సాక్షి, నెల్లూరు జిల్లా: ‘‘నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. ఓ వైపు ఎన్డీఏలో కొనసాగుతూ మరో వైపు మైనార్టీలపై దొంగప్రేమ కురిపిస్తున్నాడు’’ అంటూ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్‌లో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉంటా.. తాము 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
‘‘వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా?. ఆరునూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ముస్లింలకు మత ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు. వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి. మళ్లీ ముస్లింల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడు. చంద్రబాబు ఓ ముదిరిపోయిన తొండ. ఇది కాదా ఊసరవెల్లి రాజకీయం, ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారా?’’ అంటూ సీఎం జగన్ నిలదీశారు.
ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని.. మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందని సీఎం అన్నారు. బాబు మోసాలకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా అంటూ పిలుపునిచ్చారు. లంచాలు, వివక్ష లేకుండా బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తున్నాం. జగన్ పాలనలో అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నారు.’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు.
‘‘కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ఇది కాదా అభివృద్ధి?. కొత్త 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్ హార్బర్‌లు నిర్మిస్తున్నాం.. ఇది కాదా అభివృద్ధి?. పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా?. క్వాలిటీ చదువులు అభివృద్ధి కాదా?. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్. 14 ఏళ్లలో ఏరోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు. రైతులకు అండగా ఆర్‌బీకే వ్యవస్థను నెలకొల్పాం. ఉద్ధానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం’’ అని సీఎం చెప్పారు.
‘‘వెలిగొండలో రెండు టన్నెళ్లు పూర్తి చేశాం. ప్రకాశం జిల్లాకు నీళ్లు తరలిస్తాం. వెలిగొండ, శ్రీశైలం నుంచి నీళ్లు రాక ఫ్లోరైడ్‌తో జనం ఇబ్బంది పడుతుంటే ఏనాడైనా చంద్రబాబు పట్టించుకున్నాడా?. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్‌వన్‌గా నిలిచాం. మా పాలనలో రూ. 2లక్షల 70వేలు కోట్లను ప్రజల ఖాతాల్లో వేశాం. ఎంఎస్‌ఎంఈలకు తోడుగా ఉన్నాం. చంద్రబాబు హయాంలో రూ.32 వేల కోట్లు పెట్టబడులు వస్తే.. మీ బిడ్డ జగన్ హయాంలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ అభివృద్ధి అంతా చంద్రబాబుకు కనిపించడం లేదా?’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment