చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్, శ్రీలంక బౌలర్ మతీశ పతిరణ టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ధోని తనకు తండ్రిలాంటి వాడని పేర్కొన్నాడు. తన కన్న తండ్రి మాదిరే ధోని కూడా తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపాడు.
కాగా ఐపీఎల్-2022కు సిసంద మగల దూరం కాగా అతడి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌లో అడుగుపెట్టాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే 2023లో 12 మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు పడగొట్టాడు.
ధోని నాయకత్వంలో సీఎస్‌కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బేబీ మలింగగా ప్రశంసలు అందుకుంటూ ప్రస్తుతం సీఎస్‌కే ప్రధాన పేసర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు.
అయితే, దీనకంతటికి కారణం ధోనినే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యువ పేసర్ ఆరంభంలో తడబడ్డా తలా అతడికి అండగా నిలిచాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సమయంలోనూ నైతికంగా మద్దతునిచ్చాడు.
ఈ నేపథ్యంలో తాజాగా సీఎస్‌కే ‘లయన్స్ అప్‌క్లోజ్’ చాట్‌లో మతీశ పతిరణ మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి వివరించాడు. ‘‘మా నాన్న తర్వాత నా క్రికెట్ లైఫ్‌లో తండ్రి పాత్ర పోషించింది ధోనినే.
నన్నొక చిన్నపిల్లాడిలా చూసుకుంటారు. నా పట్ల శ్రద్ధ వహిస్తారు. అవసరమైన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నేను ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ ఉంటారు.
ఇంట్లో మా నాన్న నాతో ఇలా ఉంటారో ఇక్కడ ధోని కూడా నాతో అలాగే ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తలు చెబుతారు. నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేలా మోటివేట్ చేస్తారు.
మైదానం వెలుపల మేము ఎక్కువగా మాట్లాడుకోము. అయితే, నన్ను కలిసిన ప్రతిసారీ.. ‘‘ఆటను ఆస్వాదించు. ఫిట్‌నెస్ కాపాడుకో’’ అని చెబుతారు.
మహీ భాయ్.. మీరు వచ్చే సీజన్‌లోనూ ఆడాలి. ప్లీజ్ మాతో కలిసి ఆడండి.. అప్పటికీ నేనిక్కడ ఉంటే(నవ్వుతూ)’’ అంటూ పతిరణ ధోని పట్ల అభిమానం చాటుకున్నాడు.
కాగా ఈ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక పతిరణ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు కూల్చాడు. సీఎస్‌కే ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
The bond beyond the field 💛🫂#LionsupClose Full video 🔗 - https://t.co/xt5t6K9SjR #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/odZdVvlrF6
— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2024
Comments
Please login to add a commentAdd a comment