KSR Comment On Why BJP Distanced From TDP Jana Sena Manifesto, Details Inside | Sakshi
Sakshi News home page

బీజేపీని డిఫెన్స్‌లో పడేసిన సీఎం జగన్‌!

Published Wed, May 1 2024 3:56 PM

KSR Comment On Why BJP Distanced From TDP Jana Sena Manifesto

మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం కూటమిని ముందుగానే క్లీన్ బౌల్ చేసేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు బీజేపీతో కలిసి అట్టహాసంగా విడుదల చేయాలని అనుకున్న మేనిఫెస్టో విడుదల తుస్సు మంది. దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఆ మానిఫెస్టోని ముట్టుకోవడానికి ఇష్టపడక పోవడమే. ఇది జగన్ కొట్టిన దెబ్బే కదా!

ఆయన గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో 2014 శాసనసభ ఎన్నికల సమయంలో ఈ మూడు పార్టీలు కలిసి విడుదల చేసిన మేనిఫెస్టో గురించి, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీల ఫోటోలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు చూపుతూ అందులో ఇచ్చిన  వాగ్దానాల అమలు తీరు గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రజలలో ఇది విస్తృతంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ఈ ముగ్గురు మళ్లీ జనం ముందుకు వస్తున్నారని అంటూ అందులో ఉన్న అంశాలను చదివి వినిపించి ప్రజలతో సమాధానాలు ఇప్పిస్తున్నారు. అది ఈ మూడు  పార్టీలకు బాగా డ్యామేజీగా మారింది. వాటిలో ఒక్కదానికి కూడా చంద్రబాబు నాయుడు సమధానం ఇవ్వలేకపోతున్నారు. అంతేకాక తన సభలలోకాని, తన ఎన్నికల ప్రణాళిక విడుదలలో కాని జగన్ ఒక మాట చెబుతున్నారు.

2019లో తాను ఇచ్చిన మానిఫెస్టోని, అమలు ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలకు ఇస్తూ, 2024లో తాను చేయబోయే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు.  పాతవాటిని కొనసాగిస్తూ,కొత్తవి పెద్దగా ఇవ్వకుండా  చాలా జాగ్రత్తగా మేనిఫెస్టోని రూపొందించి దానికి అయ్యే వ్యయాన్ని వివరిస్తున్నారు. అలాగే చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పేరుతో ప్రచారం చేసిన వాగ్దానాలకు అయ్యే ఖర్చును లెక్కేసి చెబుతున్నారు. వాటి ప్రకారం చూస్తే చంద్రబాబుది పూర్తిగా ఆచరణసాధ్యం కాని మేనిఫెస్టో అని తేలిపోతుంది. ఈ పరిస్థితిలోనే తమ పరువు చంద్రబాబు చేతిలో మరింతగా  పోగొట్టుకోవడం ఇష్టం లేక ప్రధాని మోదీ వంటి బీజేపీ నేతలు తమ పేర్లు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టవద్దని చెప్పారట.  

బీజేపీ పెద్దలు  ఈ మేనిఫెస్టోకి దూరం అయితే, పవన్ కల్యాణ్ పెద్దగా చదువుకోలేదు. కాబట్టి చంద్రబాబు ఏమి చెబితే దానికి ఊగొట్టే స్థితిలో ఉన్నారు.  చంద్రబాబు తన పాత మేనిఫెస్టో ఊసుకాని, జగన్ అమలు చేసిన మేనిఫెస్టో సంగతులు కాని చెప్పకుండా ఆకాశమే హద్దుగా కొత్త హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తన సభలలో మళ్లీ ఈ ముగ్గురూ  చంద్రబాబు, పవన్,మోదీ మళ్ళీ జనాన్ని మోసం చేయడానికి వస్తున్నారని,  ఇంటింటికి బెంజ్ కారు ఇస్తామంటున్నారని, కిలో బంగారం ఇస్తామని చెబుతున్నారని నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇది బాగా క్యాచీ డైలాగుగా మారడంతో బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది.

చంద్రబాబు ఇచ్చే తప్పుడు  వాగ్దానాలకు తాము కూడా బాధ్యులవుతున్నామని, ఏ రాష్ట్రంలో లేని  విధంగా ఏపీలో చంద్రబాబు వల్ల అప్రతిష్టపాలు అవుతున్నామని అనుకున్నారేమో  కాని, కనీసం మోదీ , జేపీ నడ్డా, అమిత్ షా ,దగ్గుబాటి పురందేశ్వరి వంటి ఏ ఒక్క నేత ఫోటో మానిఫెస్టో పై వేయలేదు. టీడీపీ,జనసేనల రెండు  పార్టీల మేనిఫెస్టోగానే ప్రకటించవలసి వచ్చింది. కాకపోతే బతిమలాడి బీజేపీ ఇన్ చార్జీ సిద్దార్ద్  నాధ్ సింగ్ ను తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయనేమో మేనిఫెస్టో కాపీ పట్టుకోకుండా తిరస్కరించారు. పురందేశ్వరిని ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా బీజేపీ నిలువరించినట్లుగా ఉంది.లేకుంటే ఇంత ముఖ్యమైన  కార్యక్రమానికి రాకుండా ఉంటారా?  దీంతో మొత్తం ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన సందర్భం కాస్తా తుస్సు అంది.  

ఇదంతా జగన్ ఎఫెక్ట్ అన్న అభిప్రాయం కలుగుతుంది.చంద్రబాబు ఇచ్చిన హామీల విలువ సుమారు 1.65 లక్షల కోట్ల విలువ అని ఒక అంచనా. అదే జగన్ ఇచ్చిన హామీల వ్యయం రూ. 70 వేల కోట్లు. ఇంతకాలం జగన్ బటన్ నొక్కుడుతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు యు టర్న్ తీసుకుని ఇంకా తాము ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. అప్పట్లో జగన్ పై అడ్డగోలుగా రాసిన రామోజీ,రాధాకృష్ణలు, ప్రస్తుతం చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై విశ్లేషించడానికే భయపడుతున్నారు. ఇంత మొత్తం డబ్బు ఎక్కడనుంచి వస్తుందని అడిగితే చంద్రబాబు కు ఇబ్బందిగా ఉంటుందని  భావించి వారు దానికి జోలికి పోవడం లేదు.  కానీ పేజీల కొద్ది ఆ వాగ్దానాలను పరిచి తాము టీడీపీ పక్కా ఏజెంట్లమని ప్రజలకు మరోసారి తెలియచేశారు.

తెలంగాణ, కర్నాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలతో పాటు ఏపీలో జగన్ అమలు చేస్తున్న స్కీముల్ని కాపీ కొట్టి కొంత అదనంగా ఇస్తామని చంద్రబాబు  చెప్పారు.  కర్నాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తాము ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేక సతమతం అవుతున్నాయి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు చేసినా..  దానివల్ల ఆర్టీసీకి పెద్ద నష్టమే వస్తోంది. దానిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఎంత శ్రద్ద చూపుతుందన్నది అనుమానమే. ఈ పరిస్థితిలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కూడా కష్టమే అవుతుంది.

చంద్రబాబు ఇచ్చిన కొన్ని హామీలను చూద్దాం. వాటికి అయ్యే వ్యయం ఎంతో లెక్కగడదాం.

ఉదాహరణకు ఏపీలో 19-59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో రెండున్నర  కోట్ల మంది మహిళలు ఉన్నారనుకుంటే.. అందులో కోటి మంది 19 ఏళ్లలోపు వారు, 59 ఏళ్ల పైబడిన వారిని తీసివేస్తే దాదాపు కోటిన్నర మందికి ఈ  స్కీం అమలు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు రూ.2,250 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అంటే ఏడాదికి 27వేల కోట్ల రూపాయల ఖర్చు అన్నమాట.

నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు. వారి సంఖ్య ఎంతో చెప్పలేదు. పోని ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు కనుక,ఆ సంఖ్యనే ఆధారంగా తీసుకుంటే నెలకు రూ.600 కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. అంటే ఏడాదికి రూ. 7,200 కోట్లు అన్నమాట.

రైతులకు రైతు భరోసా కింద జగన్ ప్రభుత్వం 13 వేల  రూపాయలు ఇస్తోంది. దానిని 16 వేలు చేశారు. కాని చంద్రబాబు ఏకంగా ఇరవైవేలు ఇస్తామని అంటున్నారు.  ఆ ప్రకారం ఏడాదికి రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. పోనీ ఇందులో సగం కేంద్రం వాటా అనుకున్నా, ఐదువేల కోట్ల రూపాయలు రాష్ట్రం ఖర్చు పెట్టాలి.

అమ్మ ఒడి కింద ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున జగన్ ప్రభుత్వం ఇస్తోంది. దానిని 17వేలకు పెంచుతామని జగన్ తెలిపారు. చంద్రబాబు గతంలో తన ప్రభుత్వంలో ఈ స్కీమును  అమలు చేయకపోయినా, ఇప్పుడు ఇంటిలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి 15వేల రూపాయలు ఇస్తానంటున్నారు. ఇద్దరు పిల్లలనే లెక్కవేసుకుంటే పదిహేనువేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది.

వృద్దాప్య పెన్షన్ లను నెలకు నాలుగువేలు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు ఈ స్కీం అర్హతకు వయోపరిమితిని 50 ఏళ్లకు తగ్గిస్తామని టీడీపీ  చెబుతోంది. ప్రస్తుతం ఉన్న 65లక్షల మంది పేదలకు వీరు తోడవుతారు. దీని ప్రకారం నెలకు రూ.2,600 కోట్లు వ్యయం అవుతుంది.అంటే సంవత్సరానికి రూ.31 వేల కోట్లు అన్నమాట.

ల్యాండ్‌ టైటిలింగ్ చట్టంపై మళ్లీ అబద్దాలు ఆడారు. ఇది కేంద్ర ప్రతిపాదిత చట్టం అని పలువురు చెబుతున్నా వినకుండా చంద్రబాబు ఇదే ప్రచారం చేస్తున్నారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంత పాడుతున్నాయి. గతంలో పురందేశ్వరి  పొత్తు రాకముందు, టీడీపీ ఈ చట్టంపై చేస్తున్నది దుష్ప్రచారం అని స్పష్టంగా చెప్పారు. నిజంగానే  జగన్ ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈ చట్టం తెచ్చి ఉంటే,  కేంద్రానికి లేఖ రాసి వివరణ కోరవచ్చు కదా!. ఏ ప్రభుత్వం అయినా ప్రజల ఆస్తులను  లాక్కోవడానికి చట్టాలు చేస్తుందా? ఈ చట్టం ద్వారా ప్రజలకు  మరింత సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం అన్ని రాష్రాల కోసం  దీనిని ప్రతిపాదిస్తే, అంతతటిని జగన్ కు ఆపాదించి, నానా చెత్త ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే మోదీ ఉఏపీలో ఆస్తులను లాక్కోవడానికి ఈ చట్టం తెచ్చారని చంద్రబాబు అనాలి. ఒకప్పుడు తాను గొప్ప సంస్కరణవాదినని ప్రచారం చేసుకున్న  చంద్రబాబు నిజ స్వరూపం ఇది . కేంద్రాన్ని దీనిపై అడగకపోతేమానే.. సిద్దార్ద్ సింగ్ ,పురందేశ్వరిలలో ఎవరో ఒకరితో ఈ చట్టం గురించి మాట్లాడించి ఉండవచ్చు కదా! ఆయన అదేమీ చేయలేదంటే దాని అర్దం బీజేపీ ఇలాంటి పిచ్చి ఆరోపణలను పట్టించుకోదనే కదా! ఏదో మొక్కుబడికి  సిద్దార్ద్ నాద్ సింగ్ కూటమి మేనిఫెస్టోకి మద్దతు అని చెప్పారు. అది నిజమే అయితే ఎందుకు మోదీ ఫొటో ఈసారి వేయవద్దని ఎందుకు  చెప్పారో వివరణ ఇవ్వాలి కదా!

చంద్రబాబు చేసిన అన్ని హామీలను అమలు చేస్తే అసాధ్యం కనుకే, మరోసారి నవ్వుల పాలు కాకుండా ఉండడానికి మోదీ తన ఫొటో ప్రచురించడానికి ఇష్టపడలేదని అనుకోవాలి. అందుకే జగన్ తన స్పీచ్ లలో ఢిల్లీ పెద్దలు, బీజేపీ వారు కూడా చంద్రబాబును నమ్మడం లేదని తేల్చేశారు. బీజేపీతో కలిశాం కనుక ప్రత్యేక హోదా,విభజన హామీలు, తెలంగాణ నుంచి రావల్సిన బకాయిలు, ఆస్తుల విభజన సాధిస్తామని ఒక్క మాట చెప్పకుండా ఎన్నికల ప్రణాళికను పూర్తి చేశారు. అంటే వాటి ఊసే టీడీపీ ఎత్తొద్దని బీజేపీ కండిషన్ పెట్టినట్లే కదా! ఏ రకంగా చూసినా, ఇది ప్రజల మేనిఫెస్టో కాదు. కేవలం అధికారం కోసం చంద్రబాబు ఆడే రాజకీయ నాటకపు మోసఫెస్టో తప్ప ఇంకొకటి కాదని ఘంటాపధంగా చెప్పవచ్చు. చంద్రబాబు మేనిఫెస్టోని ఏపీ మేలు కోరుకునేవారు ఎవరూ అంగీకరించకూడదు కూడా.

విద్య రంగంలో అమలు లో ఉన్న సిలబస్ ను రివ్యూ చేస్తారట. అంటే దాని అర్ధం ఇప్పుడు ఉన్న ఇంగ్లీష్ మీడియం ను రద్దు చేస్తామని చెప్పడమా?. అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఇస్తున్న ఐబీ సిలబస్ ను ఎత్తివేస్తారా?. విద్యార్ధులకు టాబ్ లు వంటి వాటిని ఇవ్వడం ఆపివేస్తారా? మళ్లీ ప్రైవేటు స్కూళ్లకే పేదలు వెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారా? .. 

.. ముస్లిం రిజర్వేషన్ లను కొనసాగిస్తారా?లేదా? బీజేపీ స్పష్టంగా రిజర్వేషన్ లు రద్దు చేస్తామని చెబుతుంటే.. దానిని చంద్రబాబు గట్టిగా ఖండించలేక పోతున్నారు. NDA కూటమి ఎజెండాలో ఇది ముఖ్యమైనదిగా ఉంది. దానిపై బీజేపీవాళ్లతో ఎందుకు మాట్లాడించడం లేదు.పోనీ తాను బీజేపీని ఎదిరించి రిజర్వేషన్ లను కొనసాగిస్తానని కూడా ప్రణాళికలో హామీ ఇవ్వలేదు.177 రకాల హామీలు ఇవ్వడం ద్వారా అన్ని వర్గాల వారి ఆదరణ చూరగొనాలన్నది చంద్రబాబు ఆలోచన. కాని అన్ని వర్గాల వారు టీడీపీ మేనిఫెస్టోని చూస్తే, పూర్తిగా వ్యతిరేకిస్తారు.  ఇంతకాలం ఈ పాయింట్ మీద జగన్‌ను వ్యతిరేకించేవారు.. ఇప్పుడు జగనే బెటర్ అనే పొజిషన్‌కు చంద్రబాబు తీసుకొచ్చారు.

ఇలా.. కూటమి మేనిఫెస్టో వాగ్దానాలను గమనిస్తే, ఆకాశమే హద్దుగా చంద్రబాబు ఇచ్చేశారు. వీటిని అమలు చేయడానికి రెండు,మూడు రాష్ట్రాల బడ్జెట్ లు కూడా సరిపోవు. అంటే ఈ స్కీములను ఎగవేయడం తప్ప మరో దారి ఉండదు. లేదంటే ఈ స్కీము లబ్దిదారులలో జాబితాలో కోత పెట్టి వ్యయం అంచనాను బాగా తగ్గించుకోవాలి.దీనిపై లబ్దిదారులంతా మండిపడతారు. ఏ రకంగా చూసినా చంద్రబాబు మోసం చేసినట్లే అవుతుంది.


:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement

తప్పక చదవండి

Advertisement