పరోక్షంగా సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ఫైర్
పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును ఢిల్లీకి తరలిస్తున్నారు
ఆ డబుల్ ఆర్ ఎవరో మీ అందరికీ తెలుసు
ఆ వసూళ్లకు కళ్లెం వేయకపోతే తెలంగాణ ప్రజలను తిరిగి కోలుకోలేనంతగా దోచేస్తారు
ట్రిపుల్ ఆర్ సినిమా హిట్ అయితే, డబుల్ ఆర్ దేశం సిగ్గుపడేలా చేస్తోంది...
కాంగ్రెస్ పంజా.. అంటే ఐదు రకాలుగా మోసం
రాష్ట్రంలో బీజేపీని 17 సీట్లలో గెలిపిస్తే ఆ దోపిడీ ఆగుతుంది
ఫేక్ వీడియోలతో లబ్ధి పొందాలని చూస్తున్నారు.. దీని వెనుక డబుల్ ఆర్ ఉన్నట్లు తెలుస్తోంది
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కరప్షన్ రాకెట్ కమిటీలోనివే..
అల్లాదుర్గం బహిరంగ సభలో ప్రధాని ధ్వజం
కాంగ్రెస్ ఎన్నికల గుర్తు హస్తం... పంజా.. ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అబద్ధపు వాగ్దానాలు, ఓటు బ్యాంకు రాజకీయం, నేరగాళ్లను పెంచి పోషించడం, కుటుంబపాలన, అవినీతి అనే ఐదు సూత్రాలను నమ్మి రాజకీయం చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని దోచుకునేందుకు వారసత్వ సంపద పన్ను తీసుకురావాలని చూస్తోంది. ఇది అమలుచేస్తే మీరు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము మీ మరణం తర్వాత మీ వారసులకు ఇవ్వలేరు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆర్ ఆర్ (డబుల్ ఆర్) ట్యాక్స్ పేరుతో ప్రజలను దోచుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు వాళ్లు తీసిన ‘ట్రిపుల్ ఆర్’ భారత్‌లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సాధిస్తే... తెలంగాణలో ఈ ‘డబుల్ ఆర్’ యావద్దేశం సిగ్గుపడేలా చేస్తోందని మండిపడ్డారు. ఈ ట్యాక్స్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును నల్లధనం రూపంలో ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు. ‘మీ అందరికీ ఆ డబుల్ ఆర్ ఎవరో తెలుసు.
దానిని వివరించాల్సిన అవసరం లేదు. ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూళ్లకు కళ్లెం వేయకపోతే తెలంగాణ ప్రజలు తిరిగి కోలుకోలేనంతగా దోచేస్తారు. ఐదేళ్లలో రాష్రా్టన్ని నాశనం చేస్తారు’ అని ధ్వజమెత్తారు. దీనికి కళ్లెం పడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లలోనూ బీజేపీని గెలిపించాలని కోరారు. మంగళవారం జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చిల్వర్ గ్రామం (అల్లాదుర్గ్)లో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మోదీ... ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. బసమేశ్వర్, సంగమేశ్వర్, సేవాలాల్ మహరాజ్‌లకు నమస్కారాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్. మెదక్ ఎంపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్క గూటి పక్షులే..
‘బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాం కాగా... విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చాక ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను తొక్కి పెట్టింది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా ఓటుకు కోట్లు కేసులో విచారణను ముందుకు సాగకుండా చర్యలు తీసుకుంది. ఈ రెండు పారీ్టలు ఒకరినొకరిని కాపాడుకోవాలని చూస్తున్నాయి.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్క గూటి పక్షులే.. అవి కరప్షన్ రాకెట్ కమిటీకి చెందిన సభ్యులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా ఇది అర్థమవుతోంది. బీఆర్‌ఎస్.. ఆప్‌తో కలిసి లిక్కర్ స్కామ్ చేసింది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన పారీ్టతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది’ అని మోదీ ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్.. రైతులకు వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడటం లేదు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు. క్వింటాల్ వరికి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఇవ్వకుండా, కనీసం దానిపై మాట్లాడకుండా నోటికి తాళం వేసుకున్నారు’ అని మోదీ తెలిపారు.
కాంగ్రెస్ జన్మతః రాజ్యాంగ వ్యతిరేకి..
‘నేను జీవించి ఉన్నంత కాలం రాజ్యాంగానికి ఏమీ జరగకుండా కాపాడుకుంటాను. రాజ్యాంగాన్ని కదిలించే వ్యక్తి, శక్తి ఎవరూ ఉండరు. కాంగ్రెస్‌కు, వాళ్ల తొత్తులు, చెంచాలకు సవాల్ చేస్తున్నా. దీన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నాను. దళితులు, బంజారా, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లను మతప్రాతిపదికన ముస్లింలకు ఇచ్చే ప్రయత్నాన్ని ఎట్టిపరిస్థితుల్లో జరగనివ్వను. కాంగ్రెస్ పార్టీ జన్మతః రాజ్యాంగ వ్యతిరేకి. మతపర రిజర్వేషన్లు వద్దని రాజ్యాంగంలో ఉంటే.. రాహుల్ గాంధీ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఆ రిజర్వేషన్లను ప్రోత్సహిస్తున్నారు.
మోదీకి రాజ్యాంగమంటే పవిత్రగ్రంథం, రాజ్యాంగం రచించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్ సీఎంగా ఏనుగుపై రాజ్యాంగాన్ని ఊరేగించాను. నేను కింద నడిచాను. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రతీక అయిన పార్లమెంట్ భవనం ఎదుట సాష్టాంగ ప్రణామం చేశాను. రాజవంశీయులు (నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబం) అధికార దాహంతో రాజ్యాంగాన్ని అవమానించారు. వాళ్లు ఈవీఎంలు, ఎన్నికల కమిషన్‌ను కూడా నమ్మడం లేదు’ అని మోదీ ధ్వజమెత్తారు.
ఫేక్ వీడియో సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు...
‘ఈ ఎన్నికల్లో ఓడిపోతామని భావించి కాంగ్రెస్ నాయకులు రిజర్వేషన్లపై ఫేక్ వీడియో సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో వివిధ సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక డబుల్ ఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా? ఇండియా కూటమి నిరాశా నిస్పృహల్లో మునిగిపోయింది.
దేశవ్యాప్తంగా ఈ కూటమికి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది పూర్తిగా నిష్ఫలమే. బీజేపీ ఒక్కటే వికల్పం, సంకల్పం. మీరు రఘునందన్ రావు, బీబీ పాటిల్‌కు ఓటు వేస్తే నేరుగా మోదీకి వేసినట్లే. తెలంగాణ అభివృద్ధికి మా ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చుచేసింది. 4 వందేభారత్ రైళ్లు, 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, మెదక్–ఎల్లారెడ్డి–బోధన్ జాతీయ రహదారిపై నిర్ణయం, సంగారెడ్డి–అకోల–నాందేడ్ నేషనల్ హైవే పూర్తి, అందోల్–నారాయణఖేడ్–జుక్కల్ రోడ్డులో కనెక్టివిటీ పెంపు...ఇలా ఎన్నో చర్యలు చేపట్టాం’ అని మోదీ చెప్పారు.
కాంగ్రెస్‌ను ఒక్క సీట్లో గెలుపైనా అవసరమా?
‘కేంద్రం ఎన్నో ప్రయాసలకు ఓర్చి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తుంటే... ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సంకుచిత రాజకీయాలు చేస్తోంది. సమ్మక్క, సారక్క గిరిజన వర్సిటీ స్థాపనకు కేంద్రం చర్యలు తీసుకుంటే నేటికీ దానికి అవసరమైన భూమి ఇవ్వలేదు. మనోహరాబాద్–సిద్దిపేట–కోటపల్లి రైల్వేలైన్‌కు భూమి కేటాయించలేదు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ను ఒక్క ఎంపీ సీట్లో అయినా ప్రజలు గెలిపించాల్సిన అవసరముందా? కనీసం హైదరాబాద్‌లో పండుగ నిర్వహించుకోవాలంటే కూడా చివరకు శ్రీరామ నవమికి కూడా ఆంక్షలు పెట్టింది.
ఒక వర్గం ఓట్ల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్‌కు రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించారు.. కానీ కాంగ్రెస్ ఏం చేసింది. గెలిచాక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాలరాసింది. ఏపీని ఒక ప్రయోగశాలగా మార్చి ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టింది. రాజ్యాంగం, రిజర్వేషన్లపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను. మీ కోసం నేను పోరాడతాను’ అని చెప్పారు.
నెహ్రూ కాలం నుంచి మోసం
‘కాంగ్రెస్ మొదటి నుంచి రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను గౌరవించలేదు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ రాజ్యాంగాన్ని అవహేళన చేసి పెద్ద తప్పు చేశారు. ఆయన తర్వాత ఇందిరాగాంధీ తన రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. ఎమర్జెన్సీ విధించారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మీడియా, పత్రిక స్వేచ్ఛను హరించారు.
మన్మోహన్ సింగ్ కేబినెట్ చట్టరూపకంగా బిల్లును తెస్తే.. దాన్ని రాహుల్ చింపివేశారు. రాజ్యాంగానికి వారిచ్చే గౌరవమిది. రాజ్యాంగాన్నే కాదు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కూడా అవమానించి అప్పటి అధ్యక్షుడు సీతారాం కేసరిని బాత్‌రూంలో బంధించి సోనియాగాం«దీని అధ్యక్షురాలిని చేశారు. వీరికి అధికారమే సర్వస్వం’ అని మోదీ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment