, మే 14న మరో రూ.1,000 కోట్లు తీసుకుంది. ఈ మొత్తాన్ని 12 నుంచి 28 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement