IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా? | IPL 2024: Was Dhoni At Fault For RCB Handshake Fiasco? New Video Adds Twist | Sakshi
Sakshi News home page

IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?

Published Tue, May 21 2024 1:09 PM | Last Updated on Tue, May 21 2024 1:27 PM

IPL 2024: Was Dhoni At Fault For RCB Handshake Fiasco? New Video Adds Twist

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (PC: CSK X)

‘ప్రపంచకప్‌ ఫైనల్‌ గెలిచినా.. భావోద్వేగాలు ప్రతిబింబించేలా సంబరాలు చేసుకుంటున్న సమయంలోనూ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయడం మర్యాద. ‘మన మధ్య పోరు ముగిసిపోయింది.

మన మధ్య ఇక ఎలాంటి శత్రుత్వం లేదు. ఇప్పటికి ఇది ముగిసిపోయింది’ అని ఇరు జట్లు పరస్పరం చెప్పుకోవడానికి ఇది(షేక్‌హ్యాండ్‌) ప్రతీక’’- హర్షా భోగ్లే, కామెంటేటర్‌.

‘‘అతడొక ఐకానిక్‌ ప్లేయర్‌. వచ్చే ఏడాది ఆడతాడో లేదో కూడా తెలియదు. బహుశా ఇదే చివరి మ్యాచ్‌ కూడా అయి ఉండవచ్చు. అలాంటి లెజెండ్‌ను కలవడానికి ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూడటం సహజం.

ఆ తర్వాత ఎంతసేపు సంబరాలు చేసుకున్నా ఎవరూ ఏమీ అనరు. కానీ అంతా ముగిసి తెల్లారిన తర్వాత.. ‘అయ్యో.. ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

కానీ మనం ఆయనకు డీసెంట్‌గా ఓ షేక్‌హ్యాండ్‌తో వీడ్కోలు పలకలేకపోయామే’ అని బాధ పడితే ప్రయోజనం ఉంటుందా?’’- ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌.

ధోనికి అవమా‍నం
చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని పట్ల రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపట్ల ఇలా  కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు. ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ(ముంబై ఇండియన్స్‌)తో పాటు ఐదుసార్లు ట్రోఫీ సాధించిన దిగ్గజం పట్ల ఆర్సీబీ ప్లేయర్లు ప్రవర్తించిన విధానం అవమానకరమని మండిపడుతున్నారు.

ఇక ధోని అభిమానులైతే ఆర్సీబీ జట్టును సోషల్‌ మీడియా వేదికగా పదునైన కామెంట్లతో తూర్పారబడుతున్నారు. అయితే, తాజాగా ఓ నెటిజన్‌ కొత్త వీడియోను తెరమీదకు తెచ్చారు. ధోనికి మద్దతుగా మాట్లాడే వారందరూ ఒక్కసారి ఈ దృశ్యాలను చూడాలంటూ కొత్త చర్చకు దారితీశారు.

ఇంతకీ ఏం జరిగింది?... ఐపీఎల్‌-2024 ఆరంభం నుంచి వరుస పరాజయాలతో చతికిలపడ్డ ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌ రేసులో వరుసగా ఆరు మ్యాచ్‌లలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.

లీగ్‌ దశలో సొంత మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా చెన్నైని ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తప్పించి.. టాప్‌-4 బెర్తును ఖరారు చేసుకుంది.

ధోనిని పట్టించుకోని ఆర్సీబీ ఆటగాళ్లు?
ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఫైనల్‌ గెలిచినంతంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ధోని సహా మిగిలిన చెన్నై ఆటగాళ్లు కరచాలనం చేసేందుకు వచ్చారు. 

అయితే, ఆర్సీబీ సెలబ్రేషన్స్‌ పూర్తికాకపోవడంతో వీళ్లను పట్టించుకోలేదు. దీంతో చిన్నబుచ్చుకున్న ధోని డ్రెసింగ్‌రూంకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు కాసేపు వేచి చూడగా.. ఎట్టకేలకే ఆర్సీబీ ప్లేయర్లు వచ్చి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ధోని మూడు నిమిషాల పాటు ఎదురుచూసినా ఆర్సీబీ ఆటగాళ్లు షేక్‌హ్యాండ్‌ కోసం రాలేదని.. తలాను ఘోరంగా అవమానించారంటూ విరాట్‌ కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లందరిపై సీఎస్‌కే ఫ్యాన్స్‌ మండిపడ్డారు.

అసలు నిజం ఇదేనంటూ
ఈ క్రమంలో ఓ వ్యక్తి నిజం ఇదేనంటూ.. ‘‘ధోని మూడు నిమిషాలు వేచి చూశాడని అభిమానులు అంటున్నారు. అయితే, అతడు కాసేపు కూడా ఎదురుచూడకుండా వెళ్లిపోయాడు. గెలిచిన జట్టుకు ఆమాత్రం సెలబ్రేట్‌ చేసుకునే హక్కులేదా? 

సీఎస్‌కే గతేడాది ట్రోఫీ గెలిచినపుడు సంబరాలు చేసుకుందా? లేదంటే షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి వెళ్లిందా? ’’ అని ఓ వీడియోను పంచుకున్నారు. ఇది ఇప్పుడు ఆర్సీబీ- సీఎస్‌కే ఫ్యాన్స్‌ మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరతీసింది.

చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్‌ చేరే తొలి జట్టు ఇదే: పాక్‌ లెజెండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement