Sakshi News home page

బాబు ఇంతేకదమ్మ!

Published Thu, Apr 18 2024 10:42 AM

BC Welfare leaders fired on Chandrababu - Sakshi

బీసీ సామాజికవర్గాన్ని చంద్రబాబు కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని ఆ సామాజిక వర్గం నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ తమకు మొండిచెయ్యే చూపుతున్నారని రగిలిపోతున్నారు. టీడీపీ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కేవలం రెండు సార్లే బీసీలకు సీట్లు ఇవ్వడం చూస్తుంటే తమ సామాజికవర్గంపై బాబుకు ఎంత పగ ఉందో అర్థమవుతోందని పలువురు నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బీసీలకు మారుపేరుగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారని చర్చించుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ తన కుటిల బుద్ధి చూపి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తన సామాజిక వర్గానికి నాలుగు సీట్లు కట్టబెట్టి.. తమకు ఒక్క సీటూ ఇవ్వలేదని లోలోపలే రగిలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో బాబును ఓడించి తీరుతామని పలువురు నేతలు తెగేసి చెబుతున్నారు. 

సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 33,59,457 మంది బీసీలు ఉన్నారు. ఇందులో బీసీ ఓటర్లే సుమారు 11 లక్షలు. ఓసీ ఓటర్లు సుమారు 8 లక్షలు ఉండొచ్చని అధికారులు చెబుతున్న లెక్కలు. ఇంత పెద్ద మొత్తంలో ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గానికి టీడీపీ కానీ జనసేన, బీజేపీ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అదే చంద్రబాబు సామాజికవర్గానికి మాత్రం ఏకంగా నాలుగు సీట్లు కేటాయించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే.. ఇద్దరు బీసీ సామాజికవర్గం వారికి టికెట్లు ఇచ్చి వారి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుంది. ఆ ఇద్దరిలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా భరత్‌కృష్ణ ఒకరైతే.. పలమనేరు నియోజకవర్గానికి వెంకటేగౌడ్‌కి టికెట్‌ ఇచ్చి బీసీలను గౌరవించింది.

మూడన్నర దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం
బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కుప్పం మొదటిది. అటువంటి కుప్పం నియోజకవర్గాన్ని ఒక్క శాతం కూడా లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారు. గత 35 ఏళ్లుగా కుప్పంలో బీసీలకు ఎమ్మెల్యే పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారు. బీసీల అమాయకత్వాన్ని ఓట్ల రూపంలో మలచుకుంటూ బీసీలను దగా చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 48.23 శాతం బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉంటే.. అందులో 23.29 శాతం ఓట్లు వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం వారివే.

 టీడీపీ పుట్టినప్పటి నుంచి కేవలం వెయ్యి ఓట్లు కూడా లేని కమ్మ సామాజికవర్గం కుప్పాన్ని ఆక్రమించుకుని బీసీలను అణగదొక్కుతూ వస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టినప్పటి నుంచి కుప్పంలో బీసీలకే పెద్దపీట వేస్తూ వస్తోంది. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్‌కృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బీసీలను గౌరవించింది. సీఎంగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హైదరాబాద్, అమరావతికే పరిమితమైనా.. కుప్పంలో పెత్తనం కూడా కమ్మ సామాజిక వర్గం వారికే అప్పగించారు. టీడీపీ పురుడు పోసుకున్నప్పటి నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే ఒకసారి శ్రీకాళహస్తి, పుంగనూరు అసెంబ్లీ స్థానాలకు బీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. అంతకుమించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ బీసీలకు టికెట్లు ఇచ్చి గౌరవించిన దాఖలాలు లేనే లేవు. 

బాబు కులస్తులకే పెద్దపీట
కుప్పం మొదలు.. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేస్తూ వచ్చారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులను పరిశీలిస్తే..  కుప్పం అభ్యర్థిగా చంద్రబాబు, చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్‌ (కమ్మ), నగరి నుంచి గాలి భానుప్రకాష్‌ (కమ్మ), వెంకటగిరి అభ్యర్థిగా లక్ష్మీసాయి ప్రియ (కమ్మ) వారిని చంద్రబాబు ప్రకటించారు. కుప్పం, పలమనేరు, చిత్తూరు, తిరుపతి, నగరి, వెంకటగిరి నియోజక వర్గాల నుంచి బీసీలు టీడీపీ టికెట్‌     ఆశించినా చంద్రబాబు కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు.

 టీడీపీ పుట్టినప్పటి నుంచి జెండా మోస్తున్న నరసింహయాదవ్‌ (తిరుపతి) టికెట్‌ కోసం ప్రతి సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రయత్నించినా చంద్రబాబు కరుణించిన దాఖలాలు లేవు. నగరి టికెట్‌ కోసం మొదలియార్లు, వెంకటగిరి అసెంబ్లీ కోసం చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీ టికెట్‌ ఆశించినా చంద్రబాబు పట్టించుకోకపోగా ఆయన సామాజికవర్గం వారికే కట్టబెట్టి “కమ్మ’టి ప్రేమను చాటుకుంటూ వస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓటు బ్యాంకింగ్‌గా మార్చుకుంటూ పబ్బంగడుపుకుని వదిలేస్తున్న చంద్రబాబుకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి తీరుతామని బీసీ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement