No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, May 17 2024 4:30 AM

-

బొబ్బిలి: ఉత్తరాంధ్రుల ఇలవేల్పులు, కోరిన కోరికలు తీర్చే గొల్లపల్లి దాడితల్లి, పాత బొబ్బిలి సరేపోలమ్మ అమ్మవార్ల సిరిమానోత్సవ సంబరాలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. ఈనెల 19,20,21 తేదీల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా అమ్మవార్ల పండగలు నిర్వహించేందుకు రెండు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 19న దేశతల్లి అమ్మవారి ఉత్సవంతో ప్రారంభమయ్యే పండగలో భాగంగా 20న సిరిమానోత్సవం జరుగుతుంది. 21న అనుపోత్సవం నిర్వహిస్తారు. ఈ జంట సంబరాలకు రెండు ప్రాంతాల్లో భక్తులు సన్నద్ధమయ్యారు. గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి పండగను చుట్టుపక్కల 12 గ్రామాల వారు ఘనంగా జరుపుకుంటారు. అలాగే పాత బొబ్బిలిలో సరేపోలమ్మ ఉత్సవాలు కూడా ఈనెల 19నే ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రభల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గొల్లపల్లి, పాత బొబ్బిలి అమ్మవార్ల సిరిమానోత్సవాలు సోమవారం ఘనంగా జరుగుతాయి. పాత బొబ్బిలి నుంచి పట్టణంలోకి సిరిమాను ప్రవేశించి పురవీధులన్నీ కలియదిరిగి భక్తులను పరవశింప చేస్తుంది. అలాగే గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి సిరిమాను కూడా సోమవారం సాయంత్రం గొల్లపల్లి నుంచి ఊరేగింపుగా ప్రారంభమై పట్టణంలోకి ప్రవేశించి పట్టణంలోని అన్ని వీధుల్లోనూ కలియదిరుగుతుంది. ఉత్సవాలలో భాగంగా పాత బొబ్బిలి, గొల్లపల్లిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాము గరిడీలు, బిందెల డ్యాన్సులు, తప్పెట గుళ్లు, కోలాటం, భారీ లైటింగ్‌, బళ్ల వేషాలు, కాంతార హంస డ్యాన్స్‌, బాహుబలి ప్రదర్శన, తీన్‌మార్‌, డీజే, మందుగుండుసామగ్రి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పటికే పట్టణంలో అమ్మవార్ల ఘటాలు తిరుగుతూ భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement