Sakshi News home page

Dubai: భారీ వర్షాలకు దుబాయ్‌ అతలాకుతలం.. నీట మునిగిన ఎయిర్‌పోర్ట్‌, మెట్రో స్టేషన్లు!

Published Wed, Apr 17 2024 7:09 AM

Flood Like Situation Due to Heavy Rains in Dubai - Sakshi

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్‌ భారీ వర్షాలకు తల్లడిల్లిపోయింది. ఎడతెగని వర్షాలు వీధులు, ఇళ్లు, మాల్స్‌ను జలమయం చేశాయి. హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. సోమవారం అర్థరాత్రి ప్రారంభమైన భారీ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. జాతీయ వాతావరణ కేంద్రం దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఒమన్‌లో భారీ వర్షాల కారణంగా 18 మంది మృతి చెందారు.  ఏడాది మొత్తం మీద కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరం  అతలాకుతలమైపోయింది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో కురిసిన భారీ వర్షం  జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.

ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం జాతీయ వాతావరణ కేంద్రం దుబాయ్, అబుదాబి, షార్జా ప్రజలను అప్రమత్తం చేస్తూ, రాబోయే 48 గంటల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని తెలిపింది. బుధవారం వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
 

జాతీయ వాతావరణ కేంద్రం నిపుణుడు అహ్మద్ హబీబ్ మాట్లాడుతూ దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్‌లోని పలు ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. ప్రజలు తమ వాహనాలను వరద ప్రాంతాలకు దూరంగా. సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలలో పార్క్ చేయాలని సూచించారు.

దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధి మాట్లాడుతూ తుఫాను కారణంగా మంగళవారం మధ్యాహ్నం 25 నిమిషాల పాటు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశామని, ఆ తరువాత తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మరోవైపు మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
 

వీటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక వందలాది మంది జనం దుబాయ్ మాల్‌లో చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా యూఏఈ అంతటా పాఠశాలలను మూసివేశారు. యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 80 మిల్లీమీటర్ల (3.2 అంగుళాలు) కంటే అధిక వర్షపాతం నమోదయ్యింది.

దుబాయ్‌లో కురిసిన భారీ వర్షానికి విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు, వ్యాపార సంస్థలు వరద నీటిలో మునిగిపోయాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గడచిన 24 గంటల్లో దాదాపు 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఒక రోజులో దాదాపు 1.5 సంవత్సరాల సగటు వర్షపాతం.
 

తుఫాను కారణంగా పలు పాఠశాలలను మూసివేయగా, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు  ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఈ భారీ వర్షాలు దాదాపు అన్ని అరబ్ దేశాలలో విపత్తుకు కారణంగా నిలిచాయి. వాతావరణ మార్పుల కారణంగా కుండపోత వర్షపాతం సంభవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ శాస్త్రవేత్త అహ్మద్ హబీబ్  తెలిపిన వివరాల ప్రకారం క్లౌడ్ ఫార్మేషన్‌ల నుంచి ప్రయోజనాన్ని పొందడానికి గల్ఫ్ స్టేట్‌లోని  నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ అల్ ఐన్ విమానాశ్రయం నుండి సీడింగ్ విమానాలను పంపింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనూ భారీ వర్షాలు పడ్డాయి.

Advertisement
Advertisement