Sakshi News home page

Dhruv Jurel Life Story In Telugu: తండ్రి కార్గిల్‌ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ..

Published Sat, Jan 13 2024 11:19 AM

Ind vs Eng: Mother Sacrifice Father Belief Dhruv Jurel Journey To Team India - Sakshi

Dhruv Jurel Story Mother sold gold chain for cricket kit: తన 23వ పుట్టినరోజు(జనవరి 21)కు సరిగ్గా పది రోజుల ముందు ధ్రువ్‌ జురెల్‌ జీవితంలో అద్భుతం చోటుచేసుకుంది. టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేరేందుకు పునాది పడింది. అవును.. పటిష్ట ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై తలపడే భారత జట్టులో తొలిసారిగా అతడికి చోటు దక్కింది.

సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే టెస్టు జట్టును వీడిన ఇషాన్‌ కిషన్‌పై వేటు వేసిన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ.. ఈ ఉత్తరప్రదేశ్‌ కుర్రాడికి జట్టులో స్థానం ఇచ్చింది. కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌తో పాటు తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో వికెట్‌ కీపర్‌గా చోటిచ్చింది. రాహుల్‌ గాయం, కేఎస్‌ భరత్‌ నిలకడలేమి ప్రదర్శన నేపథ్యంలో మూడో టెస్టు ద్వారా ధ్రువ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

తండ్రి కార్గిల్‌ యుద్ధంలో..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధ్రువ్‌ జురేల్‌ తండ్రి నీమ్‌ సింగ్‌ జురేల్‌ కార్గిల్‌ యుద్ధంలో పోరాడారు. తనలాగే కొడుకు కూడా ఆర్మీలో చేరాలి.. అలా కుదరకపోతే.. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తీరాలని ఆయన బలంగా కోరుకున్నారు.

అంతేతప్ప స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఏనాడూ ఆశించలేదు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేయమని కుమారుడికి చెప్పనూలేదు. కానీ.. ధ్రువ్‌ మనసంతా క్రికెట్‌ మీదే ఉంది.

ఇంట్లో నుంచి పారిపోతా
అయితే, ఆ మాటను పెదవి దాటించి తండ్రితో చెప్పాలంటే భయం. అయినా.. ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసి.. ‘నాకు క్రికెట్‌ బ్యాట్‌ కొనివ్వు నాన్నా’’ అని నోరు తెరిచి అడిగాడు. అప్పటికే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.. పైగా ఆర్మీ కాకుండా ఆటగాడిని అవుతానంటూ కొడుకు చెప్పడం నీమ్‌ సింగ్‌కు ఎంతమాత్రం నచ్చలేదు.

అందుకే వెంటనే నో చెప్పేశారు. ధ్రువ్‌కు మాత్రం క్రికెటర్‌ కావాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. ఇంట్లో పరిస్థితులు చూశాక.. నాన్న మాటలు విన్న తర్వాత ఇంట్లో నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. క్రికెట్‌ ఆడనివ్వకపోతే దూరంగా వెళ్లిపోతా అని తల్లితో చెప్పాడు.

బంగారు గొలుసు అమ్మి క్రికెట్‌ కిట్‌ కొని
‘‘అయ్యో.. వీడు అన్నంత పని చేస్తాడేమో’’నన్న భయం ఆ తల్లిని వెంటాడింది. కొడుకును కాపాడుకోవడం.. అతడి కలలను నిజం చేయడం కోసం శ్రమించడం కంటే ఇంకే విషయంలో తనకు సంతోషం దొరుకుతుందని భావించిన ఆమె.. తన బంగారు గొలుసు అమ్మేసి ధ్రువ్‌ కోసం ఆ డబ్బుతో క్రికెట్‌ కిట్‌ కొనిచ్చింది.

అమ్మ తన కోసం త్యాగాలు చేయడం చూసిన ఆ చిన్నారి కొడుకు.. ఆట పట్ల మరింత అంకితభావం, నిబద్ధతతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. జూనియర్‌ క్రికెట్‌లో ఆగ్రా, ఉత్తరప్రదేశ్‌ జట్లకు ఆడిన ధ్రువ్‌ జురెల్‌.. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు నోయిడా వెళ్లాడు.

కొడుకుతో పాటే తానూ
మెరుగైన శిక్షణ కోసం నోయిడాకు పయనమయ్యాడు. కానీ ఆగ్రా నుంచి నోయిడా వరకు తరచూ ప్రయాణం చేయడం మానసికంగానూ, శారీరకంగానూ ఇబ్బందికరంగా మారింది. మళ్లీ తానున్నానంటూ ధ్రువ్‌ తల్లి రంగంలోకి దిగింది.

కొడుకు కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు వీలుగా అతడితో నోయిడాలో నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అలా అలా అంచెలంచెలుగా ఎదిగిన ధ్రువ్‌ జురెల్‌ ఇండియ అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. తన అద్భుత ప్రదర్శనలతో 2020 అండర్‌-19 వరల్డ్‌కప్‌ వైస్‌ కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. ఆ టోర్నీలో భారత యువ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

తండ్రి మనసు కరిగింది
ధ్రువ్‌ పట్టుదల, అంకితభావం చూసి అతడి తండ్రి మనసు కూడా కరిగింది. కొడుకు అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు తన వంతు బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు త్యాగాలు చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. అండర్‌ 19కు ఆడుతున్న సమయంలో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు నిర్వహించే క్యాంపులకు స్వయంగా కొడుకును తీసువెళ్లేవారు.

రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఎంట్రీ
అప్పటికే తన తోటి ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌, రవి బిష్ణోయి, ప్రియం గార్గ్‌ లాంటి వాళ్లు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వడం.. తనకు మాత్రం ఇంకా అవకాశం రాకపోవడంతో డీలా పడ్డ ధ్రువ్‌కు నైతిక మద్దతునిచ్చారు. ఎట్టకేలకు 2022లో రాజస్తాన్‌ రాయల్స్ ధ్రువ్‌ జురెల్‌ను కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.

అయితే, రియాన్‌ పరాగ్‌కు వరుస అవకాశాలు ఇచ్చే క్రమంలో ధ్రువ్‌ జురెల్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, రియాన్‌ పూర్తిగా విఫలం కావడం.. ఆ ఏడాది ఫైనల్లో ఓడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో.. వచ్చే సీజన్‌లో ధ్రువ్‌ను ఆడించాలని ఆర్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించుకుంది. 

అరంగేట్రంలోనే పరుగుల విధ్వంసం
బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఆరు లేదంటే ఏడో స్థానంలో ఆడిస్తామనే హామీ ఇచ్చింది. ఐపీఎల్‌-2023లో వచ్చిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ద్వారా  రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్‌ జురెల్‌.

అరంగేట్రంలోనే సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 32 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఓడినప్పటికీ తన ప్రదర్శనతో ధ్రువ్‌ జురెల్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఆ తర్వాత వరుస మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తంగా 13 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన ధ్రువ్‌ 11 ఇన్నింగ్స్‌లలో 152 పరుగులు సాధించాడు. భారత్‌-ఏ జట్టు తరఫున కూడా ప్రాతినిథ్య వహించిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇలా తొలిసారి ప్రధాన జట్టుకు ఎంపికయ్యాడు.

నీ గోల్డ్‌చైన్‌కు రీపే చేశాడు
ఇక రాజస్తాన్‌కు ఆడే సమయంలో జైపూర్‌లో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చిన ధ్రువ్‌ జురెల్‌ తండ్రి భార్యను ఉద్దేశించి.. ‘‘నీ బంగారు గొలుసు అమ్మినందుకు నీ కొడుకు మూల్యం చెల్లించేశాడోయ్‌’’ అని పుత్రోత్సాహంతో పొంగిపోయారట!! మరి ఇప్పుడు టీమిండియాకు సెలక్ట్‌ అయిన తర్వాత ఇంకెంతగా మురిసిపోతున్నారో!!
- సాక్షి స్పోర్ట్స్‌, వెబ్‌ ప్రత్యేకం
(ఇన్‌పుట్స్‌: హిందుస్తాన్‌ టైమ్స్‌) 

 చదవండి: షమీ తమ్ముడి దెబ్బ.. 60 పరుగులకే యూపీ ఆలౌట్‌! భువీ కూడా తగ్గేదేలే.. 5 వికెట్లు కూల్చి

Advertisement

What’s your opinion

Advertisement