Sakshi News home page

కోహ్లీలా కేసీఆర్‌ సెంచరీ!

Published Tue, Nov 7 2023 3:48 AM

KTR Comments on Rahul Gandhi - Sakshi

సిరిసిల్ల: క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ లాగా రాష్ట్రంలో కేసీఆర్‌ సెంచరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ మళ్లీ సీఎం అయితే ఊరుకోడు.. మహారాష్ట్రలో అడుగు పెడతాడు, కర్ణాటకలో అడుగు పెడతాడు.. తర్వాత ఢిల్లీలో గులాబీ జెండా పాతాలని చూస్తాడని రాహుల్‌గాందీ, నరేంద్రమోదీ భయపడుతున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ వాళ్లిద్దరికీ కొరకరాని కొయ్యలా అయ్యాడని అన్నారు. కేసీఆర్‌ ఢిల్లీకొస్తే తమ కొంప మునుగుతుందని ఇక్కడే ఖతం చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో ఇస్తున్నట్లుగా 24 గంటల కరెంట్‌ దేశమంతా ఇవ్వాలని, దేశమంతా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి అమలు చేయాలని, జిల్లాకో మెడికల్‌ కాలేజీ, నాణ్యమైన విద్యనందించే గురుకులాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని వివరించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, ఎల్లారెడ్డిపేటల్లో జరిగిన యువ సమ్మేళనం సభల్లో మంత్రి మాట్లాడారు.  

తెలంగాణ సినిమాకు అన్నీ కేసీఆరే 
తెలంగాణలో కాంగ్రెస్‌కు, బీజేపీలకు లోకల్‌ లీడర్లు లేక.. కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్‌ల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కానీ తెలంగాణ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌.. అన్నీ కేసీఆరేనని, మన సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ‘అదే ప్రతిపక్షాలకు కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టర్, యాక్టర్‌ పక్కోడు.. వాళ్లది డిజాస్టర్‌’అని అన్నారు. ఆ రెండు పారీ్టలు ఢిల్లీలో ఉస్కో అంటే.. ఇక్కడ డిస్కో అంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎవరూ ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు.  

11సార్లు చాన్సిస్తే ఏం చేశారు? 
ఢిల్లీ నాయకులు తెలంగాణ విషయంలో ఏనాడూ మర్యాదగా ప్రవర్తించలేదని మంత్రి అన్నారు. పోరాటాలు, త్యాగాలు, కేసీఆర్‌ ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. ఒక్క చాన్స్‌ అంటున్న కాంగ్రెస్‌ పారీ్టకి 11 సార్లు అవకాశం ఇస్తే.. ఏం చేసిందని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్‌ ఎందుకు ఇయ్యలేదని నిలదీశారు. ఆ పుర్రెలేని రాహుల్‌గాం«దీకి మేడిగడ్డ ప్రాజెక్టుపై వచ్చిన పర్రె (పగులు) కూడా తెలియదని విమర్శించారు. తాము రాజకీయ హిందువులం కాదని, నిజమైన హిందువులమని స్పష్టం చేశారు.  

స్టెప్పులేసి జోష్‌ పెంచిన కేటీఆర్‌ 
ఎల్లారెడ్డిపేట యువ సమ్మేళనం వేదికపై కేటీఆర్‌ స్టెప్పులేశారు. ఎన్నికల పాట ‘దేఖ్‌లేంగే..’కు యువ నాయకులతో కలిసి నృత్యం చేసి వారిలో ఉత్సాహం నింపారు. సభికులు కేరింతలు కొడుతూ వారు కూడా స్టెప్పులేయడంతో ఆ ప్రాంతం మార్మోగింది. స్థానిక నాయకులను పేరుపేరునా పిలిచిన మంత్రి వారిలో జోష్‌ నింపారు. వేములవాడ సభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, వేములవాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. 

జాబ్‌ కేలండర్‌ ప్రకటించే బాధ్యత నాది
రాబోయే రోజుల్లో యువతతో మమేకమవుతామని, జాబ్‌ కేలండర్‌ను ప్రకటించే బాధ్యతను తాను తీసుకుంటానని కేటీఆర్‌ ప్రకటించారు. జి ల్లాకో నైపుణ్య శిక్షణ కేంద్రం, నియోజకవర్గానికో స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి పరిశ్రమలను ప్రోత్సహిస్తానని, స్వయం ఉపాధిని పెంచుతానని అన్నారు. తెలంగాణను దాచి దాచి దయ్యాల పాలు చేయొద్దని, ఎవరి చేతిలో ఉంటే తెలంగాణ పచ్చగా ఉంటుందో ఆలోచించాలని కోరారు.   

Advertisement
Advertisement