Sakshi News home page

దాడులు చేస్తే తీవ్రంగా స్పందిస్తాం: ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ వార్నింగ్‌

Published Wed, Apr 17 2024 4:20 PM

Iran Said It Will Respond Seriously For Israel Actions  - Sakshi

టెహ్రాన్‌: ఇరాన్‌,ఇజ్రాయెల్‌ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ తమ దేశంపై ఎలాంటి దాడికి దిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ ప్రకటించింది. ప్రతి చర్యలకు తమ  ఎయిర్‌ఫోర్స్‌ సిద్ధంగా ఉందని తెలిపింది. ఇరాన్‌పై  ఎలాంటి దాడులు చేయాలన్న దానిపై చర్చించేందుకు ఇజ్రాయెల్‌ వార్‌ క్యాబినెట్‌ బుధవారం(ఏప్రిల్‌17)న భేటీ కానుంది. 

ఈ నేపథ్యంలో దాడులను ఎదుర్కొనడానికి తాము సిద్ధమని ఇరాన్‌ ప్రకటించడం గమనార్హం. ‘ ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే మా స్పందన తీవ్రంగా ఉంటుంది’ అని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రెయిసీ చెప్పారు. తమ సుఖోయ్‌-24ఎస్‌ విమానాలు సిద్ధంగా  ఉన్నాయని ఇరాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్‌ హెచ్చరించారు. అయితే ఇజ్రాయెల్‌ ఇరాన్‌లోని లక్ష్యాలపై దాడి చేస్తుందా లేదంటే ఇరాన్‌ వెలుపల దాడులు చేస్తుందా అనేదానిపై స్పష్టత లేదు.

ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకలకు ఎర్ర సముద్రంలో రక్షణ కల్పిస్తున్నట్లు ఇరాన్‌ నేవీ అడ్మిరల్‌ షారమ్‌ ఇరానీ తెలిపారు. కాగా, ఇటీవల సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై  ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో  ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఏప్రిల్‌ 1న ఇరాన్‌ వందలాది డ్రోన్‌లు, మిసైళ్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. వీటిలో 99 శాతం మిసైళ్లను ఇజ్రాయెల్‌ తన ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ సహకారంతో కూల్చి వేసింది. 

ఇదీ చదవండి.. ఇరాన్‌కు భారీ షాక్‌ ఇచ్చిన అమెరికా 

Advertisement
Advertisement