అభిప్రాయం
పాకిస్తాన్ వద్ద అణు బాంబు ఉందనీ, ఆ దేశాన్ని సరిగా గౌరవించకపోతే, మన దేశం పైన అణు బాంబులు వేసి, మనకు నష్టాన్ని కలిగిస్తుందనీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయ విశ్లేషకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ దేశం నాది అని భావించే ప్రజా సమూహానికి, జాతి హితైషులకు మాత్రం వారి వ్యాఖ్యలు కోపాన్నీ, చిరాకునూ తెప్పించాయి. అయినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి.
కాంగ్రెస్ నాయకుల మైండ్ సెట్ ఇంతేనని ప్రజలు సరిపెట్టుకుంటున్నారు. 1947లో ఈ దేశాన్ని మతం ఆధారంగా విడగొట్టి ముస్లిం లీగ్ నాయకులను సంతృప్తి పరిచారు. భారత్‌ను సెక్యులర్ దేశం అంటూ 1947 నుంచి దాదాపు 60 సంవత్సరాలు పాలించారు. వారి పరిపాలన కాలంలో పాకిస్తాన్‌తో 1948, 1965, 1971ల్లో మన సైన్యం యుద్ధం చేయవలసి వచ్చింది. ఈ యుద్ధాల్లో అపారమైన రక్షణ వ్యయాన్ని దేశం భరించవలసి వచ్చింది.
పాకిస్తాన్‌ను ఎందుకు గౌరవించాలి అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఈ దేశ ప్రజలకు స్పష్టంగా చెప్పలేక పోతున్నారు. దేశంలో ముస్లింలను ప్రత్యేక పౌరులుగా ట్రీట్ చేశారు. దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపించినందుకేనా? లేక ఈ దేశంలో తిండి తింటూ, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసే దేశద్రోహులను ఈ దేశానికి ఎగుమతి చేసినందుకా? లేక పాకిస్తాన్ పై ప్రేమ వలకబోస్తే– ఈ దేశంలోని ముస్లిం సమాజం గంపగుత్తగా ఓట్లు వేసి, తమకు అధికారాన్ని కట్టబెడుతుందని ఆశతోనా? ఏమో మరి! వారి ఆలోచనలు ఈ దేశ సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదు.
స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధానాన్ని విశ్లేషిస్తే–ఇస్లాం మత అనుకూల పరిపాలనను సాగించిందని చెబితే అవాస్తవికత ఏమీ ఉండదు. షాబానో కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కాలరాచి, ముస్లిం స్త్రీల హక్కులను బొంద పెట్టి, ఇస్లామిక్ మత అనుకూల చట్టాన్ని కాంగ్రెస్ నాయకులు చేశారు. ప్రపంచంలో ఏ సెక్యులర్ దేశం లేక ఇస్లామిక్ దేశం హజ్ యాత్రకు సబ్సిడీలను ఇవ్వదు. కానీ కాంగ్రెస్ పాలకులు ఆ ఘనకార్యాన్ని సాధించారు. రాష్ట్రపతి భవన్‌ను ఇఫ్తార్ విందులకు కేంద్రంగా మార్చారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆలోచనా విధానం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్తాన్ పీచ మణచాలనీ, రక్షణ పరంగా, ఆర్థికపరంగా, దౌత్యపరంగా దెబ్బతీసి, చచ్చిన పాముగా మార్చాలని బీజేపీ వ్యూహం. ఈ దేశ భద్రత, సమైక్యత, సమగ్రతల విషయంలో బీజేపీ నాయకుల ఆలోచనా విధానం స్పష్టంగా ఉంటుంది. కుహనా లౌకికవాద ఆలోచనలకు, ముస్లిం సంతుష్టీకరణలకు వారు చాలా దూరం. అందుకే లౌకికవాద ముసుగు వేసుకున్న హిందూ రాజకీయ నాయకులు బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టకుండా ఉండలేరు.
ఇక చివరగా ఈ దేశ ఉత్థాన పతనాలలో భాగస్వామిగా మారిన కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన జాతీయ విధానంతో ముందుకు వెళ్లకపోతే– ఆ పార్టీ నాయకులకు భవిష్యత్తు అంధకారంగానే ఉంటుందని చెప్పక తప్పదు. వాస్తవం మాట్లాడితే, ఈ దేశం పట్ల ఆ పార్టీ నాయకులు చేసిన పొరపాట్లే (కుహనా లౌకికవాద ఆలోచనలు) భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏని అందలమెక్కించాయని చెబితే అతిశయోక్తి ఏమీ ఉండదు.
ఉల్లి బాల రంగయ్య
వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment