
‘‘నేను కలిసిన అత్యంత నిస్వార్థమైన వ్యక్తుల్లో అతడూ ఒకడు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అతడు సమయం కేటాయించగలడు. సాయం చేయడానికి 24/7 అందుబాటులోనే ఉంటాడు.
ఎక్కడి హోటల్‌కు వెళ్లినా నా గదికి రెండు గదుల అవతల అతడు ఉంటాడు. నాకు ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్లవచ్చు. ప్రతి రోజూ ఉదయం అక్కడే నేను కాఫీ తాగుతాను కూడా!
ఇండియన్ అనడం బెటర్
నిజం చెప్పాలంటే అతడు ఆస్ట్రేలియన్ అనడం కంటే ఇండియన్ అనడం బెటర్. అతడికి కూడా ఇదే మాట చెబుతూ ఉంటా. నా దృష్టిలో అతడు 70 శాతం ఇండియన్.
కేవలం 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్‌గా ఉంటాడు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం, ఆసీస్ స్టార్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ సహచర ఆటగాడు డేవిడ్ వార్నర్‌పై ప్రశంసలు కురిపించాడు.
తనకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే వార్నర్ దగ్గరికి వెళ్లి అడిగేంత చొరవ ఉందని తెలిపాడు. సీనియర్ అన్న పొగరు ఏమాత్రం చూపించడని.. అందరితోనూ సరదాగా ఉంటాడని మెగర్క్ చెప్పుకొచ్చాడు.
హైదరాబాదీలతో బంధం
కాగా ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ద్వారా భారతీయులకు చేరువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన సమయంలో హైదరాబాదీలతో బంధం పెనవేసుకున్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరోల తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వార్నర్ భాయ్.. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్‌లోనూ నటించి మెప్పించాడు.
ఈ నేపథ్యంలో మెగర్క్ వార్నర్ గురించి డీసీ(ఢిల్లీ క్యాపిటల్స్) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీకి ఆడుతున్న సౌతాఫ్రికా స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం వార్నర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. అతడితో కలిసి గోల్ఫ్ ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు.
ఐపీఎల్-2024లో ఇలా
కాగా ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. మరోవైపు.. ఈ సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్-మెగర్క్ 6 ఇన్నింగ్స్‌లో కలిపి 259 పరుగులు చేశాడు.
ఇక ట్రిస్టన్ స్టబ్స్ 10 ఇన్నింగ్స్ ఆడి 277 రన్స్ చేయగా.. డేవిడ్ వార్నర్ కేవలం 7 మ్యాచ్‌లలో భాగమై 167 పరుగులు చేయగలిగాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు వార్నర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.