సత్తా పోతున్న సంజీవనులు! | Sakshi
Sakshi News home page

సత్తా పోతున్న సంజీవనులు!

Published Wed, Jan 24 2024 4:59 AM

Sakshi Editorial On Doctors About Antibiotics

ప్రాణాలు నిలపాల్సిన ఔషధం కాస్తా మనం చేస్తున్న తప్పుల వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోతే? మానవాళికి అది మహా ప్రమాదమే. యాంటీ బయాటిక్స్‌ వినియోగంలో మనం తరచూ చేస్తున్న తప్పుల వల్ల ఆ పరిస్థితే దాపురిస్తోందని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్‌ అతిగా వాడడం, లేదంటే నిర్ణీత మోతాదులో సరిగ్గా వాడకపోవడం వల్ల చివరకు ఆ ఔషధాలకు కొరుకుడుపడని ప్యాథోజెన్‌లు వృద్ధి చెందుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అర్హత గల వైద్యులు రాసిచ్చిన మందుల చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్‌ను విక్రయించవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా అభ్యర్థించింది.

అలాగే, యాంటీ బయాటిక్స్‌ వాడాల్సిందిగా రాసినప్పుడు అందుకు కారణాల్ని సైతం పేర్కొనాల్సిందిగా వైద్యులకు పిలుపునిచ్చింది. యాంటీ బయాటిక్స్‌ వాడకంలో వివేకంతో వ్యవహరిస్తేనే, మందులకు లొంగని వ్యాధికారక జీవులను అరికట్టవచ్చని మరోసారి నొక్కిచెప్పింది. కొత్త యాంటీ బయాటిక్స్‌ పరిశోధన, అభివృద్ధి అనేది పరిమితంగానే ఉన్నందున ఔషధ వినియోగంపై తక్షణం అప్రమత్తం కావాలన్న సూచన అందరికీ ఓ మేలుకొలుపు. 

బ్యాక్టీరియా నిర్మూలనకు ఉద్దేశించిన ఔషధాలపై సదరు సూక్ష్మజీవులే విజయం సాధించడం, వాడే మందుల వల్ల అవి చావకపోగా పెరగడమనేది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య. దీనికే వైద్యపరిభాషలో ‘యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌’ (ఏఎంఆర్‌) అని పేరు. ఈ ఏఎంఆర్‌ వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఔషధాలకు నిరోధకత ఏర్పడ్డ ఇన్‌ఫెక్షన్లతో అదనంగా మరో 49.5 లక్షల మంది మరణించారని లెక్కలు చెబుతున్నాయి.

ఏఎంఆర్‌ వల్ల ఇన్‌ఫెక్షన్ల నివారణ, చికిత్స కుంటుబడడమే కాక, దీర్ఘకాలిక అనారోగ్యం పెరిగి, ప్రాణానికి ప్రమాదవుతుంది. బలం పెరిగిన ఈ ఇన్‌ఫెక్షన్లకు ముకుతాడు వేయాలంటే బాగా ఖరీదైన రెండో శ్రేణి ఔషధాలే దిక్కు. వాటి ఖరీదు ఎక్కువ గనక, సామాన్యులకు చివరకు చికిత్సే అందని దుఃస్థితి. పొంచివున్న ఈ ప్రమాదానికి ఇప్పుడు కేంద్ర స్థానం మన దేశమేనట! ఇదే పరిస్థితి కొన సాగితే, 2050 నాటికి ఒక్క భారత్‌లోనే 20 లక్షల మంది చనిపోతారని అంచనా. క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు కలిపి సంభవించే మరణాల కన్నా ఈ సంఖ్య ఎక్కువ. ఇది ఆందోళనకరమైన అంశం. 

అరుదుగానే వాడాల్సిన వివిధ రకాల యాంటీ బయాటిక్స్‌ను పెద్ద మొత్తంలో మన దేశంలో యథేచ్ఛగా ఉపయోగిస్తున్నట్టు 2022 నాటి లాన్సెట్‌ అధ్యయనం తేల్చింది. వీటన్నిటి వల్లే, డాక్టర్‌ చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్‌ను షాపుల్లో నేరుగా రోగులకు అమ్మవద్దని ఆరోగ్య శాఖ ఇప్పుడు నొక్కిచెప్పింది. ఏఎంఆర్‌ విజృంభించకుండా అడ్డుకొనేందుకు వీలుగా సరైన రీతిలో యాంటీ బయాటిక్స్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఈ ప్రయత్నం హర్షణీయం.

యాంటీ బయాటిక్స్‌ 1945 నాటి ‘ఔషధాలు, సౌందర్య పోషకాల నిబంధనల’ ప్రకారం షెడ్యూల్‌ హెచ్‌ కిందకొస్తాయి. అంటే, రిజిస్టర్‌ చేసుకున్న మెడికల్‌ ప్రాక్టిషనర్‌ చీటీ రాస్తే తప్ప, వాటిని మందుల షాపుల్లో అడిగినవారందరికీ ఇవ్వరాదు. శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్‌నైతే ‘షెడ్యూల్‌ హెచ్‌1’లో చేర్చారు. ఈ రెండు షెడ్యూల్స్‌లోని ఔషధాలను డాక్టర్‌ సిఫార్సుతోనే ఫార్మసీలలో విక్రయిస్తే పెద్ద చిక్కు తప్పుతుంది. ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలన్నదే ఇప్పుడు ఆరోగ్యశాఖ ప్రయత్నం. 

ఏఎంఆర్‌ వల్ల మామూలు మందులు బ్యాక్టీరియాపై పని చేసే సత్తాను కోల్పోతాయనీ, ఫలితంగా సాధారణ అనారోగ్యాలు సైతం చివరకు ప్రాణాంతకంగా పరిణమిస్తాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సైతం ఇప్పటికే హెచ్చరించింది. చాప కింద నీరులా నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ ఏఎంఆర్‌ మహమ్మారి నవజాత శిశువుల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారికైనా, జీవితంలో ఏ దశలోనైనా ప్రాణాపాయమే.

కాబట్టి, రోగికీ, వైద్యుడికీ మధ్య పరస్పర విశ్వాసం, సత్సంబంధాలు అవసరం. అప్పుడే ఔషధ వినియోగం సక్రమంగా జరుగుతుంది. నిజానికి, యాంటీ బయాటిక్స్‌ దుర్వినియోగమే కాక ఇతర కారణాలూ ఏఎంఆర్‌కు ఉన్నాయి. శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, జనంలో చైతన్యం లేకపోవడమూ ఏఎంఆర్‌కు దోహదం చేస్తాయని నిపుణుల మాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. 

మన దగ్గర వాడుతున్న యాంటీ బయాటిక్స్‌ ‘నిర్ణీత మోతాదు కాంబినేషన్‌’ (ఎఫ్‌డీసీ)లు చాలావాటికి అనుమతులు లేవు. కొన్నయితే నిషేధానికి గురైనవి. భారత్, ఖతార్, బ్రిటన్‌లలో అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ సంగతి తేల్చారు. ఇంకా చెప్పాలంటే, దేశవ్యాప్తంగా అమ్ముతున్న 58 శాతం యాంటీ బయాటిక్స్‌ ఎఫ్‌డీసీలు తమ లెక్కలో ‘సిఫార్సు చేయరాదు’ అనే జాబితాలో ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ కుండబద్దలు కొట్టింది. అలాగే, వైరల్‌ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షనా అనేది నిర్ధారించకుండానే కొందరు వైద్యులు అతి జాగ్రత్తతో యాంటీ బయాటిక్స్‌ ఇస్తున్న కేసులూ లేకపోలేదు. మనం కళ్ళు తెరిచి, అవగాహనతో అడుగులు వేయాల్సిన సందర్భమిది. 

అసలంటూ ఏఎంఆర్‌పై అవగాహన పెంచేందుకు ఆరోగ్య శాఖ 2016లోనే ప్రయత్నం చేయకపోలేదు. కొన్ని మందులపై నిలువునా ‘ఎర్ర రంగు గీత’ వేయించి, డాక్టర్‌ చీటీ లేకుండా అవి వాడవద్దని చెప్పింది. ఎనిమిదేళ్ళలో ఆ ప్రయత్నం ఏ మేర ఫలించిందో తేల్చి, లోటుపాట్లు సరిదిద్దాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి నెలకొల్పిన ఏఎంఆర్‌ నిఘా, పరిశోధక వ్యవస్థను పటిష్ఠం చేయాలి. అన్నిటి కన్నా ముందుగా ఔషధ దుర్వినియోగ నివారణకై డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఫార్మా కంపెనీలు, సామాన్య జనం, సర్కారు కలసికట్టుగా నిలవాలి. సంజీవనులైన ఔషధాలే సత్తా కోల్పోతున్నాయంటే, అది మన స్వయంకృతాపరాధమని గ్రహించి, ఇకనైనా మారాలి.  

Advertisement
 
Advertisement
 
Advertisement