దుబాయ్ అనగానే చాలామందికి ప్రపంచంలో ఎత్తైన భవనంగా కీర్తి గడిస్తున్న 'బుర్జ్ ఖలీఫా' గుర్తొస్తుంది. అయితే త్వరలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ అందుబాటులోకి రానుంది. నగరంలోని మెరీనా జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఈ రెసిడెన్షియల్ మొత్తం 122 అంతస్తులుగా నిర్మించనున్నారు.
'సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్' పేరుతో నిర్మిస్తున్న ఈ భవనం 517 మీటర్లు లేదా 1696 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన రెసిడెన్షియల్‌గా.. న్యూయార్క్ నగరంలోని 'సెంట్రల్ పార్క్ టవర్' (474 మీటర్లు లేదా 1550 అడుగులు) కంటే చాలా పొడవుగా ఉంటుంది.
సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్‌ను వుడ్స్ బాగోట్ అండ్ డబ్ల్యుఎస్పీ మిడిల్ ఈస్ట్ రూపొందించారు. ఇది గుండ్రంగా మెరుస్తున్న టవర్ మాదిరిగా ఉంటుంది. బాల్కనీలను, టెర్రస్ వంటి వాటిని కలుపుతూ చివరి బిందువు మాదిరిగా పూర్తయ్యి ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ మొత్తం మిచెల్ & ఈడెస్ పూర్తి చేస్తుంది. కాబట్టి ఇందులో అరబ్ యువరాజుకు సరిపోయే హై-ఎండ్ యాక్సెసరీస్, మెటీరియల్‌లను ఉపయోగించినట్లు సమాచారం.
సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్‌లో అత్యాధునిక ఫిట్‌నెస్ సౌకర్యాలు ఫంక్షనల్ జిమ్‌లు, వర్చువల్ సైక్లింగ్, బాక్సింగ్ స్టూడియోలు, ఇన్ఫినిటీ పూల్, ఐస్ బాత్‌లు, సాల్ట్ రూమ్, బయో, సౌండ్ హీలింగ్ రూమ్, మసాజ్ సూట్‌లు, ఇండోర్ అండ్ అవుట్‌డోర్ సినిమాస్ వంటి ఎన్నో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి.
సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్ దుబాయ్ మెరీనాకు కొంత చరిత్ర కూడా ఉంది. ఇది 2007లో పెంటోమినియం టవర్‌గా ప్రారంభమైంది. తరువాత ఆనతి కాలంలోనే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కారణంగా నిర్మాణం నిలిచిపోయింది. ఇటీవలే సెలెక్ట్ గ్రూప్ అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం నిర్మాణం 25 శాతం పూర్తయింది. ఇది 2028 చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment