Sakshi News home page

Water Woman: అగాథా సంగ్మా గేమ్‌ చేంజర్‌

Published Thu, Apr 18 2024 5:11 AM

Lok sabha elections 2024: Agatha Sangma contested at tura lok sabha constituency - Sakshi

అగాథా సంగ్మా. ఆ పేరే ఓ రికార్డు. రాజకీయ దిగ్గజమైన తండ్రి పీఏ సంగ్మా వారసురాలిగా మేఘాలయలోని తుర నుంచి తొలిసారి లోక్‌సభలో అడుగు పెట్టినా, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధిగా ఎదిగారు. అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి బాధ్యతలు సమర్థంగా నిర్వహించి గేమ్‌ చేంజర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2014లో లోకసభ బరిలోంచి తప్పుకున్నా ‘అయాం నాట్‌ అ చైల్డ్‌ ఎనీమోర్‌’ అంటూ 2019లో లోక్‌సభ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈసారీ తురా నుంచే బరిలో ఉన్నారు...                     

వాటర్‌ ఉమన్‌...
తండ్రి పీఏ సంగ్మా రాజీనామాతో 2008లో అగాథా తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. తుర ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించి దేశంలోనే యంగెస్ట్‌ ఎంపీగా నిలిచారు. తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లోనూ నెగ్గారు. 29 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రి అయ్యారు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగానూ చరిత్ర సృష్టించారు. అంతేగాక అసోంకు చెందిన రేణుకాదేవి బార్కాటకి అనంతరం ఈశాన్య రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి అయిన రెండో మహిళగా నిలిచారు. నీటికోసం నెత్తి మీద కుండతో కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన దుస్థితి నుంచి మహిళలను బయటికి తేవడమే తన కల అని చెప్పే అగాథా వాటర్‌ ఉమన్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఈశాన్య గ్రామాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అక్కడి వెనకబడ్డ ప్రాంతంలో కొత్త వెలుగులు నింపారు. 2012లో జరిగిన రాజకీయ పరిణామాలతో కేంద్ర మంత్రిగా రాజీనామా చేశారు. 2014లో మేఘాలయ రాష్ట్ర రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొంది నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2018లో సౌత్‌ తుర నుంచి ఘనవిజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో మళ్లీ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. మాజీ సీఎం ముకుల్‌ సంగ్మాపై ఘనవిజయం సాధించారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు గర్వంగా ఉందంటారామె. మేఘాలయ నుంచి మళ్లీ లోక్‌సభలో అడుగు పెడతారా అన్నది ఆసక్తికరం.

పర్యావరణ ప్రేమిక...
అగాథా సంగ్మా 1980 జూలై 24న ఢిల్లీలో జని్మంచారు. మేఘాలయలోని వెస్ట్‌ గారో హిల్స్‌లో పెరిగారు. తురాలోని కాన్వెంట్‌ ఆఫ్‌ జీసస్‌ అండ్‌ మేరీ నుంచి పాఠశాల విద్య పూర్తి చేశారు. పుణె యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ అనంతరం ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్‌గా చేరారు. బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌ వర్సిటీలో ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేశారు. 2019లో పాట్రిక్‌ రోంగ్మా మారక్‌ను పెళ్లాడారు. పర్యావరణవేత్త అయిన అగాథా సందర్భం వచి్చనప్పుడల్లా ప్రకృతి పట్ల తన ప్రేమను, బాధ్యతను చాటుకున్నారు. పెళ్లి కూడా పూర్తి పర్యావరణహిత పద్ధతిలో చేసుకుని ఆదర్శంగా నిలిచారు. చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి పెళ్లికి వచి్చనవారికి విత్తన పత్రాలిచ్చారు. నిశి్చతార్థ సమయంలోనూ మొక్కలు నాటారు. అగాథా పుస్తకాల పురుగు. సమయం దొరికిందంటే పుస్తకం పట్టుకుంటారు. అగాథా అంతే బాగా రాస్తారు కూడా. ఫొటోగ్రఫీ అన్నా ఆమెకు ప్రాణం.  

  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement