సమస్యలుంటే కాల్‌ చేయండి  | Sakshi
Sakshi News home page

సమస్యలుంటే కాల్‌ చేయండి 

Published Wed, Mar 15 2023 1:43 AM

Board Secretary Naveen Mittal advised Inter students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:   ఇంటర్మీ డియెట్‌ పరీక్షల నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్టు ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది తలెత్తినా 040– 24601010, 040– 24655027 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలయ్యే పరీక్షల ఏర్పాట్లపై మిత్తల్‌ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు.

ఇంటర్‌ బోర్డ్‌ ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్లు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పనిచేస్తాయని తెలిపారు. ఇవే కాకుండా ప్రతీ జిల్లాలోనూ ప్రత్యేక నంబర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. కాలేజీలతో ప్రమేయం లేకుండా విద్యార్థులే ఇంటర్‌ బోర్డ్‌ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నా రు. మంగళవారం మధ్యాహ్నం వరకూ 50 వేల మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు.

ఉదయం 9 దాటితే పరీక్ష హాలులోకి అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు ఎక్కడా నేలపై కూర్చొని పరీక్ష రాసే విధానం ఉండకూడదని అధికారుల ను ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 9,47,699 మంది పరీక్షలు రాస్తున్నారని, వీరిలో 4,82,677 మంది ఫస్టియర్, 4,65,022 మంది సెకెండీయర్‌ ఉన్నట్టు చెప్పారు. 75 ఫ్లైయింగ్‌ స్వా్కడ్స్‌ పనిచేస్తాయన్నారు.  

డిజిటల్‌ మూల్యాంకనం 
ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్‌లైన్‌లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి రెండోసారి పిలిచిన టెండర్లకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయని, వాటి అర్హతలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

టెన్త్‌ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్‌ కాలేజీల అఫ్లియేషన్‌ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్‌ లేకపోతే పరీక్షకు బోర్డ్‌ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు. ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. 

Advertisement
Advertisement