కదిరి టీడీపీ అభ్యర్థి కారులో రూ.2 కోట్ల నగదు | Sakshi
Sakshi News home page

కదిరి టీడీపీ అభ్యర్థి కారులో రూ.2 కోట్ల నగదు

Published Wed, May 1 2024 4:56 AM

నగదుతో పట్టుబడిన కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌కు  చెందిన కారు.. పోలీసులు స్వా«దీనం చేసుకున్న నగదు

అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు 

కారు సీజ్‌.. డ్రైవర్‌ ఆనంద్‌ కుమార్‌ అరెస్ట్‌

అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌కు చెందిన ఫార్చునర్‌ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు మంగళవారం అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. స్థానిక విద్యుత్‌ నగర్‌ సర్కిల్‌లో పోలీసులు పట్టుకున్నారు. కారు డ్రైవర్‌ ఆనంద్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. కారును సీజ్‌ చేశారు. 

అనంతపురం టూటౌన్‌ సీఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల విధుల్లో భాగంగా అనంతపురం టూటౌన్‌ పోలీసులు స్పెషల్‌ పార్టీ, మొబైల్‌ స్క్వాడ్‌ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం అనంతపురం విద్యుత్‌ నగర్‌ సర్కిల్‌లో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఏపీ 39 ఆర్‌క్యూ 0999 ఫార్చునర్‌ వాహనాన్ని తనిఖీ చేశారు. మూడు బ్యాగుల్లో నగదు పట్టుబడింది. దాన్ని లెక్కించి రూ.1,99,97,500 ఉన్నట్టు నిర్ధారించారు. పంచనామా నిర్వహించి.. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్‌ చేశారు.  

రామ్‌నగర్‌ నుంచి తరలిస్తూ.. 
కందికుంట వెంకటప్రసాద్‌ కారు డ్రైవర్‌ సోమవారం రాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తిని పికప్‌ చేసుకుని అనంతపురం రాజు రోడ్డులోని టీడీపీ నాయకుడికి చెందిన మాసినేని హోటల్‌లో దించినట్టు సమాచారం. రాత్రి అక్కడే బస చేసిన డ్రైవర్‌ మంగళవారం ఉదయం అనంతపురం రామ్‌నగర్‌లోని ఓ ఇంటి నుంచి మూడు బ్యాగుల్లో నగదు సమకూర్చుకున్నట్టు సమాచారం. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్, సూర్యానగర్‌ రోడ్డు మీదుగా నేరుగా కదిరికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. తనిఖీలు ఉంటాయనే ఉద్దేశంతో విద్యుత్‌ నగర్‌ సర్కిల్‌ మీదుగా వాహనాన్ని మళ్లించారు. కానీ.. పోలీసులు విద్యుత్‌ నగర్‌ సర్కిల్‌లోనూ వాహన తనిఖీలు చేపట్టడంతో నగదు పట్టుబడింది. 

కారు కందికుంట పేరుతోనే.. 
ఏపీ 39 ఆర్‌క్యూ 0999 నంబర్‌ గల ఫార్చునర్‌ కారు కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ పేరుతోనే రిజి్రస్టేషన్‌ అయింది. నగదు పట్టుబడిన విషయం తెలిసిన వెంటనే వెంకటప్రసాద్‌ నల్లచెరువు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించుకుని కదిరిలోని ఇంటికి వెళ్లిపోయారు. 

కదిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమనే సంకేతాలు వస్తుండటంతో కందికుంట అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లకు నగదు ఎర వేయడానికి సిద్ధమయ్యారు. అనంతపురం, ఇతర ప్రాంతాల నుంచి డబ్బు తెప్పించుకుని కదిరిలో పంచేలా ప్రణాళిక రచించుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తనిఖీల్లో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. 

ఆదాయపు పన్ను అధికారుల విచారణ 
వెంకటప్రసాద్‌ వాహన డ్రైవర్‌ ఆనంద్‌కుమార్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరిచ్చారు? ఇందుకు సంబంధించిన పత్రాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. రూ.10 లక్షలకు పైగా నగదు తీసుకెళ్తూ పట్టుబడితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. 

డ్రైవర్‌ ఆనంద్‌కుమార్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా విచారిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదును తరలించడానికి గల కారణాలు ఏమిటి? బ్లాక్‌ మనీ కాకపోతే అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం ఎవరి నుంచి తీసుకున్నారు? ఎందుకు ఇంత పెద్దమొత్తంలో నగదు ఇవ్వాల్సి వచ్చింది? తదితర కోణాల్లో ఆరా తీస్తున్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement