Sakshi News home page

కాంగ్రెస్‌ ఇవ్వలేకపోయిన హామీ!

Published Mon, Apr 15 2024 4:46 AM

Sakshi Guest Column On Congress Party Manifesto

కామెంట్‌

మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ‘రాజ్యాంగ పరిరక్షణ’కు మూడు ముఖ్యమైన హామీలను ఇచ్చింది. ఉభయ సభల్ని ఏడాదికి కనీసం వంద రోజులు సమా వేశ పరచటం; ప్రతిపక్షాలు సూచించిన అంశాలపై చర్చకు సమయాన్ని కేటాయించటం; రెండు సభల ప్రిసైడింగ్‌ అధికారులు తమ పార్టీలతో సంబంధా లను తెంచుకోవాలన్న నిబంధన ద్వారా నిష్పాక్షికతను సాధించటం. అలాగే ఇంకొక హామీని కూడా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చి ఉండవలసింది. బ్రిటన్‌లో మాదిరిగా పార్లమెంటు సమావేశాలలో ‘ప్రైమ్‌ మినిస్టర్స్‌ క్వశ్చన్‌ టైమ్‌’ని ప్రవేశపెట్టి ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు ప్రధానమంత్రే స్వయంగా సమాధానాలు ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించటం. మన పార్లమెంటు కోసం, మన ప్రజాస్వామ్యం కోసం, అంతకుమించి సుపరిపాలన కోసం ఇవి అవసరం.

సాధారణంగా నేను రాజకీయ మ్యానిఫెస్టోల జోలికి వెళ్లను. చాలా సందర్భాలలో పార్టీ గానీ, లేదా ఓటరు గానీ వాటిని అంత సీరియస్‌గా తీసుకోరు. అయితే కాంగ్రెస్‌ పార్టీ తాజా మ్యానిఫెస్టోలోని పార్లమెంటు పని తీరుకు సంబంధించిన ఒక క్లాజు నా కంటపడింది. మ్యానిఫెస్టోలోని ‘రాజ్యాంగ పరిరక్షణ’ అనే అంశం కింది 9వ క్లాజు మూడు నిర్దిష్టమైన, ముఖ్యమైన హామీలను ఇస్తోంది. మొదటిది ఇలా చెబుతోంది: ‘పార్లమెంటు ఉభయసభలు దేనికది ఏడాదికి 100 రోజులు సమావేశం అవుతాయి అని మేము హామీ ఇస్తున్నాం.’నిజంగా ఇది మన ప్రజాస్వామ్య విధి నిర్వహణకు కావలసిన సత్తువను ఇస్తుంది. ఇందుకు వివరణగా, కోవిడ్‌ వల్ల ప్రభావితమైన లోక్‌సభవి కాకుండా, ఆ ముందరి సమావేశాల నుంచి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. 

16వ లోక్‌సభ 1,615 గంటలు మాత్రమే పని చేసింది. ఇది అన్ని పూర్తికాల లోక్‌సభల సగటు కంటే 40 శాతం తక్కువ. 15వ లోక్‌ సభలో 26 శాతం వరకు చట్టపరమైన బిల్లులు 30 నిమిషాల లోపే ఆమోదం పొందాయి. ఆ సంఖ్య తర్వాతి కాలంలో పెరిగి ఉండొచ్చు కానీ, 14, 15 లోక్‌సభలలో నమోదైన 71 శాతం, 60 శాతంతో పోలిస్తే 16వ లోక్‌సభలో కేవలం 25 శాతం బిల్లులే కమిటీల సూచనల కోసం వెళ్లాయి. దీనిని బట్టి, అమలుకు అవసరమైన అర్హతల పరిశీలనకు చట్టపరమైన బిల్లులు వెళ్లలేదని స్పష్టం అవుతోంది. లోక్‌సభ ఏడాదికి 100 రోజులు సమావేశం అయితే కనుక ఆ సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది.

రెండవ హామీ: ‘రెండు సభల్లోనూ వారానికి ఒకరోజును ప్రతి పక్షాలు సూచించిన అంశంపై చర్చించటానికి కేటాయిస్తామని మేము హామీ ఇస్తున్నాం’. దీని అర్థం, ప్రభుత్వం నిరాకరించిన జీఎస్టీ, ధరల పెరుగుదల, పెగసస్, రఫేల్, చైనా చొరబాట్లు, ఎలక్టోరల్‌ బాండ్ల వంటి అంశాలు చర్చకు వస్తాయని! ప్రభుత్వం మొండిగా తిరస్కరించే వాటిని చర్చించేందుకు ఈ నిబంధన అత్యవసరతను కల్పిస్తుంది. పార్లమెంటరీ చర్చలను సంపూర్ణం, అర్థవంతం చేస్తుంది. 

మూడవ హామీ ఇలా చెబుతోంది: ‘రెండు సభల ప్రిసైడింగ్‌ అధికారులు (స్పీకర్, ఛైర్మన్‌) ఏ రాజకీయ పార్టీతో తమకున్న సంబంధాన్నయినా తెంచుకోవాలన్న నిబంధనను చేర్చుతామని మేము హామీ ఇస్తున్నాం.’ ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్‌ సభకు అధ్యక్షు డిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కూడా తన పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అది ఆమోదయోగ్యం కాదు. అలా ఉండటం పక్షపాతానికి దారి తీస్తుంది. నిర్ణయాలను ప్రశ్నార్థకం చేస్తుంది. రాజ్య సభ ఛైర్మన్‌ కూడా అంతే. ప్రిసైడింగ్‌ అధికారి అయ్యాక కూడా వారు తమ పార్టీలో కొనసాగడం అన్నది అంతే సమానంగా (లోక్‌సభ స్పీకర్‌తో సమానంగా) ఆమోదయోగ్యం కానిది. 

దీనికి అదనంగా నేను మరొకటి జోడిస్తాను. సిట్టింగ్‌ స్పీకర్‌ కనుక మళ్లీ ఎన్నికకు నిలబడితే అతడికి పోటీ లేకుండా చూడాలి. బ్రిటన్‌లో అలాగే జరుగుతుంది. దాని వల్ల స్పీకర్‌ స్థానంలోకి వచ్చే వారి తటస్థతకు హామీ ఉంటుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌కు ఎందుకు ఆలోచించలేదో మరి?

ఏమైనా, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో మరొక కీలకమైన అడుగును ముందుకు వేసి ఉండవలసింది! బ్రిటన్‌ ‘హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌’ సమా వేశాలలో ఒక నిర్దిష్టమైన రోజున, ఒక అరగంట సేపు ‘ప్రైమ్‌ మిని స్టర్స్‌ క్వశ్చన్‌ టైమ్‌’ (పీఎంక్యూ) పేరిట – ప్రతిపక్ష నాయకుడు వేసే కనీసం అరడజను ప్రశ్నలతో పాటుగా, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రధాన మంత్రి సమాధానాలు ఇవ్వటం అనే సంప్రదాయాన్ని మన దగ్గర మొదలు పెడతామని హామీ ఇవ్వవలసింది. దీని వల్ల ఉన్నత స్థాయిలో జవాబుదారీతనానికి భరోసా ఏర్పడటం మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిని ప్రశ్నించటానికి ప్రతి పక్షానికి అవకాశం లభిస్తుంది. 

యూకేలో పీఎంక్యూస్‌ అని పిలిచే ఈ ప్రశ్నోత్తర సమయం రసవత్తరంగా సాగుతుంది. ఇటు ప్రధానమంత్రి, అటు ప్రతిపక్ష నాయకుడు... ఆ ఇద్దరిలోని అత్యుత్తమమైన ప్రతిభను వెలికి తీస్తుంది. అందుకే అది, దేశ ప్రజలు తమ నాయకుల పనితీరును వీక్షించి, వారేమిటో తెలుసుకోటానికి, వారి బలహీనతలను గుర్తించటానికి, వారి బలాలను ప్రశంసించటానికి ఒక గవాక్షం. ఒక్క మాటలో అది... ప్రజాస్వామ్యం పని చేయటం. ప్రపంచంలోనే అతి పెద్దదైన మన ప్రజాస్వామ్యానికి అలాంటి ఒక గవాక్షం ఇప్పుడు అత్యవసరం.

మరి ఈ హామీని ఇవ్వటానికి కాంగ్రెస్‌ ఎందుకు వెనకడుగు వేసింది? నరేంద్ర మోదీ దాడిని మల్లికార్జున్‌ ఖర్గే, లేదా రాహుల్‌ గాంధీ... తిప్పికొట్టలేరన్నదే కారణమా? వాళ్లు దీని గురించి ఎప్పుడూ ఆలోచించి ఉండరనీ, లేదా ఇది అసాధ్యం అని వారు కొట్టిపడేసి ఉంటారనీ నేను నమ్మలేను కనుక బహుశా అదే కారణం అయుండా లని నా అనుమానం. 

మ్యానిఫెస్టోలో ఇప్పుడు హామీ ఇచ్చినవాటినైనా కాంగ్రెస్‌ నెర వేర్చవలసిన అవసరం ఉంది. మన పార్లమెంటు కోసం, మన ప్రజా స్వామ్యం కోసం, అంతకుమించి సుపరిపాలన కోసం నెరవేర్చాలి. అందుకే ఇది నరేంద్ర మోదీకి, బీజేపీకి కూడా పరీక్ష. వారు నిజంగా భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది అని విశ్వసిస్తుంటే కనుక కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలోని హామీల అమలుకు వారెలా ‘కాదు’ అని చెప్పగలరు? నిజానికి ప్రతి ఆలోచనాత్మకమైన, బాధ్యత గల రాజ కీయ పార్టీ కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తుందని నేను ఆశిస్తున్నాను. 

అయితే... విచారకరమైన, అంతుచిక్కని నిజం ఒకటి ఉంది. ప్రశ్నలను ఎదుర్కోవటానికి సిద్ధం అని ఏ పార్టీ అయినా అంటుందని కచ్చితంగా చెప్పగలను. కానీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే, చర్య తీసుకోవలసిన స్థితిలో ఉంటే ప్రశ్నలకు సిద్ధంగా ఉండగలదా? ఇక్కడే సందేహాలు కదలాడుతున్నాయి.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌  

Advertisement
Advertisement