యశ్‌ దయాల్‌పై కోహ్లి ఫైర్‌.. దెబ్బకు ధోని ఖేల్‌ ఖతం! | Virat Kohli Yorker Nehi Advice for Yash Dayal Sparks Dhoni Collapse RCB Win | Sakshi
Sakshi News home page

యశ్‌ దయాల్‌పై కోహ్లి ఫైర్‌.. ఆ వార్నింగ్‌ వల్లే ధోని ఖేల్‌ ఖతం!

Published Sun, May 19 2024 12:34 PM | Last Updated on Sun, May 19 2024 12:53 PM

Virat Kohli Yorker Nehi Advice for Yash Dayal Sparks Dhoni Collapse RCB Win

యశ్‌ దయాల్‌పై కోహ్లి ఫైర్‌(PC: Jio Cinema)

ఐపీఎల్‌-2024లో ప్లే ఆఫ్స్‌ చివరి బెర్తును ఖరారు చేసే పోటీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నువ్వా- నేనా అన్నట్లుగా తలపడ్డాయి. వర్షం రాకతో ఆరంభం నుంచే ఆసక్తి రేపుతూ.. హోరీహోరీగా సాగిన ఈ  పోరులో ఎట్టకేలకు ఆర్సీబీదే పైచేయి అయింది.

ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌ సత్తా చాటి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో చెన్నైకి చెక్‌ పెట్టి టాప్‌-4కు అర్హత సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో టాస్‌ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

మూడు ఓవర్ల పాటు ఆర్సీబీ బ్యాటింగ్‌ పూర్తైన తరుణంలో వరణుడి రాక అభిమానులను కలవరపెట్టింది. అయితే, కాసేపటికే మ్యాచ్‌ తిరిగి ఆరంభమైంది. ఈ క్రమంలో ఓపెనర్లు విరాట్‌ కోహ్లి(47), ఫాఫ్‌ డుప్లెసిస్‌(54).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌(41) రాణించారు.

వీరికి తోడు నాలుగో నంబర్‌ బ్యాటర్‌ కామెరాన్‌ గ్రీన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌(17 బంతుల్లో 38 నాటౌట్‌)తో చెలరేగాడు. మిగతా వాళ్లలో దినేశ్‌ కార్తిక్‌ 14, మాక్స్‌వెల్‌(16) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.

చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే ఆరంభంలోనే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(0) వికెట్‌ కోల్పోయింది. మరో ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర(61) రాణించగా.. అజింక్య రహానే(33) అతడికి సహకరించాడు.

రవీంద్ర జడేజా సైతం 22 బంతుల్లో 42 పరుగులతో దుమ్ములేపాడు. మహేంద్ర సింగ్‌ ధోని కూడా మెరుపులు(13 బంతుల్లో 25) మెరిపించాడు. కానీ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా సీఎస్‌కే బ్యాటర్లు చేతులెత్తేశారు.

కాగా అనూహ్య రీతిలో చివరి ఓవర్లో ఆర్సీబీ సారథి డుప్లెసిస్‌ బంతిని యశ్‌ దయాల్‌ చేతికి ఇచ్చాడు.అతడి బౌలింగ్‌లో తొలి బంతికే ధోని సిక్సర్‌ బాది ఆశలు రేకెత్తించాడు. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారింది.

దయాల్‌ అప్పటికే తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఆ సమయంలో విరాట్‌ కోహ్లి అతడికి దగ్గరికి దిశా నిర్దేశం చేశాడు. ధోని లాంటి లెజెండ్‌ క్రీజులో ఉన్నపుడు యార్కర్‌ కాదు స్లో బాల్‌ వేయాలంటూ కాస్త గట్టిగానే హెచ్చరించాడు.

దీంతో యశ్‌ దయాల్‌ ధోనికి స్లో బాల్‌ సంధించగా.. ట్రాప్‌లో చిక్కుకున్న తలా స్వప్నిల్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక మిగిలిన నాలుగు బంతుల్లో సీఎస్‌కే కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించడంతో.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ చేరింది.

అలా కోహ్లి దెబ్బకు సెట్‌ అయిన యశ్‌ దయాల్ కీలక వికెట్‌ తీసి ఆర్సీబీ గెలుపునకు ప్రధాన కారణమయ్యాడు.‌ కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆద్యంతం కీలక సమయంలో ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ సానుకూల ఫలితాలు రాబట్టడం విశేషం. ఇక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన ఫాఫ్‌ డుప్లెసిస్‌ తన అవార్డును యశ్‌ దయాల్‌కు అంకితమివ్వడం మరో విశేషం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement