బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల చరిత్రలో ఉన్నవి ఈ రెండే
ఆదిలాబాద్ బీజేపీ బహిరంగ సభలో ప్రధాని ఫైర్
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ సర్కారు పోయి కాంగ్రెస్ వచ్చినా అయ్యేదేమీ లేదు
కాళేశ్వరం అవినీతిని కాంగ్రెస్ కప్పిపుచ్చుతోంది... మీరు తిన్నారు, మేము తింటామనే రీతిలో వ్యవహరిస్తోంది
తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
మోదీ గ్యారంటీ అంటే.. గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ
వికసిత్ భారత్– వికసిత్ తెలంగాణ లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధి చేస్తాం
కుటుంబ పాలనలో ఇండియా కూటమి పార్టీలు నిండా మునిగాయని ధ్వజం
ఈసారి 400కు పైగా లోక్‌సభ సీట్లలో గెలుస్తామన్న ప్రధాని మోదీ
సాక్షి, ఆదిలాబాద్: కుటుంబ పార్టీల ముఖాలు వేర్వేరుగా ఉన్నా వారి చరిత్ర ఒకటేనని.. అబద్ధాలు ఆడటం, దోచుకోవడమనే రెండు అంశాలు వాటి చరిత్రలో తప్పకుండా ఉంటాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారినా మార్పేమీ లేదని.. ఇప్పుడు బీఆర్‌ఎస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా అయ్యేదేమీ లేదని విమర్శించారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటేనన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే కాంగ్రెస్ దానిపై విచారణ చేయకపోగా కప్పిపుచ్చుతోందని ఆరోపించారు. ‘మీరు బాగుపడ్డారు.. మేమూ బాగుపడతాం.. మీరు తిన్నారు.. మేమూ తింటాం..’ అన్నట్టుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల తీరు ఉందని విమర్శించారు. సోమవారం ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. అనంతరం బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రసంగించారు. వివరాలు మోదీ మాటల్లోనే..
‘‘ఇది ఎన్నికల సభ కాదు.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదు. నాకు ఎన్నికలు ముఖ్యం కాదు.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం.. మీరంతా వికసిత్ భారత్ కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. దేశ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల పనులు చేపట్టాం. ఈ పదిహేను రోజుల్లో దేశంలో పలు ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఐఏఎంలు, ఎయిమ్స్‌లను ప్రారంభించాం. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆత్మనిర్భర్ భారత్ నుంచి వికసిత్ భారత్‌గా మారింది.
కుటుంబ పార్టీలను నమ్మొద్దు
అవినీతి, కుటుంబ పాలనలో ఇండియా కూటమి నేతలు నిండా మునిగారు. వారి తీరును నేను ప్రశ్నిస్తుంటే.. వారు నాపై ప్రతిదాడి చేస్తున్నారు. మోదీకి కుటుంబం లేదని విమర్శిస్తున్నారు. ఆ కుటుంబ పార్టీలను నమ్మొద్దు. ఎవరికైనా జైలుశిక్ష పడకపోతే రాజకీయాలకు పనికి రారని అన్నా అంటారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది. గత పదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారు. వచ్చే 25 సంవత్సరాల్లో.. అంటే 2047 నాటికి ప్రపంచంలో సమృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 400కుపైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తాం.
బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. మోదీ గ్యారంటీ అంటే.. గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ. గతంలో నేను చెప్పిన విధంగా సమ్మక్క–సారలమ్మ కొలువున్న చోట గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నాం. పత్తి రైతులకు ప్రయోజనకరంగా మద్దతు ధరను రికార్డు స్థాయిలో పెంచడం జరిగింది. దేశంలో ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులను నిర్మిస్తుండగా.. అందులో ఒకటి తెలంగాణలో చేపడుతున్నాం. వికసిత్ భారత్– వికసిత్ తెలంగాణ లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధి చేస్తాం.
రామ్‌లల్లా ఆశీర్వాదం ఉంటుంది
రామ మందిరం బంగారు తలుపులు, ధ్వజ స్తంభం నిర్మాణంలో తెలంగాణ పాత్రను దేశం గుర్తించింది. రామ్ లల్లా ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఉంటుంది. రాంజీ గోండ్, కుమురంభీం వంటి యోధుల త్యాగాలకు తగ్గట్టుగా గత ప్రభుత్వాలు వ్యవహరించలేదు. మేం 2014 నుంచి ఆదివాసీల అభివృద్ధికి పాటుపడుతున్నాం. ఆదివాసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో రాంజీ గోండ్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. పీఎం జన్‌మన్ యోజనతో అంతరించిపోతున్న గిరిజన జాతుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాం.
140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం
దేశంలోని 140 కోట్ల ప్రజలంతా నా కుటుంబమే. చిన్ననాడు ఒక కలతో ఇల్లు విడిచి బయటకు వచ్చాను. దేశ ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను. ప్రతి క్షణం ప్రజల కోసమే పరితపిస్తాను. నాకంటూ ప్రత్యేకంగా కలలు లేవు. ప్రజల కలల సాకారమే నా లక్ష్యం. కోట్ల మంది ప్రజలు నన్ను ఇంటి మనిషిగా భావిస్తారు. ‘మేరా భారత్– మేరా పరివార్’..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా సభలో ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీసీ కమిషన్ జాతీయ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం, ఎంపీ బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగులో ప్రసంగం మొదలుపెట్టి..
ప్రధాని మోదీ తన ప్రసంగంలో పలుమార్లు తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ప్రసంగం మొదట్లోనే ‘నా తెలంగాణ కుటుంబ సభ్యుల్లారా.. నమస్కారం’ అంటూ ప్రారంభించారు. మధ్యలో ‘అబ్‌కీ బార్.. చార్‌సౌ పార్..’ అని మొదట హిందీలో చెప్పి తర్వాత.. ‘ఈసారి నాలుగు వందల సీట్లు.. బీజేపీకే ఓటు వేయాలి..’ అని తెలుగులో పిలుపునిచ్చారు. ‘మోదీ గ్యారంటీ అంటే.. గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ..’’ అని చెప్పారు. ‘మై హూ.. మోదీకా పరివార్’ అని చెప్పిన మోదీ తర్వాత ‘మై హూ..’ అంటూ ‘మోదీకా పరివార్’ అంటూ జనంతో చెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment