మాయలు, మోసాలే బాబు నైజం | Sakshi
Sakshi News home page

మాయలు, మోసాలే బాబు నైజం

Published Wed, May 1 2024 4:40 AM

All the promises in 2014 elections were fraud: andhra pradesh

సాక్షి, అమరావతి: మాట ఇస్తే నిలబెట్టుకోవడం సీఎం జగన్‌ నైజం. ఇచ్చిన మాటను తుంగలో తొ­క్కడం చంద్రబాబు లక్షణం. ప్రజలకు ఇచ్చిన హా­మీ­ల అమలుకు చిత్తశుద్ధితో, నిజాయితీతో, రూ­పాయి అవినీతి లేకుండా వంద శాతం ప్రజలకు మేలు చేకూరేలా అమలు చేయడం సీఎం జగన్‌ లక్షణం. ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా హామీ­లిచ్చేసి, మభ్యపెట్టి కుర్చీ ఎక్కిన తర్వాత ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకపోవడం, వారికిచ్చిన హామీ­ల­కు తూట్లు పొడిచేయడం, అడుగడుగునా మోసం చేస్తూ ప్రజలను నిలువునా ముంచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య.

ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వసనీయతకు, విలువలకు మారు పేరు సీఎం వైఎస్‌ జగన్‌ అయితే చంద్రబాబు వంచనకు, అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరు. 2014­లో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో.. దాన్ని అమలు చేసిన తీరు, 2019లో వైఎస్‌ జగన్‌ విడు­దల చేసిన మేనిఫెస్టో.. దాన్ని అమలు చేసిన విధా­నాన్ని పరిశీలించి చూస్తే ఈ తేడా ప్రస్ఫుటంగా కని­పిస్తుంది. ఆ తేడాయే జగన్‌ను ప్రజల్లో విశ్వసనీయమైన నేతగా నిలబెడితే,బాబును మోస­కారిగా, నయవంచకుడిగా మిగిల్చింది. ప్ర­జ­ల­ను మాయ చేసి నమ్మించడం కోసం చంద్రబాబు హా­మీ­లు ఇస్తారనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలిసిన సత్యం.

పొరపాటున అధికారంలోకి వస్తే ఆ హామీ­లకు తూట్లు పొడిచేసి, ఆ తర్వాత హామీలన్నింటినీ అమలు చేశానని ఘనంగా బుకాయించడం చంద్రబాబుకి తెలిసినంతగా ఏ రాజకీయ నాయకుడికీ తెలియదు. 2014 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రజలను నమ్మించేందుకు ఆయన ఏకంగా 600కి పైగా హామీలు ఇచ్చారు. జనసేనతో కలిసి 52 పేజీలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. వాటిని నమ్మి ప్రజలు అధికారమిస్తే వారి నడ్డి విరిచేసి, నిలువునా ముంచేసి, ఆ హామీలకు మంగళం పాడేశారు.

రైతు రుణమాఫీ అమలు చేయకుండా మోసం
చంద్రబాబు 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి రైతు కుటుంబాలను నమ్మించారు. అప్పటికి ఉన్న రూ.87,616 కోట్ల రుణాలను చంద్రబాబు మాఫీ చేయాల్సి ఉంది. అయితే, 2014లో ఆయన అధికారంలోకి రాగానే దాన్ని నీరుగార్చే పని మొదలుపెట్టారు. 

కోటయ్య కమిటీని నియమించి రూ.24,500 కోట్లు మాఫీ చేస్తే సరిపోతుందని తేల్చారు. ఆ సొమ్మును కూడా ఐదేళ్లు ఇదు విడతలుగా ఇస్తానని మరో మడత పేచీ పెట్టారు. పోనీ అదైనా చేశారా అంటే అదీ లేదు. మూడు విడతలు మాత్రమే.. అది కూడా కొందరికే మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ అరకొర మాఫీ డబ్బు వడ్డీలకే సరిపోక రైతులు రుణ ఊబిలో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఇస్తానని నమ్మించి మోసం చేయడంతో ఆ వడ్డీలూ కట్టలేక రైతులు నిండా మునిగిపోయారు.

అడుగుతున్నారని మేనిఫెస్టోనే మాయం చేశారు
2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడంతో, వాటి గురించి ప్రజలు అడుగుతుండటంతో సమాధానం చెప్పలేక దాన్ని తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించిన చరిత్ర చంద్రబాబుది. 2014లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించి, 2019 ఎన్నికల్లో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నించారు. కానీ ప్రజలు చంద్రబాబు నైజాన్ని గమనించి చరిత్రలో ఎన్నడూ లేనంత చిత్తుగా ఆయన్ని ఓడించి ఇంటికి సాగనంపారు.

గత చరిత్రను మరిచి సూపర్‌ సిక్స్‌ పేరుతో మళ్లీ కొత్త హామీలు
ఇంతటి ఘనమైన తన హామీల చరిత్రను మరచిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో ప్రజలను నమ్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న హామీలను కాపీ కొట్టి ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’ అంటూ  పేర్లు మార్చి ప్రజల్లోకి వదిలారు. ముందస్తు మేనిఫెస్టో పేరుతో 11 నెలల క్రితమే దాన్ని విడుదల చేశారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు తుది మేనిఫెస్టో వదిలారు.

కానీ 2014 ఎన్నికల్లోనూ ఇదే కూటమి పేరుతో ప్రధాని మోదీ, పవన్‌ కళ్యాణ్, తన ఫొటోలు కలిపి, తాను సంతకం చేసి మరీ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్లు చెప్పుకొన్నారు. ఈ హామీలపై ప్రజలు నిలదీయడంతో మేనిఫెస్టోనే చెత్తబుట్టలో పడేశారు. దీంతో ప్రజలు కూడా 2019లో ఆయన్ని చెత్తలోకి నెట్టేశారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో ప్రజలను వంచించేందుకు రెడీ అయ్యారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ప్రజలు తిరస్కరించినా మళ్లీ సిగ్గు లేకుండా మేనిఫెస్టో పేరుతో వారి వద్దకు వెళ్లడానికి బరితెగించిన పచ్చి మోసకారి చంద్రబాబు.

డ్వాక్రా రుణ మాఫీకి శఠగోపం
2014 ఎన్నికల్లోనే డ్వాక్రా రుణాలనుమ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. సీఎం అవగానే ఎగనామం పెట్టారు. చంద్రబాబు వచ్చి తమ రుణాలు చెల్లిస్తాడని నమ్మిన అక్కచెల్లెమ్మలు మోసపోయారు. రుణ వాయిదాలు, వడ్డీలు తడిసి మోపెడై అప్పుల పాలయ్యారు. బ్యాంకులకు రుణాలు చెల్లించలేక డిఫాల్టర్లుగా మారి­పోయారు. వారికి తిరిగి రుణాలివ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి.  బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వీధివీధినా బెల్టు షాపులు పెట్టేలా ప్రోత్సహించారు. మహాలక్ష్మి పథకం కింద పుట్టిన ప్రతి ఆడబిడ్డకి రూ.30 వేలు డిపాజిట్‌ చేసి, యుక్త వయసు వచ్చాక రూ.2 లక్షలు వచ్చేలా చేస్తానని ఇచ్చిన హామీనీ గాలిలో కలిపేశారు.

ఇంటికో ఉద్యోగం లేదు.. నిరుద్యోగ భృతీ లేదు
బాబు వస్తేనే జాబు అని 2014 ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు.. సీఎం అయ్యాక పట్టించుకోలేదు. ఇంటికో ఉద్యోగం  హామీని తుంగలో తొక్కేయడమే కాకుండా, ఉన్న ఉద్యోగాలనూ ఊడగొట్టారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినా, ఒక్కరికీ  ఇవ్వలేదు. దీనిపై యువత నిలదీస్తుండటంతో ఎన్నికలకు 3 నెలల ముందు కొందరికి వెయ్యి చొప్పున విదిల్చి, మమ అనిపించారు.  రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు, పేదలకు 3 సెంట్లలో ఇళ్ల స్థలం, పండంటి బిడ్డకు రూ.10 వేలు ఇస్తాననే హామీలనూ బుట్టదాఖలు చేశారు. బీసీలకు వంద అసెంబ్లీ స్థానాలు, రూ.10 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తామని చెప్పి మోసం చేశారు. ఇలా హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక  మోసం చేశారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement