అక్కడ బ్యాటింగ్‌ చేయడం కష్టం.. అతడు అద్భుతం! | Sakshi
Sakshi News home page

IPL 2024: అక్కడ బ్యాటింగ్‌ చేయడం కష్టం.. అతడు అద్భుతం!

Published Sun, Apr 28 2024 1:28 PM

జురెల్‌- సంజూ (PC: BCCI)

ఐపీఎల్‌-2024లో వరుస విజయాలతో అదరగొడుతున్న రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. అందరి కంటే ముందుగానే టాప్‌-4లో బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడింది.

ఈ నేపథ్యంలో రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. అదే విధంగా రాయల్స్‌ను గెలుపుతీరాలకు చేర్చడంలో తనకు అండగా నిలిచిన ధ్రువ్‌ జురెల్‌పై ప్రశంసలు కురిపించాడు.

ఫామ్‌లేమితో
గతేడాది ఐపీఎల్‌లో అదరగొట్టి టీమిండియా తరఫున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌కు.. ఐపీఎల్‌-2024 ఆరంభంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఫామ్‌లేమితో సతమతమైన అతడు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ కంటే ముందు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 50 పరుగులే చేశాడు.

అయితే, శనివారం నాటి మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ సంజూ శాంసన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌(33 బంతుల్లో 71 నాటౌట్‌)తో విరుచుకుపడగా మరో ఎండ్‌ నుంచి అతడికి సహకారం అందించాడు.

మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు రాబట్టాడు. తద్వారా సంజూ శాంసన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించి ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ మాట్లాడుతూ.. ‘‘ఫామ్‌ టెంపరరీ. నిజానికి టీ20 క్రికెట్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. అయితే, ధ్రువ్‌ జురెల్‌ వంటి యువ ఆటగాళ్లు పిచ్‌ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని రాణిస్తుండటం సానుకూలాంశం.

టీమిండియా తరఫున టెస్టుల్లో తన ప్రదర్శన మనం చూశాం. ఆరంభంలో తడబడ్డా అతడిపై మా నమ్మకం సడలలేదు. నెట్స్‌లో రెండు నుంచి మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించాడు. అతడు తప్పక రాణిస్తాడని మాకు తెలుసు. అదే జరిగింది కూడా’’ అని ధ్రువ్‌ జురెల్‌ ఆట తీరును కొనియాడాడు.

రాజస్తాన్‌ వర్సెస్‌ లక్నో స్కోర్లు:
వేదిక: లక్నో
టాస్‌: రాజస్తాన్‌.. బౌలింగ్‌
లక్నో స్కోరు: 196/5 (20)
రాజస్తాన్‌ స్కోరు: 199/3 (19)
ఫలితం: లక్నోపై ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌ విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: సంజూ శాంసన్‌.

చదవండి: డీకే అవసరమా?: యువీ
 

Advertisement
Advertisement