ఈదురు గాలుల బీభత్సం | Sakshi
Sakshi News home page

ఈదురు గాలుల బీభత్సం

Published Tue, May 14 2024 8:55 AM

ఈదురు గాలుల బీభత్సం

– 60 ఎకరాల్లో నేలకొరిగిన అరటి పంట

పులివెందుల రూరల్‌ : వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం వీచిన ఈదురు గాలులకు సుమారు 60 ఎకరాల్లో అరటి పంట నేలకొరిగింది. నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆరుగురు రైతులకు సంబంధించి సుమారు 60 ఎకరాల్లో అరటి పూర్తిగా దెబ్బతింది. పంట విలువ రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు ఉంటుందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంటలను వైఎస్సార్సీపీ మండల కన్వీనర్‌ అజ్జుగుట్ట భాస్కర్‌రెడ్డి, యూత్‌ నాయకుడు కొ మ్మ ఉమేష్‌రెడ్డి పరిశీలించారు. వివరాలను పులివెందుల మండల వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి చవ్వా దుష్యంత్‌రెడ్డి, హార్టికల్చర్‌ అధికారి రాఘవేంద్రారెడ్డిలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు.

అనారోగ్యంతో కానిస్టేబుల్‌ మృతి

కడప అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎం.టి విభాగంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తుమ్మల సురేష్‌(38) నాగరాజుపేట– కాగితాలపెంట మార్గంలోని నారాయణ కళాశాల కూడలి సమీపంలో అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు పరిశీలించేసరికి సురేష్‌ మృతి చెందాడు. 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ సురేష్‌కు భార్య వరుణ, కుమార్తె జాహ్నవి వున్నారు. సురేష్‌ తన భార్య, కుమార్తెతో కలిసి వేంపల్లిలోని గాండ్లవీధిలో నివాసం వుంటున్నాడు. గత ఆరు నెలల నుంచి కడపలోని ఏఆర్‌లో ఎం.టివిభాగంలో పనిచేస్తున్నాడు. ఎన్నికల విధుల సందర్భంగా కార్యాలయానికి వెళ్లి మధ్యాహ్నం భోజన సమయంలో సంఘటన స్థలం వద్దకు చేరుకున్నాడు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో అస్వస్థతకు గురై మృతి చెందాడు. భార్యతో పాటు, కుటుంబసభ్యులు కడప ఒన్‌టౌన్‌ సీఐ భాస్కర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జ్యెవెలరీ షాప్‌లో మంటలు

రాయచోటి టౌన్‌ : రాయచోటి పట్టణంలోని జ్యువెలరీ షాపులో విద్యుత్‌ షార్ట్‌ షర్యూట్‌తో మంటలు రేగాయి. భారీ నష్టం జరగలేదని ఫైర్‌ స్టేషన్‌ అధికారులు తెలిపారు. రాయచోటి పట్టణంలోని కంసల వీధిలో ఉన్న విజయలక్ష్మీ జ్యూవెలర్స్‌ (జానకీ రాం) షాపునకు యజమానులు ఆదివారం తాళాలు వేసి ఇంటి వద్ద ఉన్నారు. మధ్యాహ్నం ఇన్వర్టర్‌లో షార్ట్‌ షర్కూట్‌తో మంటలు రేగాయి. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఇంటి నిండా పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు యజమానులకు, ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అధికారులు తలుపులు తెరిచి చూడటంతో అప్పటికే రూ.2.5 లక్షల విలువగల ఎలక్ట్రికల్‌ వైర్లు, ఇన్వర్టర్‌, ఫర్నీఛర్‌, ఇతర సామగ్రి కాలిపోయాయి. భారీ నష్టం జరగలేదని అధికారులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement