మహేశ్‌కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షీలను గజమాలతో సన్మానిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
బీఆర్‌ఎస్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్
సాక్షి,ఆదిలాబాద్: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకి.. ఏడాది కాంగ్రెస్ పాలనకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించిన పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు వస్తారా..అంటూ బీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరారు. ‘ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సఫలమయ్యాం. వచ్చే నాలుగేళ్లలో అకుంఠిత దీక్షతో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తాం. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం సీట్లు గెలుచుకునేందుకు కృషి చేస్తాం. ఇప్పటి నుంచే ఈ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం ’అని చెప్పారు.
ఒక్క కుర్చి.. ముగ్గురు కొట్లాట
బీఆర్‌ఎస్‌లో ఒక్క కుర్చీ కోసం ముగ్గురు కొట్లాడుతున్నారని మహేశ్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఇటు కేటీఆర్..అటు కవిత ప్రయత్నిస్తుంటే మధ్యలో హరీశ్‌రావు గోవిందా అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వేరే పార్టీ చూసుకోవడం ఖాయమన్నారు. ఫార్ములా – ఈ రేసు కేసులో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారని, మొదట పనికిరాని కేసు అన్న కేటీఆర్ ఇప్పుడు కోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ముఖచిత్రం ఉండదన్నారు. ఏ ముఖం పెట్టుకొని ఎమ్మెల్సీ కవిత ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారని ఎద్దేవా చేశారు.
సంక్రాంతి తర్వాత తీపి కబురు..
సంక్రాంతి తర్వాత పార్టీ నేతలకు తీపి కబురు ఉంటుందని మహేశ్‌కుమార్ అన్నారు. అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment