తెలంగాణలో మరోసారి తెరపైకి నియోజకవర్గాల పునర్విభజన | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరోసారి తెరపైకి నియోజకవర్గాల పునర్విభజన

Published Tue, Jan 16 2024 8:42 AM

delimitation in telangana state - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లాలను పునర్విభజన చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించడంతో పాటు ఆ దిశగా కసరత్తు కూడా ప్రారంభమైన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ జోన్లు, సర్కిళ్లలోనూ మార్పు చేర్పులు ఉంటాయా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్‌ఎంసీలో గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐదు జోన్లు (ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్‌) ఉండేవి. వాటిలో 18 సర్కిళ్లు ఉండేవి. 18 సర్కిళ్లను తొలుత 24 సర్కిళ్లుగా మార్చారు. తర్వాత వాటిని 30 సర్కిళ్లుగా చేశారు. ఐదు జోన్లను ఆరు జోన్లుగా మార్చారు. ఆరు జోన్లకు చార్మినార్, ఎల్‌బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ జోన్లుగా పేర్లు పెట్టారు.  

12 జోన్లు.. 48 సర్కిళ్లు.. 
పరిపాలన సౌలభ్యం కోసమంటూ గత ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచినట్లే జీహెచ్‌ఎంసీ జోన్లను సైతం 12 జోన్లుగా చేయాలని.. ఒక్కో జోన్‌లో నాలుగు సర్కిళ్ల వంతున 48 సర్కిళ్లను ఏర్పాటు చేయాలని భావించింది. ఆమేరకు జీఓ కూడా వెలువడింది. కానీ.. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. జోన్లను పదికి, సర్కిళ్లను యాభైకి పెంచాలని 2018లో స్టాండింగ్‌ కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించగా, 12 జోన్లు.. 48 సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం జీఓ వెలువరించింది. కానీ అంతకుముందే ఏర్పాటైన ఆరు జోన్లే కొనసాగుతున్నాయి. 

 ప్రస్తుతం జిల్లాల పునరి్వభజన తెరపైకి రావడంతో జీహెచ్‌ఎంసీలోనూ జోన్లు, సర్కిళ్లు మారతాయా అనేది జీహెచ్‌ఎంసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ప్రస్తుతమున్న సర్కిళ్లు, జోన్లలో సమస్యలున్నాయి. ఖైరతాబాద్‌ జోన్‌ షేక్‌పేట దాకా విస్తరించి ఉంది. శేరిలింగంపల్లి ఒకే జిల్లా పరిధిలో లేదు. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలున్నాయి. 

గతంలో ఇలా.. 
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిని  12 జోన్ల పరిధిలోకి తేవాలని భావించారు. ఒక్కో జోన్‌లో రెండు నియోజకవర్గాలు, నాలుగు సర్కిళ్లు ఉండేలా పునర్వ్యవస్థీకరించాల్సిందిగా జీవో  జారీ చేశారు. ఆమేరకు కమిషనర్‌ను ఆదేశించారు.  కానీ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలోనూ మార్పుచేర్పులు జరగవచ్చననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

కలెక్టర్‌ బాధ్యతలు కమిషనర్‌కు.. 
జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలుగు జిల్లాలున్నాయి. అన్ని జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కలెక్టర్లది కాగా హైదరాబాద్‌ జిల్లాది మాత్రం కమిషనర్‌కు అప్పగించారు. దీంతో ఎన్నికలొచ్చినా ప్రతిసారీ జీహెచ్‌ఎంసీలో పనులు నిలిచిపోతున్నాయి. కోటిమందికి పైగా సేవలందించే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలున్నాయి. గ్రేటర్‌ పరిధిలోనే ఉన్న ఒక జిల్లాలో ఐదు నియోజకవర్గాలుంటే, ఒక జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. ఒక ఎమ్మెల్యే పరిధిలో తక్కువ వార్డులుంటే.. మరో ఎమ్మెల్యే పరిధిలో ఎక్కువ వార్డులున్నాయి. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలున్నాయి. దీంతో నియోజకవర్గాలతో పాటే జీహెచ్‌ఎంసీ జోన్లు, సర్కిళ్లు, వార్డుల్లోనూ మార్పుచేర్పులుంటాయా ? అనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
 
Advertisement