North Korea: కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కీలక నిర్ణయం.. రష్యా కోసం.. | Sakshi
Sakshi News home page

North Korea: కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కీలక నిర్ణయం.. కరోనా తర్వాత రష్యా కోసం..

Published Fri, Jan 12 2024 8:20 AM

North Korea To Allow First Tourists To Enter Country - Sakshi

సియోల్‌: ఉత్తర కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ దేశంలో​కి విదేశీ పర్యాటకులు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో, రష్యాకు చెందిన ఓ గ్రూప్‌ నార్త్‌ కొరియాలో పర్యటించనున్నారు. ఈ బృందం ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ఉత్తర కొరియాకు బయలుదేరనుంది.

వివరాల ప్రకారం.. పర్యాటకుల విషయంలో ఉత్తర కొరియా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2020లో కరోనా వైరస్‌ వ్యాప్తి తర్వాత తమ దేశంలోకి మళ్లీ పర్యాటకులు వచ్చేందుకు తాజాగా నార్త్‌ కొరియా అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నార్త్‌ కొరియా దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పర్యాటకులకు అనుమతించలేదు. దేశంలోకి రాకుండా కఠిన నిబంధనలను విధించింది. ఇక, తాజాగా పర్యాటకులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో రష్యాకు చెందిన టూరిస్టులు ఫిబ్రవరి తొమ్మిదో తేదీన నార్త్‌ కొరియాకు వెళ్లనున్నారు. అక్కడ నాలుగు రోజులు పాటు పర్యటించనున్నారు. పలు సిటీల్లోకి ప్రవేశించనున్నారు.

ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెప్టెంబరులో తూర్పు రష్యాలో ఒక శిఖరాగ్ర సమావేశం కోసం కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఆర్థిక, రాజకీయ, సైనిక రంగాలలో సహకారం అందించుకునేందుకు నిర్ణయించుకున్నారు. మరోవైపు.. ఉత్తరకొరియాకు చైనా నుంచి కూడా సహకారం అందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో నార్త్‌ కొరియాకు జిన్‌పింగ్‌ మద్దతుగా నిలిచారు. కరోనా సమయంలో కూడా వ్యాక్సిన్లను నార్త్‌ కొరియాకు చైనా పంపించింది.  

Advertisement
Advertisement