కోడలి హత్య కేసులో అత్తకు రెండు జీవిత ఖైదులు | Mother in law gets two life sentences in Kodali murder case | Sakshi
Sakshi News home page

కోడలి హత్య కేసులో అత్తకు రెండు జీవిత ఖైదులు

Published Thu, Jun 6 2024 5:20 AM | Last Updated on Thu, Jun 6 2024 5:20 AM

Mother in law gets two life sentences in Kodali murder case

ఖలీల్‌వాడి: కట్నం కోసం కొడుకుతో కలిసి కుట్రపన్ని కోడలి కిరాతకంగా హతమార్చిన చేసిన కేసులో బానోత్‌ పద్మ అనే దోషికి రెండు జీవిత కారాగార శిక్షలు విధిస్తూ నిజామాబాద్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ప్రధాన ముద్దాయి బానోత్‌ రామ్‌సింగ్‌ కోర్టు వాయిదాకు గైర్హాజరవడంతో అతనిపై బెయిల్‌కు వీల్లేని అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. ముద్దాయి కోర్టుకు హాజరయ్యాక శిక్ష ఖరారు చేయనున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. 

ప్రేమించి పెళ్లి చేసుకుని... 
నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలం శివ తండాకు చెందిన బానోత్‌ రామ్‌సింగ్‌... ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన యెండల రాధ సికింద్రాబాద్‌లోని కళామందిర్‌ షోరూంలో కలిసి పనిచేసేవారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించి 2020 జనవరి 30న నవీపేట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. రాధ తల్లిదండ్రులు పేదలు కావడంతో పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇవ్వలేదు. 

అయితే పెళ్లియిన కొన్ని రోజులకే కట్నం కోసం రాధకు వేధింపులు మొదలయ్యాయి. రూ. లక్ష నగదుతోపాటు బంగారాన్ని తల్లిదండ్రుల నుంచి తేవాలని భర్త, అత్త పద్మ ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ విధించడంతో రామ్‌సింగ్‌ ఉద్యోగం కోల్పోయాడు. మరో పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా కలిసొస్తుందని భావించాడు. ఇందుకు అడ్డంకిగా ఉన్న భార్యను చంపాలని తల్లితో కలిసి కుట్రపన్నాడు.

బైక్‌పై తీసుకెళ్లి.. 
చుట్టాల ఇంటికి వెళ్లొద్దామని రాధను నమ్మించిన రామ్‌సింగ్, పద్మ ఆమెను బైక్‌పై తీసుకెళ్లారు. దగ్గర దారిలో వెళ్దామంటూ రాధను మాక్లూర్‌ మండలం రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతంలోని బాసం లొద్ది గుట్టపైకి తీసుకెళ్లారు. ముందు నడుస్తున్న రాధపై వెంట తెచ్చుకున్న పెట్రోల్, కిరోసిన్‌ను అత్త పోసింది. వెంటనే రామ్‌సింగ్‌ అగ్గిపుల్ల గీసి నిప్పంటించడంతో మంటలకు తాళలేక రాధ విలవిల్లాడింది. 

అయినా ఆమె బ్రతికి ఉండటంతో బండ రాళ్లతో తలపై కొట్టి తీవ్రంగా గాయపర్చారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఒక గుంతలో పడేసి సజీవదహనం చేశారు. ఈ కేసును ఛేదించిన అప్పటి నిజామాబాద్‌ సౌత్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయగా విచారణ చేపట్టిన జడ్జి తాజాగా ముద్దాయి పద్మకు జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. 

వరకట్న వేధింపులు, హత్య చేసినందుకు ఒక జీవితఖైదు విధించడంతోపాటు కుట్ర కేసులో మరో జీవిత ఖైదు, సాక్ష్యాధారాలను మాయం చేసిన నేరానికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రధాన ముద్దాయిపైనా నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారించారు. పోలీసుల తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవిరాజ్‌ వాదనలు వినిపించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement