మున్సిపల్‌ స్థలంపై కన్ను! | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ స్థలంపై కన్ను!

Published Mon, Mar 25 2019 4:34 PM

Eye On Muncipal Land In Achampet - Sakshi

సాక్షి, అచ్చంపేట: స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీ వారు వివిధ సంఘాలకు సుమారు 6వేల గజాల స్థలాలు దారదత్తం చేశారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం వీటి విలువ రూ.10కోట్లపై మాటే. పట్టణ నడ్డిబొడ్డున ఉన్న స్థలాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. లేఅవుట్ల రూపేణ పంచాయతీకి కేటాయించిన స్థలాలను పరిరక్షించుకోవడంలో మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైంది.
అచ్చంపేటలో గజం ధర రూ.7వేల నుంచి రూ.17 వేల వరకు పలుకుతోంది. వందలు, వేలలో ఉన్న పన్నులు చెల్లించకుంటే నల్లా కనెక్షన్‌ తొలగిస్తామని హెచ్చరించే మున్సిపల్‌ అధికారులు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోరు. రియల్‌ వ్యాపారుల నుంచి పంచాయతీకి రావాల్సిన రూ.లక్షల ఆదాయ వనరులను తుంగలో తొక్కేస్తున్నారు. మేజర్‌ గ్రామంచాయతీ సమయంలో పట్టణంలో వెంచర్లు చేసినా.. 10శాతం స్థలంతో పాటు వెడల్పు రోడ్లు చేశారు. 

మున్సిపాలిటీగా అపగ్రేడ్‌ తర్వాత
మేజర్‌ పంచాయతీ నుంచి నగరపంచాయతీ, మున్సిపాలిటీగా ఆప్‌గ్రేడ్‌ అయినా ఇంతవరకు ఒక వెంచర్‌లో కూడా స్థలం ఇవ్వలేదంటే ఎంత ఉదాసీనంతో వ్యరిస్తున్నారో అర్థమవుతోంది. ప్రస్తుతం పట్టణంలో పదుల సంఖ్యలో వెంచర్ల వెలిశాయి. వెంచర్లలో ఎక్కువశాతం కౌన్సిలర్లు భాగస్వాములుగా ఉండడంతో ఈ పరిస్థితి దాపురించినట్లు విద్యావంతులు, మేధావులు చర్చించుకుంటున్నారు. దీంతో మున్సిపల్‌ ఆదాయానికి గండిపడుతోంది. 

వివిధ సర్వే నంబర్లలో..
సర్వే నంబరు 292ఇలో 208 గజాల స్థలాన్ని టైలరింగ్‌ అసోషియేషన్‌కు కేటాయించారు. 309, 310 సర్వే నంబరులో 1040 గజాలు వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్‌ సొసైటీ, 311/62లో 560 గజాలు రెడ్డిసేవా సమితి, 281లో 244 గజాలు అంబేద్కర్‌ సంఘం, 305/8, 307లో 282 గజాలు రైస్‌ మిల్లర్స్‌ అసోషియేషన్, 24/అ, 24/ఆలో 644 గజాలు కెమిస్ట్రీ, డ్రగ్గిస్ట్‌ అసోషియేషన్‌కు కేటాయించారు.
అలాగే 305, 307లో 282 గజాలు ప్రజాపిత బ్రహ్మ కుమారీస్‌ ఈశ్వరమ్మ విద్యాలయం, 302అ, 303ఆ2లో 264 గజాలు రిక్రియేషన్‌ క్లబ్, 26, 27, 77/లో 605 గజాలు బుడగ జంగాల హక్కుల పోరాట సంఘం, 26అ, 26ఆ, 13లో 813 గజాలు మాల మహానాడు, 303ఇ, 303అలో 223 గజాలు వస్త్ర వ్యాపార సంఘం, 308, 309లో 312 గజాలు శాలివాహన సంఘం 301/6లో492 గజాలు బాబు జగ్జీవన్‌రావ్‌ సంక్షేమ సంఘం, సర్వేనెంబరు 33లో మదురానగర్‌లో 2,100 గజాల స్థలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కేటాయించారు. అప్పట్లో పంచాయతీ వారు ఇచ్చిన వివరాల ప్రకారం ఇవి కొన్ని మాత్రమే. స్థలాల కేటాయింపులు ఇంకా వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. కేటాయించిన వాటిలో కూడా చాలా వరకు భవన నిర్మాణాలు జరగలేదు. ఆయా సంఘాలు ఆస్థలాలను అద్దెకు ఇచ్చుకుంటున్నాయి. 

స్థలాలు కేటాయించేది ఎవరు?
పంచాయతీ, ప్రభుత్వ స్థలాలను సంఘాలు, ఇతరులకు కేటాయించాలంటే తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించాలి. అనుమతి కోసం కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక పంపించి కేబినెట్‌ నిర్ణయం తర్వాత కేటాయింపులు జరగాలి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా స్థలాల కేటాయింపులు జరిగాయి.ఈ స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా నేటికీ అచ్చంపేట మున్సిపల్‌ అధికారులకు తెలియదంటే అతిశయోక్తి.

ప్రజా అవసరాలు అక్కరల్లేదా?
పట్టణ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి పాట్లు చేసే రియల్‌ వెంచర్లు వ్యాపారులు 10 శాతం భూమిని మున్సిపల్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలి.  దీని మున్పిపాలిటీ ప్రజా అవసరాలకు వినియోగించాలి. ప్రభుత్వ భవనాలు, పార్కులు ఇతర అవసరాలకు ఈ స్థలం ఉపయోగించుకోవాలి. అయితే  ఇక్కడ  అందుకు విరుద్ధంగా జరుగుతోంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement