Sakshi News home page

‘సూపర్‌ ట్యూస్‌డే’లో అదరగొట్టిన ప్రెసిడెంట్‌, మాజీ ప్రెసిడెంట్‌

Published Wed, Mar 6 2024 7:18 AM

Trump Biden Sweeps Super Tuesday Primaries - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన ‘సూపర్‌ ట్యూస్‌డే’ ప్రైమరీ బ్యాలెట్‌ పోరులో ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలతో పాటు అందరూ ఊహించిందే నిజమైంది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఇటు అధికార డెమొక్రాట్లు, అటు రిపబ్లికన్ల నుంచి అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ తలపడటం ఖాయమైంది.

సూపర్‌ ట్యూస్‌డే(మార్చ్‌ 6) నాడు జరిగిన 16 రాష్ట్రాల ప్రైమరీల్లో డెమొక్రాట్లకు సంబంధించి బైడెన్‌ ముందంజులో ఉండగారిపబ్లికన్ల ప్రైమరీల్లో ఇప్పటివరకు వెలువడ్డ రాష్ట్రాల ఫలితాల్లో ట్రంప్‌ ఘన విజయం సాధించారు. వర్జీనియా, వెర్మాంట్‌, నార్త్‌ కరోలినాల్లో, అయోవా, టెన్నెస్సీ, అర్కాన్సాస్‌, టెక్సాస్‌, ఓక్లహామా, అలబామా, కొలరాడో, మసాచూసెట్స్‌, మిన్నెసోటా డెమొక్రాటిక్‌ ప్రైమరీల్లో బైడెన్‌ విజయ ఢంకా మోగించారు. అమెరికన్‌ సమోవాలో మాత్రం బైడెన్‌ పరాజయం పాలయ్యారు. 

ఇటు రిపబ్లికన్ల ప్రైమరీల్లో  ట్రంప్‌ వర్జీనియా, నార్త్‌ కరోలినా, టెన్నెస్సీ, అర్కాన్సాస్‌, టెక్సాస్‌, అలబామా, మిన్నెసోటా, కొలరాడో, మసాచూసెట్స్‌, ఓక్లహామాలలో విజయం సాధించారు. నార్త్‌ కరోలినాలో మాత్రం ట్రంప్‌ అతి తక్కువగా 9 శాతం ఆధిక్యంతో బయటపట్డారు. మొత్తం 16 రాష్ట్రాల్లో మంగళవారం ఒకే రోజు ప్రైమరీ బ్యాలెట్‌ పోరు జరిగింది.  ప్రైమరీ బ్యాలెట్‌లతో పాటు టెక్సాస్‌, కాలిఫోర్నియా, అలబామా వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సెనేట్‌, హౌజ్‌, గవర్నర్‌ అభ్యర్థులను కూడా  డౌన్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నుకుంటారు.

16 రాష్ట్రాల్లో మొత్తం 854 మంది రిపబ్లికన్‌ ప్రతినిధుల మద్దతు కోసం గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ(జీవోపీ) అభ్యర్థులు పోటీ పడతారు. ఇందుకే దీనిని సూపర్‌ ట్యూస్‌డే గా పిలుస్తారు. సూపర్‌ ట్యూస్‌డేలో విజయం సాధించిన పార్టీల అభ్యర్థులే ఆయా పార్టీల తరపున అధ్యక్ష అభ్యర్థులుగా తుదిపోరుకు నామినేట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇరు పార్టీల తరపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మిగతా అభ్యర్థులు పోటీలో నుంచి తప్పుకుంటారు. 

కాగా, కేవలం సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీలు కాకుండా ఇటీవల జరిగిన మిగతా ప్రైమరీ బ్యాలెట్‌లలోనూ డెమొక్రాట్లలో బైడెన్ పైచేయి సాధించగా ఇటు రిపబ్లికన్లలో ట్రంప్‌ దూసుకుపోయారు. అయితే వాషింగ్టన్‌ ప్రైమరీలో విజయం సాధించిన రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హాలే ప్రైమరీల చరిత్రలో కొత్త రికార్డు క్రియేట్‌ చేయడం విశేషం. ప్రైమరీలు ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్‌ కోల్పోయింది వాషిం‍గ్టన్‌ ప్రైమరీ ఒక్కటే కావడం గమనార్హం.     

ఇదీ చదవండి.. విమానంలో మహిళకు డెలివరీ చేసిన పైలట్‌  

Advertisement
Advertisement