6.65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,423 కోట్లు జమ
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయడం గమనార్హం. ఇప్పటివరకు ఐదెకరాలలోపు రైతులకే నిధులు విడుదల కాగా, సోమవారం ఐదెకరాలకు పైగా ఉన్న రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రైతుల ఫోన్లకు మెసే జ్‌లు కూడా వచ్చాయి.
గత వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం రైతుబంధు సొమ్ము తీసు కున్న రైతులు 68.99 లక్షలు ఉన్నారు. ఈ యాసంగి సీజన్‌లోనూ అంతేమంది రైతులకు సొమ్ము విడుదల చేస్తా మని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రకారం 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. కాగా ఇప్పటివరకు ఐదెకరాల వరకున్న రైతులకు రూ.5,202 కోట్ల రైతుబంధు సాయం అందిందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.2,423 కోట్లు జమయ్యాయి.
6.65 లక్షల మందికి ‘భరోసా’
రాష్ట్రంలో ఎకరా లోపున్న రైతులు 22.55 లక్షల మంది ఉన్నారు. మొత్తం రైతుల్లో వీరే అత్యధికం. అయితే వారి చేతిలో ఉన్న భూమి కేవలం 12.85 లక్షల ఎకరాలు మాత్రమే. ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది కాగా, వారి చేతిలో ఉన్న భూమి 25.57 లక్షల ఎకరాలు. రెండెకరాల నుంచి మూడెకరాల లోపున్న రైతులు 10.89 లక్షల మంది ఉండగా, వారి చేతిలో అత్యధికంగా 26.50 లక్షల ఎకరాల భూమి ఉంది.
ఇక మూడెకరాల నుంచి నాలుగెకరాల లోపున్న రైతులు 6.64 లక్షల మంది ఉండగా, వారి చేతిలో 22.62 లక్షల ఎకరాలుంది. నాలుగెకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 5.26 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి చేతిలో 21.04 లక్షల ఎకరాల భూమి ఉంది. మొత్తం ఐదెకరాలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. తాజాగా ఐదెకరాలకు పైగా ఉన్న 6.65 లక్షల మంది రైతులకు నిధులు అందజేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment