దోపిడీ దొంగల్ని వదలం: ప్రధాని మోదీ | PM Narendra Modi Fires On BRS and Congress | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగల్ని వదలం: ప్రధాని మోదీ

Published Tue, Mar 19 2024 12:39 AM | Last Updated on Tue, Mar 19 2024 12:39 AM

PM Narendra Modi Fires On BRS and Congress - Sakshi

తెలంగాణను దోచుకున్న వారెవరైనా సరే వదిలేది లేదు.. ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ

దేశ ప్రయోజనాల కోసమే పనిచేసే బీజేపీని ఆశీర్వదించండి.. జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని పిలుపు

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలపై ధ్వజం

రెండూ అవినీతి పార్టీలే.. ఇద్దరూ తోడు దొంగలే

ఒక దోపిడీదారు మరో దోపిడీదారుపై పోరాడలేరు

అందుకే బీఆర్‌ఎస్‌ దోపిడీపై కాంగ్రెస్‌ మౌనం వహిస్తోంది

కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారింది.. ఇక్కడి డబ్బును ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు 

లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల పని అయిపోతుంది

సాక్షి ప్రతినిధి ,కరీంనగర్‌: ‘తెలంగాణను దోచుకున్న వారెవరైనా సరే వదిలేది లేదు. ఇది నరేంద్ర మోదీ ఇస్తున్న గ్యారంటీ. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ అవినీతి పార్టీలే. ఇద్దరూ తోడు దొంగలే. కాబట్టి తెరవెనుక స్నేహాలతో పరస్పరం సహకరించుకుంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారింది. 

ఇక్కడి డబ్బును ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు. కుంభకోణాల కోసం పనిచేసే కుటుంబ పార్టీల్లా కాకుండా, దేశ ప్రయోజనాల కోసమే పనిచేసే బీజేపీని ఆశీర్వదించండి. అబ్‌కీ బార్‌.. 400 పార్‌. తెలంగాణ కోసం అనేక పనులు చేశాం, వచ్చే సర్కారులో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం..’ అని ప్రధాని మోదీ చెప్పారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం మైదానంలో నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. 

శక్తి ఆశీర్వాదం ఎవరికో జూన్‌ 4న తెలుస్తుంది
‘మే 13న తెలంగాణ ఓటర్లు సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను బీజేపీ చిత్తు చేస్తుంది. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకూ ఆదరణ పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఇటీవల రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించాం. జూన్‌ 4న 400 ఎంపీ సీట్లు దాటేస్తాం అని దేశమంతా అంటోంది. వికసిత్‌ తెలంగాణ, వికసిత్‌ భారత్‌ కోసం, పేదల అభ్యున్నతి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాలు, మహిళా అభివృద్ధి, ఆత్మ నిర్భర్‌ భారత్‌ కోసం, దేశం మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించేందుకు.. ‘‘400 ఎంపీ సీట్లు దాటాలి.. బీజేపీకి ఓటు వేయాలి’’ (అని తెలుగులో పిలుపునిచ్చారు). తెలంగాణ ప్రజలు ‘‘అబ్‌ కీ బార్‌.. చార్‌ సౌ పార్‌’’ అని నినదిస్తున్నారు. శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తిని పూజించే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతోంది. శక్తిని ఖతమ్‌ చేస్తానన్న రాహుల్‌ గాంధీ ఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నా. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్‌ 4 న తెలుస్తుంది..’ అని ప్రధాని అన్నారు. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ తెరవెనుక స్నేహితులే
‘తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల. బీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజలను దోచుకుంది. ఒక దోపిడీదారు.. మరో దోపిడీదారుపై పోరాడలేరు. అందుకే బీఆర్‌ఎస్‌ దోపిడీపై కాంగ్రెస్‌ మౌనం వహిస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఇద్దరూ తెరవెనుక స్నేహితులే. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పని అయిపోతుంది. తెలంగాణ కలలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు నాశనం చేశాయి. ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలతో బీఆర్‌ఎస్‌ చెలగాటమాడింది.

ఇక అధికారంలోకి రాకముందు అనేక మాటలు మాట్లాడిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం సహా దేనిపైనా విచారణ చేయడం లేదు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ నిలదీయడం లేదు. వీరిద్దరి అవినీతిపై విచారణ చేపడదామనుకుంటే.. రెండు పార్టీలు రాత్రీ పగలు మోదీని నిందించడమే పనిగా పెట్టుకుంటున్నాయి.

మా పాలనలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం రూ.6,400 కోట్లతో రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని పునరుద్ధరించాం. జాతీయ రహదారులిచ్చాం. పసుపు ధరను క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి రూ.30 వేలకు పెంచాం. ఇక్కడి గత ప్రభుత్వాలు నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయి. మేం మళ్లీ అధికారంలోకి రాగానే వచ్చే పదేళ్లలో తెలంగాణలో రైలు, రోడ్డు తదితర మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేస్తాం..’ అని మోదీ హామీ ఇచ్చారు. 

17 సీట్లు గెలిపించాలి: కిషన్‌రెడ్డి
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రజలకు సుస్థిరమైన, నీతివంతమైన పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లలో దేశం అన్ని రంగాల్లో పురోగమించిందని, మన రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు నిధులు ఇచ్చారని అన్నారు. పదేళ్లలో కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచుకుందని, ఆయన కూతురు కవిత లిక్కర్‌ దందా చేశారని, తెలంగాణ సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. మోదీ తాను తెలుగు నేర్చుకోవడమే కాకుండా తెలుగు భాషను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. మోదీ ప్రసంగాలను తెలుగులో వినేలా ట్విట్టర్‌లో ‘నమో ఇన్‌ తెలుగు’ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 17కు 17 సీట్లు గెలిపించాలని కోరారు. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి స్కాం వెనుక కుటుంబ పార్టీలు..
‘దేశంలో ఎక్కడ కుంభకోణం జరిగినా దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్‌ (డీఎంకే), నేషనల్‌ హెరాల్డ్‌ (కాంగ్రెస్‌), బోఫోర్స్‌ (కాంగ్రెస్‌), కొలువుల స్కాం (ఆర్జేడీ) తదితరాలు ఇందుకు నిదర్శనం. తాజాగా ఆ జాబి తాలో బీఆర్‌ఎస్‌ కూడా చేరింది. కుటుంబ పార్టీ బీఆర్‌ఎస్‌ కాళేశ్వరంలో అవినీతికి పాల్పడింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలోనూ బీఆర్‌ఎస్‌ నేతల పాత్ర ఉంది. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకోవాలని చూస్తాయి. కానీ బీజేపీకి ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. అందుకే, జూన్‌ 4న ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, గోమాస శ్రీనివాస్‌లను గెలిపించాలి..’ అని ప్రధాని విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement