Sakshi News home page

అనన్య.. ప్రతిభ

Published Wed, Apr 17 2024 1:30 AM

- - Sakshi

తాత దిశానిర్దేశంతోసివిల్స్‌ వైపు అడుగులు

సొంతంగా ప్రిపరేషన్‌..మొదటి ప్రయత్నంలోనే విజయం

సొంతూరు పొన్నకల్‌..బాల్యమంతా మహబూబ్‌నగర్‌లోనే..

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌/ అడ్డాకుల: యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో పాలమూరు బిడ్డ సత్తాచాటింది. సివిల్స్‌– 2023 ఫలితాల్లో జిల్లాకేంద్రానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆమె ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సివిల్స్‌లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం పట్ల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలన్న ఆశయం ఉన్న ఆమె బాల్యమంతా మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోనే గడిచింది. ఆమె ఐఏఎస్‌ కావాలన్న కలలకు స్ఫూర్తినిచ్చింది తాత కృష్ణారెడ్డి ఆయన సలహాలు, సూచనలతో చిన్నప్పటి నుంచి సివిల్సే లక్ష్యంగా చదువుకున్నట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఎలాంటి శిక్షణ లేకుండా.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.

ఇంటర్‌ ప్రారంభం నుంచే..
అనన్య ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లోని గీతం పాఠశాలలో చదివారు. ఎస్సెస్సీలో మంచి గ్రేడింగ్‌తో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్‌ ప్రారంభం నుంచి ఐఏఎస్‌ వైపు అడుగులు పడ్డాయి. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని నారాయణ ఐఏఎస్‌ అకాడమీలో చేర్చారు. ఇంటర్‌ పూర్తయ్యాక ఢిలీల్లోని మిరిండా హౌస్‌ కళాశాలలో ఏబీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌)లో చేరారు. డిగ్రీ పూర్తయ్యాక 2020 నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్‌ ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సివిల్స్‌లో ఆప్షనల్‌ సబ్జెక్టులుగా ఆంత్రపాలజీని ఎంపిక చేసుకున్నారు. ఈ ఒక్క ఆంత్రపాలజీ కోసం ఆన్‌లైన్‌లోనే శిక్షణ తీసుకున్నారు. దీంతో మిగతా సబ్జెక్టులు అన్ని కూడా సొంత ప్రిపరేషన్‌తో ముందుకు సాగారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు సిద్ధమయ్యాయని చెప్పారు.

సొంత ప్రిపరేషన్‌
సివిల్స్‌కు సిద్ధమయ్యే క్ర మంలో అనన్యరెడ్డి సొంత ప్రిపరేషన్‌పైనే ఎక్కు వగా దృష్టిపెట్టారు. ప్రతి రోజు 12 గంటల నుంచి 14 గంటలపాటు చదువుకునేవారు. సబ్జెక్టులో ప్రతి అంశాన్ని నోట్‌గా రాసుకునే అలవాటు ఉండటంతో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా సులువుగా లక్ష్యాన్ని చేరు కుని ప్రణాళిక ప్రకారం నిర్దేశిత సమయంలో సిలబస్‌ను పూర్తిచేసే విధంగా ఆమె ప్రిపరేషన్‌ కొనసాగించారు. సివిల్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో సీనియర్ల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడినట్లు అనన్యరెడ్డి చెప్పారు.

పొన్నకల్‌లో సంబరాలు
అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. పొన్నకల్‌వాసికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు అనన్యరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనన్యరెడ్డి తండ్రి సురేష్‌రెడ్డి గ్రామంలో కొన్నాళ్లపాటు వ్యవసాయం చేశారు. 20 ఏళ్ల కిందట ఇద్దరు కుమార్తెల చదువుల కోసం మహబూబ్‌నగర్‌ వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే వ్యాపారాలు చేస్తూ కుమార్తెలను చదివించారు.

మెరిసిన ఆత్మకూర్‌ ఆణిముత్యం
ఆత్మకూర్‌: యూపీఎస్సీ ఫలితాల్లో ఆత్మకూర్‌కు చెందిన ఎహ్తేదా ముఫస్సీర్‌ ప్రతిభచాటింది. ఎలాంటి కోచింగ్‌ లేకుండానే ఆలిండియా 278 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికై ంది. ఆత్మకూర్‌కు చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు సయ్యద్‌ఖాసిం కుమారుడు ఇబ్రహిం ఖలీల్‌కు ఇద్దరు కుమార్తెలు రుఫియా, ఎహ్తేదా ముఫస్సీర్‌, కుమారుడు సయ్యద్‌ తఫస్సూల్‌ ఉన్నారు. రెండో కుమార్తె ఎహ్తేదా ముఫస్సీర్‌ పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లోని ఆకృతి పాఠశాలలో చదివి 2014లో 10/10 గ్రేడ్‌ను సాధించిన ఆమె.. ఇంటర్‌ బైపీసీ సిరి కళాశాలలో పూర్తి చేసి 987 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. అనంతరం ఢిల్లీలోని లేడి శ్రీరాం కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌ డిగ్రీ విద్యను 2020లో పూర్తి చేసింది. తర్వాత సోదరి రుఫియాతో కలిసి ఎహ్తేదా ముఫస్సీర్‌ ఇంట్లోనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యి.. 2023లో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలకు హాజరైంది. ఈ క్రమంలో మంగళవారం విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 278 ర్యాంకు సాధించగా.. ఆమె సోదరి రుఫియా ఫలితాల్లో స్వల్ప తేడాతో వెనకబడిపోయింది. ఎహ్తేదా అత్యుతమ ర్యాంకు సాధించడంతో ఆత్మకూర్‌లో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

తాతయ్యే స్ఫూర్తి..
‘మా
తాతయ్య సయ్యద్‌ఖాసీం రిటైర్డు ఉపాధ్యాయుడు. తాను, తన కుమారులు ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నామని.. మీరు ఇంకా గొప్పస్థాయిలో కలెక్టర్‌ కావాలని తరచుగా చెప్పేవారు.’ అని ఎహ్తేదా చెప్పారు. దీంతో పదో తరగతి నుంచే గట్టిగా నిర్ణయించుకొని సివిల్స్‌ వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు. 278 ర్యాంకు రావడంతో మా తాతయ్య కల సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. పేదలకు అండగా నిలబడలన్నదే తన లక్ష్యం అని వివరించారు.

గర్వకారణం.. 
మా కుటుంబానికి చెంది న దోనూరు అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం చాలా గర్వంగా ఉంది. ఆమె తండ్రి సురేష్‌రెడ్డి తన ఇద్దరు కుమార్తెల చదువుల కోసం గ్రా మాన్ని వదిలి మహబూబ్‌నగర్‌లో స్థిరపడ్డా రు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన అనన్యరెడ్డికి శుభాకాంక్షలు.
– దోనూరు నాగార్జున్‌రెడ్డి, ఎంపీపీ, పొన్నకల్‌ గ్రామం

జాతీయస్థాయిలో గుర్తింపు
యూపీఎస్సీ ఫలితాల్లో దోనూరు అనన్యరెడ్డి జా తీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి పొన్నకల్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది. చదువులో రాణించి ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. పట్టుదలతో చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరొచ్చని నిరూపించింది.
– దోనూరు విజయకుమార్‌రెడ్డి, పొన్నకల్‌

Advertisement
Advertisement