హరియాణాలో హోరాహోరీ
గత ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్
ఈసారి కాంగ్రెస్ గట్టి పోటీ
రాష్ట్రంలో చతుర్ముఖ పోరు
కురుక్షేత్ర యుద్ధాన్ని తలదన్నే రాజకీయాలకు హరియాణా ఆలవాలం. కుల సమీకరణాలు, పొత్తులు, కూటములు, వేరుకుంపట్లు ఇక్కడ పరిపాటి. జాతీయ పార్టీలతో పాటు ఒకప్పుడు చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీలూ రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి.
రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆధిపత్యం లభిస్తూ వస్తోంది. 2005 నుండి 2014 దాకా కాంగ్రెస్ చక్రం తిప్పగా పదేళ్లుగా బీజేపీ పట్టు బిగించింది. గత ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసి 10 సీట్లను క్లీన్‌స్వీప్ చేసిన కమలనాథులను రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు కలవరపెడుతున్నాయి. గత ఎన్నికల్లో సున్నా చుట్టిన కాంగ్రెస్ ఈసారి ఇండియా కూటమి రూపంలో కాషాయ పార్టీని ఢీకొడుతోంది... – సాక్షి, నేషనల్ డెస్క్
ఇండియా కూటమి, ప్రాంతీయ పార్టీలు సై...
రైతు సమస్యలు తదితరాలతో రాష్ట్రంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతోంది. పొత్తులో భాగంగా 9 సీట్లలో కాంగ్రెస్, ఒకచోట ఆప్ పోటీ చేస్తున్నాయి. మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా సారథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 31 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
ధరల పెరుగుదల, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, విపక్షాలపై వేధింపులు, నిరుద్యోగం తదితరాలను ఇండియా కూటమి ప్రచారా్రస్తాలుగా చేసుకుంది. రైతు ఆందోళనలకు మద్దతుతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత హామీలను మేనిఫెస్టోలో చేర్చడం కలిసొస్తుందని ఆశపడుతోంది. ఐఎన్‌ఎల్‌డీ, జేజేపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తూ జాతీయ పార్టీలకు సవాలు విసురుతున్నాయి.
అయితే జేజేపీ హరియాణా రాష్ట్ర చీఫ్ నిషాన్ సింగ్ ఎన్నికల వేళ పార్టీకి గుడ్‌బై చెప్పి షాకిచ్చారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కార్పొరేట్ దిగ్గజం నవీన్ జిందాల్ కురుక్షేత్రలో ఆప్ నేత సుశీల్ గుప్తాతో తలపడుతున్నారు. అది హాట్ సీట్‌గా అందరినీ ఆకర్షిస్తోంది. 2004, 2009ల్లో కాంగ్రెస్ తరఫున ఇక్కడ గెలిచిన జిందాల్ 2014లో బీజేపీ చేతిలో ఓడారు. 2019లో పోటీకి దూరంగా ఉన్నారు.
బీజేపీకి కొత్త కష్టాలు...
2014 లోక్‌సభ ఎన్నికల్లో 7 సీట్లు గెలిచిన ఊపులో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించింది. మనోహర్‌లాల్ ఖట్టర్ సీఎం అయ్యారు. 2019లో 10 లోక్‌సభ సీట్లూ నెగ్గినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పుంజుకోవడంతో హంగ్ వచ్చింది. అయినా జేజేపీ, స్వతంత్రుల మద్దతుతో బీజేపీ మళ్లీ గద్దెనెక్కింది. జేజేపీ చీఫ్ దుష్యంత్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.
లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విభేదాలతో బీజేపీ, జేజేపీ పొత్తుకు తెరపడింది. దాంతో ఖట్టర్, దుష్యంత్ రాజీనామా చేశారు. ఎన్నికల ముందు ఓబీసీ వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీ సీఎం అయ్యారు. తాజాగా వెల్లువెత్తిన రైతు ఆందోళనలూ బీజేపీకి ప్రతికూలంగా మారొచ్చని భావిస్తున్నారు. మోదీ కరిష్మా, అయోధ్య రామమందిర నిర్మాణం, హిందుత్వ నినాదం తదితరాలనే పార్టీ నమ్ముకుంది.
ప్రాంతీయ పార్టీల్లో చీలికలు...
ఐఎన్‌ఎల్‌డీ వ్యవస్థాపకుడు, హరియాణా సీఎంగా, ఉప ప్రధానిగా చేసిన చౌదరి దేవీలాల్ అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన కుమారుడు ఓం ప్రకాశ్ చౌతాలా నాలుగుసార్లు సీఎం అయ్యారు. ఉద్యోగ నియామకాల కుంభకోణంలో ఆయన, అవినీతి కేసుల్లో పెద్ద కుమారుడు అజయ్ సింగ్ చౌతాలా జైలుకెళ్లారు. దాంతో రెండో కుమారుడు అభయ్ సింగ్ చౌతాలా పార్టీ పగ్గాలు చేపట్టారు. అన్నదమ్ముల కుమ్ములాటతో పార్టీ చీలిపోయింది.
అజయ్ సింగ్ కుమారులైన దుష్యంత్ చౌతాలా, దిగ్విజయ్ చౌతాలాను పార్టీ నుంచి తొలగించారు. దాంతో తండ్రి, సోదరునితో కలిసి దుష్యంత్ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)ని స్థాపించారు. జేజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోటీ చేసినా ఒక్క సీటూ దక్కలేదు. అభయ్ సారథ్యంలోని ఐఎన్‌ఎల్‌డీ కూడా ప్రభావం చూపలేకపోయింది.
2014లో హరియాణా జనహిత్ కాంగ్రెస్ (హెచ్‌జేసీ–బీఎల్) తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి పెద్దగా ప్రయోజనం లభించలేదు. బీజేపీ 8 స్థానాల్లో పోటీ చేసి ఏడింటిని దక్కించుకోగా మూడు చోట్ల పోటీ చేసిన హెచ్‌జేసీకి ఒక్క సీటూ దక్కలేదు. హరియాణా లో మూడుసార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేసిన భజన్‌లాల్ 2007లో కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్‌తో కలిసి ఈ పార్టీని స్థాపించారు. 2016లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
పోలింగ్ తేదీ: మే 25
సర్వేలు ఏమంటున్నాయి?!
బీజేపీ 8, ఇండియా కూటమి 2 సీట్లలో గెలుస్తాయని తాజా ఎన్నికల సర్వేలు అంచనా వేశాయి. సీఎం మార్పు, ప్రభుత్వ వ్యతిరేకత, రైతు ఆందోళనలు, తదితర పరిణామాలు కమలనాథుల జోరుకు కళ్లెం వేస్తాయని మరికొందరు రాజకీయ పండితులు అంటున్నారు.
హరియాణా రాజకీయాలు జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎత్తుజిత్తుల నడుమ సాగుతున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు సీట్లు గెలిచిన బీజేపీ 2019లో ఒంటరిగా పోటీ చేసి మొత్తం 10 సీట్లూ ఒడిసిపట్టింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటూ దక్కలేదు. ప్రాంతీయ పార్టీ ఇండియన్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) 2014లో గెలిచిన 2 సీట్లనూ పోగొట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment