Sakshi News home page

సుప్రీంకోర్టు: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా

Published Thu, Apr 18 2024 8:09 AM

Supreme Court Hearing Note For Vote Case Updates - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మళ్లీ వాయిదాలు ఇవ్వం.. ఇదే చివరి అవకాశం అని ఓటుకు నోటు కేసు విచారణలో చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు  స్పష్టం చేసింది. కేసు ప్రారంభం కాగానే విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు కోరడంతో కేసు విచారణ జూలై 24కి కోర్టు వాయిదా వేసింది.

ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరఫున న్యాయవాది కోరగా, సెలవుల తర్వాత విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాది కోరారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలైంది.

చార్జిషీట్‌లో చంద్రబాబు పేరును 22 సార్లు ఏసీబీ ప్రస్తావించింది. అయినా చంద్రబాబు పేరు నిందితుడిగా తెలంగాణ ఏసీబీ చేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ జరిపింది.

 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. ఫోన్లో మాట్లాడిన ఆడియోను ఏసీబీ బయటపెట్టింది. "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ నిర్ధారించింది.

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదు: ఎమ్మెల్యే ఆర్కే

కేసు విచారణ అనంతరం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సాక్షి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. కేసు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని, ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదాలు ఇచ్చేదిలేదంటూ సుప్రీంకోర్టు జూలై 24కు కేసు వాయిదా వేసిందని వివరించారు. ఒక ఓటుకు ఐదు కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది. 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బు ఇచ్చారు. అన్ని సాక్షాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే. ఏడేళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగదీస్తున్నారు. సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు’’ అని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement