జిల్లాకు వర్ష సూచనలు | Sakshi
Sakshi News home page

జిల్లాకు వర్ష సూచనలు

Published Fri, May 17 2024 5:05 AM

జిల్లాకు వర్ష సూచనలు

తిరుపతి అర్బన్‌: జిల్లాలో వర్షసూచనలు కనిపిస్తున్నాయని ఆ విభాగం అధికారులు తెలిపారు. బుధవారం పెళ్లకూరు మండలంలో 13 మి.మీ, పుత్తూరులో 7.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 20.4 మి.మీ వర్షం కురిసిందని వెల్లడించారు. అదేవిధంగా గురువారం పిచ్చాటూరులో 4.8 మి.మీ, తడలో 0.8 మి.మీ, సూళ్లూరుపేటలో 0.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. రానున్న పది రోజుల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశాలున్నట్లు వెల్లడించారు.

నేటి నుంచి శ్రీపద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల: తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శుక్రవారం నుంచి శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభం కానున్నాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పద్మావతి పరిణయోత్సవ మండపం అలంకరణలకు పెట్టింది పేరు. గతంలో పసుపు–కుంకుమ మండపం, గాజుల మండపం, రంగురాళ్ల మండపం, అష్టలక్ష్మీ మండపం, దశవతార మండపం వంటి నమూనాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా టీటీడీ ఉద్యానవన విభాగం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మొట్టమొదటి సారిగా కేరళ సంప్రదాయ ‘తెప్ప కోలం’ అలంకరణతో పాటు ఫలపుష్పాలు, విద్యుద్దీపాలతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరించారు. ఇందులో రోజా, లిల్లీ, చామంతి వంటి రెండు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50 వేల కట్‌ ఫ్లవర్స్‌ (15 రకాలు), వివిధ రకాల ఫలాలు, ఏనుగులు, గుర్రాలు, చిన్నకృష్ణుడు వంటి సెట్టింగులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మండపం పైభాగంలో ఏర్పాటుచేసిన వెన్న ఉట్లు, వెండి గంటలు, పూల గుత్తులు ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ గార్డెన్‌ విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు పర్యవేక్షణలో బెంగళూరుకు చెందిన 150 మంది నిపుణులైన సిబ్బంది, టీటీడీ గార్డెన్‌ విభాగానికి చెందిన మరో 50 మంది సిబ్బంది వారం రోజులుగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాల మండపాన్ని రూపొందిస్తున్నారు. ఈ మండప అలంకరణకు పూణేకు చెందిన వేంకటేశ్వర చారిటబుల్‌ ట్రస్టు వారు టీటీడీకి విరాళం అందించారు.

జిల్లాలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

తిరుపతి అర్బన్‌: జిల్లాలోని ఫెసిలిటేషన్‌ సెంటర్ల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను తిరుపతికి తరలించారు. అలాగే గురువారం ఇతర జిల్లాలకు చెందిన ఓట్లను ఆయా నియోజకవర్గాల ఆర్వోలకు (రిటర్నింగ్‌ అధికారులకు) పంపించారు. పోస్టల్‌ బ్యాలెట్లను ప్రత్యేక బాక్సులలో భద్రపరిచారు. ఈ కసరత్తు మొత్తం ప్రత్యేక నిఘా నీడలో జరిగింది. అనంతరం ఆ బాక్సులకు సీల్‌ వేసి శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాలలోని కౌంటింగ్‌ సెంటర్‌కు తరలించారు. ఈ కసరత్తును జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్‌ పర్యవేక్షించారు.

దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు

తిరుపతి కల్చరల్‌: మోదీది హోసేల్‌ అవినీతి అని, దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయ ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. గురువారం తిరుపతి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ హోల్‌సేల్‌ అవినీతికి పాల్పడడంతో పాటు బ్లాక్‌ మనీ వైట్‌ మనీగా చేసుకోవడానికి అవకాశం కల్పించారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement