పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు. ,మీడియాతో సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడేందుకు రోజురోజుకూ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇన్నాళ్లూ బ్యాంక్ ప్రతినిధులుగా ఖాతాదారులకు ఫోన్ చేసి డెబిట్‌కార్డు కాలవ్యవధి ముగిసిందంటూ రెన్యువల్ చేసేందుకు సేకరించేవారు. ఈ రకం మోసాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో రూటు మార్చారు. సరికొత్తగా బ్యాంక్ ఖాతాదారులకు తెలియకుండానే డబ్బు డ్రా చేస్తున్నారు. ఈ–కామర్స్ సైట్లు, రెడ్‌బస్ యాప్ లాంటి బుకింగ్ అప్లికేషన్లలో ఆన్‌లైన్ సేవలు వినియోగించుకున్న వారి బ్యాంకు కార్డు వివరాలను సేకరించి పిన్ నంబర్ కోసం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) ద్వారా రూఢీ చేసుకుని కార్డులను క్లోనింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత డబ్బులను డ్రా చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రూ.3 కోట్లు కొల్లగొట్టారు. ఐసీఐసీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు జరిపిన సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు జామ్‌తార, బర్ధమాన్ ప్రాంతాలకు చెందిన 10 మంది అంత ర్రాష్ట్ర మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్‌క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌టీఎఫ్ ఏసీపీ శ్యాంబాబులతో కలసి సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు.
3 లక్షల కాల్స్
ప్రధానంగా ప్రయాణాలు చేసేందుకు రెడ్‌బస్ యాప్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారిని టార్గెట్ చేసుకున్నారు. ఆ యాప్‌లోకి వెళ్లి బ్యాంక్ డెబిట్ కార్డు వివరాల కోసం ప్రయత్నించేవారు. చాలావరకు బ్యాంకు కార్డు నంబర్ల తొలి 6 అంకెలు ఒకేలా ఉండటంతో మిగిలిన 10 నంబర్లను ర్యాండమ్‌గా టైప్ చేసేవారు. దీంతో కొన్ని కార్డుల వివరాలు సరిపోలడంతో ఆ వెంటనే ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ నంబర్లు వాటంతట అవే వస్తుండేవి. బ్యాంక్ ఖాతాదారుల సౌలభ్యం కోసం ఐసీఐసీఐ బ్యాంక్ తీసుకొచ్చిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(ఐవీఆర్) కస్టమర్ కేర్ కాల్‌సెంటర్ 18601207777కు ఫోన్ చేసేవారు. అది కనెక్ట్ కాగానే బ్యాంక్ ఖాతా నంబర్ టైప్ చేసి, ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే పిన్ నంబర్ టైప్ చేయాలని కోరితే.. ర్యాండమ్‌గా ఫ్యాన్సీ, లక్కీ నంబర్లు టైప్ చేసేవారు. ఇలా మార్చి 13 నుంచి 30 వరకు ఏకంగా 3 లక్షల కాల్స్ చేశారు. వాటిల్లో దాదాపు 3,500 బ్యాంక్ కార్డు నంబర్‌లతో పిన్‌లు సరిపోలాయి. దాదాపు 12 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కార్డుల ద్వారా ఒక్కో దాని నుంచి రూ.35 వేల నుంచి లక్షన్నర వరకు డ్రా చేసేవారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తోనే ఫోన్ చేయాలన్న నిబంధన లేకపోవడంతో 900 అన్‌రిజిçస్ట్టర్డ్ మొబైల్ నంబర్ల నుంచి వీరు కాల్ చేశారు. ఐవీఆర్‌కు రోజూ 3 వేల వరకు వచ్చే కాల్స్ 30 వేలకు చేరుకున్నాయి. కాగా, తమ బ్యాంక్ ఖాతా నుంచి తమ ప్రమేయం లేకుండానే డబ్బులు డ్రా అవుతున్నాయం టూ ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఫిర్యాదులు పొటెత్తాయి. రెడ్‌బస్ యాప్ ప్రతినిధులను పిలిపించి వారి అప్లికేషన్‌లోనూ మార్పులు చేసుకోవాలంటూ సూచిస్తామని ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు చెప్పారు. కేసు విచారణలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని, ఖాతాదారులకు మోసపోయిన నగదును తిరిగి జమ చేస్తామని తెలిపారు.
బ్యాంకులు ఇది చెయ్యాలి..
- బ్యాంక్ ఖా తాతో రిజిస్టరైన మొబైల్ నంబ ర్లతోనే కస్టమర్ కేర్ సర్వీస్‌ను సంప్రదించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలి.
- సైబర్ మోసాలను నియంత్రించేందుకు రిజిస్టర్డ్ మొబైల్ బ్యాంక్ కస్టమర్లు, తరచుగా ఫోన్‌కాల్ చేసే మోసగాళ్లను గుర్తించేలా సాఫ్ట్‌వేర్ రూపొందించాలి. అన్‌రిజిస్టర్డ్ నంబర్ల నుంచి కాల్స్ రాకుండా బ్లాక్ చేయాలి.
చదివింది తక్కువే..
జార్ఖండ్‌లోని జామ్‌తార జిల్లాకు చెందిన దుర్యోధన్ మండల్, వీరేంద్రకుమార్ మండల్, ధనంజయ్‌మండల్, నిరంజన్ మండల్, ప్రకాశ్ కుమార్, గణేశ్ కుమార్ మండల్, కమలేశ్ మండల్, రాజేంద్రకుమార్, పింకు కుమార్ మండల్, పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ జిల్లాకు చెందిన సంజయ్‌కుమార్‌లు ఇలాంటి మోసాలకు పాల్పడటంలో నిష్ణాతులు. వారంతా చదివింది మాత్రం ఏడో తరగతి వరకే. బ్యాంకు ఖాతాదారులకు బదులు బ్యాంకు నుంచే వివరాలు సేకరించి డబ్బులు కొల్లగొడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment