సైబర్ నేరాల కట్టడికి కొత్త పోర్టల్ తెచ్చిన కేంద్రం
అనుమానాస్పద ఫోన్ నంబర్లపై రిపోర్ట్ చేసే అవకాశం
అలాంటి ఫోన్ నంబర్లను దర్యాప్తు సంస్థలతో పంచుకోనున్న టెలికాం
బ్యాంకులకు సమాచారంతో మోసాలకు చెక్‌పెట్టే అవకాశం
ఇటీవలే చక్షు పోర్టల్ ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
సాక్షి, హైదరాబాద్: ‘‘హలో.. మీకు లక్కీ లాటరీలో రూ.50 లక్షలు వచ్చాయి.. ఈ మొత్తాన్ని పొందాలంటే మేం చెప్పే బ్యాంకు అకౌంట్ నంబర్‌కు రూ.లక్ష పంపండి.. మిగిలిన మొత్తం మీ సొంతం అవుతుంది..’’
‘మీ వాట్సప్ నంబర్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.. సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ పొందండి..’’
‘‘హలో.. బ్యాంకు మేనేజర్‌ను మాట్లాడుతున్నాను.. మీ కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి. లేదంటే మీ క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు బ్లాక్ అయిపోతాయి. మేం అడిగే వివరాలు చెప్పండి..’’
రోజుకో కొత్త తరహా సైబర్ మోసం...సైబర్ నేరగాళ్ల ఎత్తు ఏదైనా.. మూలం మాత్రం మన ఫోన్‌కు వచ్చే కాల్స్.. లేదంటే ఎస్‌ఎంఎస్‌లు. సైబర్ నేరగాళ్లు వివిధ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపి ఆర్థిక మోసాలకు పాల్పడటం ఇటీవల విపరీతంగా పెరిగింది. ఇలా ఫోన్ నంబర్లను ఉపయోగించి చేస్తున్న మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘చక్షు’అ్రస్తాన్ని అందుబాటులోకి తెచ్చింది.
మోసపూరిత ఫోన్ నంబర్ల వివరాలు ఈ వెబ్ పోర్టల్‌లో నమోదు చేస్తే.. మోసగాళ్ల పనిపడతాయి దర్యాప్తు సంస్థలు. బ్యాంకులకు సైతం ఈ అనుమానాస్పద ఫోన్ నంబర్లు పంపుతారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు సదరు నంబర్‌తో తెరిచిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయడంతోపాటు మరొకరు మోసానికి గురికాకుండా కాపాడతారు. సాధారణ పౌరులు సైతం సైబర్ మోసగాళ్ల సమాచారాన్ని, మోసపూరిత ఫోన్ నంబర్ల సమాచారాన్ని చక్షు పోర్టల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు.
ఏమిటీ చక్షు పోర్టల్?
చక్షు అంటే కన్ను అని అర్థం.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అందిస్తున్న సిటిజన్ సెంట్రిక్ సర్విసెస్‌లో చక్షు పేరిట ‘రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్’కొత్త సేవా పోర్టల్‌ను కేంద్ర కమ్యూనికేషన్స్, ఎల్రక్టానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే ప్రారంభించారు. అనుమానిత మోసపూరిత కాల్‌లు, సందేశాలు వివరాలు ఇందులో నమోదు చేయవచ్చు.
చక్షు పోర్టల్ ఎలా వినియోగించాలి..
♦ https://sancharsaathi.gov.in లింక్ ద్వారా సంచార్ సాథి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
♦ సిటిజన్ సెంట్రిక్ సర్విసెస్‌లో చక్షు ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
♦ మోసపూరిత కమ్యూనికేషన్‌కు సంబంధించిన వివరాలు, ఆ కాల్ లేదా మెసేజ్ వచ్చిన సమయం, ఇతర వివరాలు నమోదు చేయాలి.
♦ ఫిర్యాదు నమోదైన తర్వాత వెరిఫికేషన్ కోసం ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదైన ఫిర్యాదు దర్యాప్తు సంస్థలకు వెళుతుంది.
ఏయే అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు
♦అనధికారిక కనెక్షన్లు, మనకు వచ్చిన మోసపూరిత నంబర్లు సదరు వ్యక్తులపై ఉన్నాయా లేదా తనిఖీ చేయించవచ్చు.
♦ మనం పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, ట్రాక్ చేయడం చేయవచ్చు.
♦ అనుమానాస్పద విదేశీ నంబర్లపై ఫిర్యాదు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment