బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే.. | Justice Eswaraiah Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..

Published Tue, May 7 2024 5:34 AM | Last Updated on Tue, May 7 2024 5:34 AM

Justice Eswaraiah Comments On Chandrababu

సామాజికన్యాయ సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్‌

అధికారకాంక్షతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయి 

పేదలకు, పెత్తందారులకు మధ్యే ఈ ఎన్నికలు  

జగన్‌ సంక్షేమ పాలనను బడుగులు కాపాడుకోవాలి  

అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు జస్టిస్‌ ఈశ్వరయ్య పిలుపు

తిరుపతి కల్చరల్‌: సామాజికన్యాయం పాటిస్తూ బడుగు, బలహీన, అణగారినవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా దేశంలో సంక్షేమ పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య చెప్పారు. చంద్రబాబును నమ్మితే ప్రజలు మరోసారి తీవ్రంగా మోసపోతారని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మళ్లీ బానిస బతుకులు తప్పవని ఆయన హెచ్చరించారు.

 తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్‌ ఈశ్వరయ్య సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కూటమి కట్టిన చంద్రబాబు అనేక ఉచిత పథకాల హామీలు ఇచ్చి మోసంచేశారు. మళ్లీ నేడు అధికారం కోసం అదే బీజేపీ, జనసేనతో చంద్రబాబు జట్టు కట్టారు. అడ్డగోలు హామీలు, అసత్య ప్రచారంతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కుట్రలు పన్నారు. ప్రస్తుత ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయి.

 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కూటమి కల్పించే భ్రమలను నమ్మితే మళ్లీ బానిస బతుకులు తప్పవు. 2019లో అధికారంలోకి వచి్చన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో 99శాతం అమలుచేశారు. ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి సామాజికన్యాయం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూల్స్‌ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఇంగ్లిష్‌ మీడియం అందుబాటులోకి తీసుకువచ్చి పేదల పిల్లలకు మెరుగైన విద్యావసతులు కల్పించారు. కరోనా సమయంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనివిధంగా ప్రజలకు అండగా నిలిచి వారి ఆరోగ్య పరిరక్షణకు సీఎం జగన్‌ భరోసా కల్పించారు.’ అని జస్టిస్‌ ఈశ్వరయ్య చెప్పారు.   

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ఒక సాహసోపేత నిర్ణయం 
‘భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ తీసుకురావడం ఒక సాహసోపేతమైన నిర్ణయం. దీనిపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సమన్యాయం చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తుంటే పచ్చపత్రికలు వారికి వంతపాడుతూ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెడుతున్నాయి.’ అని జస్టిస్‌ ఈశ్వరయ్య అన్నారు.

ఉత్తరాదిలో బీజేపీ హవా తగ్గడంతోనే దక్షిణాదిలో అడ్డగోలు పొత్తులు 
‘వెనుకబడిన వర్గాలను నమ్మించి పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఆయా వర్గాలను నట్టేట ముంచి కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ పబ్బంగడుపుతోంది. ముస్లిం రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగం మార్పు వంటి కుట్రలకు పాల్పడుతోంది. ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ప్రభుత్వ రంగ సంస్థలను కారు­చౌకగా అమ్మేస్తోంది. అందువల్లే ప్రస్తు­తం ఉత్తర భారతదేశంలో బీజేపీ హవా తగ్గింది. దీంతో అధికారం కోసం దక్షిణ భారతదేశంలో అడ్డగోలుగా పొత్తులు పెట్టుకుంది.

అధికారం కోసం పచ్చి అబద్ధాలతో మభ్యపెడుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన విషయంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాలు చైతన్యంతో ఆలోచించి చిత్తుగా ఓడించాలి. సామాజికన్యాయం చేసే జగన్‌ ప్రభుత్వానికి అండగా నిలిచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరింత అభివృద్ధి పథంలో పయనించాలి.’ అని జస్టిస్‌ ఈశ్వరయ్య అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అధ్యయన కమిటీ జాతీయ మాజీ చైర్మన్‌ కృష్ణయ్య, సీనియర్‌ న్యాయవాది వందాడి వెంకటేశ్వర్లు, రాయ­చోటి మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ శశిరేఖ, వివిధ సంఘాల నాయకులు లవ్లీ వెంకటేష్, బుసగాని లక్ష్మయ్య, నాగరాజు, సదాశివ, వెంకటేష్‌ యాదవ్, మాసమయ్య పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement