టచ్‌ చేస్తే మసే! | Sakshi
Sakshi News home page

టచ్‌ చేస్తే మసే!

Published Sat, Apr 20 2024 4:25 AM

CM Revanth Reddy Comments On KCR And PM Modi - Sakshi

నేను హైటెన్షన్‌ వైర్‌ లాంటోడిని.. ముట్టుకుంటే షాక్‌ కొడతా.. 

మహబూబ్‌నగర్‌ కార్నర్‌ మీటింగ్, మహబూబాబాద్‌ సభల్లో సీఎం రేవంత్‌

కేసీఆర్‌ గతంలోలాగా ఎమ్మెల్యేలను ఎత్తుకుపోదామని చూస్తున్నరేమో.. 

ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే మా ఎమ్మెల్యేలను టచ్‌ చేయ్‌.. 

మేం ఆషామాషీగా అధికారంలోకి రాలేదు కూల్చేస్తామనడం అవివేకం.. 

మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడుదొంగలు 

ఏ ముఖంతో బీజేపీ ఓట్లడుగుతుంది? గత పదేళ్లుగా తెలంగాణకు నిధులివ్వకుండా అన్యాయం చేశారు 

లెఫ్ట్, టీజేఎస్‌ మద్దతు తీసుకుంటాం 

14 ఎంపీ సీట్లు గెలిచి ఢిల్లీకి బహుమతి ఇస్తాం 

వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీదే అధికారమని వ్యాఖ్య 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ సాక్షి, మహబూబాబాద్‌:  ‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, చిటికేస్తే వస్తారని కేసీఆర్‌ చెప్తున్నారు. చిటికె కాదు.. మిద్దెక్కి డప్పు కొట్టు .. నీ దగ్గర ఉన్నోళ్లు కూడా ఎవరైనా ఉంటారేమో చూద్దాం. గతంలోలాగా తోడేళ్లలా వచ్చి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోదామని అనుకుంటున్నావేమో. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. కంచె వేసి కాపాడుకునే పవర్‌ఫుల్‌ హైటెన్షన్‌ వైర్‌ లాంటివాడు. కరెంటు తీగ మీద కాకి వాలితే ఎట్లా అయితదో..   కాంగ్రెస్‌ వైపు చూస్తే అట్లానే షాక్‌ కొట్టి మాడిమసై పోతారు.

ప్రయత్నం చేసి చూడు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో, పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీ, కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ తెలంగాణ జన జాతర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయా చోట్ల సీఎం రేవంత్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 
 
‘‘మా కారు కొంచెం పాడైంది. గ్యారేజీకి పొయిందని నిన్న, మొన్న కేటీఆర్‌ అంటున్నారు. కారు రిపేరవడం కాదు.. ఇంజిన్‌ సహా మొత్తం పాడైపోయింది. ఇనుప సమాన్ల కింద తూకానికి అమ్ముడే. నీ కారే కాదు.. తండ్రి కేసీఆర్‌ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది.. ఇంకా నడవలేకపోతున్నరు. మొన్నటి ఎన్నికల్లో ఓటర్లు బీఆర్‌ఎస్‌ను పాతేసినా.. ఇంకా పొంకనాలు కొడుతున్నరు. మీ ఎమ్మెల్యేలే నీవెంబడి ఉంటలేరు. అలాంటిది ఎదుటి పార్టీల 20 మంది ఎమ్మెల్యేలున్నారని చెబుతావా? ఇంకెన్ని రోజులు ఇలా కథలు చెప్పి బతుకుతరు? 

మోదీ, కేసీఆర్‌ ఒక్కటే.. 
కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ఇద్దరూ తోడు దొంగలు. వారిలో ఎవరికి ఓటేసినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. తెలంగాణకు ద్రోహం చేసినట్లే.. పదేళ్లు పాలించిన ఇద్దరు రాష్ట్రానికి చేసింది శూన్యం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని బయట పెట్టకుండా కేసీఆర్‌ ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడింది ప్రధాని కాదా? పదేళ్లలో పార్లమెంట్‌లో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును సమరి్ధంచినది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా? 

ఏ ముఖంతో బీజేపీ ఓట్లు అడుగుతుంది? 
పదేళ్లు తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిన బీజేపీ ఇప్పుడు ఓట్లు వేయాలంటూ ప్రజల ముందుకు రావడం సిగ్గుచేటు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా పక్కన పెట్టింది బీజేపీ కాదా? వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఎటుపోయింది? తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల ఓట్లు ఎలా అడుగుతారు? ఉత్తర భారత దేశంలో కుంభమేళా, గంగానది పరిరక్షణ కోసం వేల కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం.. మన మేడారం జాతరకు ముష్టి రూ.3 కోట్లు కేటాయించి అవమానించింది. 42 మంది తెలుగు మాట్లాడే ఎంపీలుంటే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. అదే యూపీలోని 60 మంది ఎంపీలకు 12 మంత్రి పదవులు, 26 మంది ఎంపీలు ఉన్న గుజరాత్‌కు ఏడు మంత్రి పదవులు ఇచ్చి వివక్ష చూపారు. 

బీఆర్‌ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం 
పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సొంతంగా ఒక్క సీటు కూడా గెలవదని గ్రహించే బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. కేసీఆర్‌ తన బిడ్డ కవితకు బెయిల్‌ మంజూరు చేయించుకునేందుకు.. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్‌ సీట్లను వదిలేశారు. ఎవరెన్ని ఒప్పందాలు చేసుకున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించిన తెలంగాణ ప్రజలు.. ఈ ఎన్నికల్లో మోదీకి కూడా బుద్ధి చెప్పడం ఖాయం. 

కమ్యూనిస్టులు, టీజేఎస్‌ మద్దతు తీసుకుంటాం 
పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌ పార్టీల మద్దతు తీసుకుంటాం. వారితో చర్చించే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చూసుకుంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం కలిసొచ్చే ఇతర పార్టీల మద్దతును కూడా కూడగడతాం. మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుంది. ప్రజలకు ఇచ్చి న ప్రతీ హామీని నెరవేస్తుంది. తెలంగాణ బిడ్డల చావులను చూసిన సోనియా గాంధీ మనసు తల్లడిల్లి తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడు ఆమె కుటుంబానికి అండగా ఉండేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. ఢిల్లీలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. 14 మంది ఎంపీలతో ఢిల్లీ వెళ్తాం..’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. 
 
పాలమూరుకు పది పైసలైనా తెచ్చారా? 
శత్రువు చేతిలో కత్తి పెడితే.. వాడు పక్కోన్ని పొడవడు. మన కడుపులోనే పొడుస్తడు. నిన్న మొన్నటివరకు పదేళుŠల్‌ కేసీఆరే సీఎంగా, మోదీ పీఎంగా ఉన్నారు కదా. పాలమూరుకు పది పైసలన్నా తెచ్చారా? పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చారా? అది తేలేదుగానీ డీకే అరుణమ్మ మాత్రం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకుంది. పాలమూరులో ఆమె గెలిస్తే గడీలో ఉన్న బంధువులకు మేలే తప్ప పాలమూరుకు ఏ న్యాయమూ జరగదు. గల్లీ నుండి కేసీఆర్‌ వచ్చి నా.. ఢిల్లీ నుంచి మోదీ వచ్చి నా ఈ గడ్డ మనది. నాడు తట్టపనికో, మట్టి పనికో వలసలు పోయినం. ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికొచ్చినం. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే తలెత్తుకునేలా గౌరవాన్ని ప్రదర్శించినం. 
 
కేసీఆర్‌ది అసత్య ప్రచారం: మంత్రులు 
మహబూబాబాద్‌ సభలో మంత్రులు ప్రసంగించారు. రేవంత్‌ బీజేపీలోకి వెళ్తున్నారంటూ.. తాను బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నానంటూ అసత్యపు ప్రచారం చేయడం మాజీ సీఎంకు అలవాటుగా మారిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 120 రోజులే అయిందని, ఈ కాస్త సమయంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. గత పదేళ్లలో గిరిజనుల కోసం ఏమీ చేయని బీజేపీకి గిరిజనులు బుద్ధి చెప్తారని మంత్రి సీతక్క చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement