Sakshi News home page

పబ్లిక్‌ ప్రాంతాల్లో చార్జింగ్‌ పోర్టులతో జాగ్రత్త

Published Mon, Apr 1 2024 1:59 AM

Be careful with charging ports in public areas - Sakshi

బయట చార్జింగ్‌ పోర్టుల వాడకంతో జ్యూస్‌ జాకింగ్‌ 

సైబర్‌ నేరగాళ్లు మన ఫోన్లలోకి మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసే అవకాశం 

ప్రజలకు కేంద్రం హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణాల సమయంలో మొబైల్‌ చార్జింగ్‌ అయిపోయినా.. రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు, ఎయిర్‌ పోర్టులు.. వంటి బహిరంగ ప్రాంతాల్లోని మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్ర హోంశాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్‌ నేరగాళ్లు మన ఫోన్లలోకి మాల్‌వేర్‌ చొప్పించి, డేటా తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఈ తరహా జ్యూస్‌ జాకింగ్‌ స్కామ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జ్యూస్‌ జాకింగ్‌కు గురైనట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా www.cybercrime. gov.in  వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 

ఏమిటీ జ్యూస్‌ జాకింగ్‌..? 
చార్జింగ్‌ పాయింట్లకు అనుసంధానమై ఉంటూ ఫోన్లలో మాల్‌వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్‌వేర్లను యూజర్‌కు తెలియకుండా ఇన్‌స్టాల్‌ చేసి, డేటా దొంగిలించడమే జ్యూస్‌ జాకింగ్‌. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. బహిరంగ చార్జింగ్‌ పోర్టులను వాడే వారికి డేటా తస్కరణ ముప్పు ఎక్కువ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా డేటాను కొట్టేసిన తర్వాత సైబర్‌ నేరగాళ్లు ఆ సమాచారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. 

జ్యూస్‌ జాకింగ్‌ నుంచి తప్పించుకోవాలంటే
♦ సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది.
♦  చార్జింగ్‌ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్‌ పాయింట్ల ద్వారా చార్జింగ్‌ చేసుకోవాలి.
♦అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్‌ బ్యాంక్, లేదా ఇతర చార్జింగ్‌ సాధనాలు వెంట పెట్టుకోవడం ఉత్తమం. 
♦ మొబైల్‌ ఫోన్లకు స్క్రీన్‌లాక్‌ తప్పకుండా పెట్టుకోవాలి. 
♦ వీలైనంత వరకు స్మార్ట్‌ ఫోన్‌ను ఆఫ్‌ చేశాకే చార్జింగ్‌ చేయాలి.  

Advertisement
Advertisement