లక్నో: వరకట్నం నిషేధంపై ఎన్నిచట్టాలు వచ్చినా, వరకట్న వేధింపులు, హత్యలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నంకోసం భార్యను అమానుషంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ వీధుల్లో ఆదివారం పట్టపగలు ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సిన కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది.
సుర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని తుంద్వాల్ గ్రామానికి చెందిన సరస్వతిగా బాధితురాలిని గుర్తించారు. నిందితుడు భర్త మనోజ్‌గా గుర్తించారు. కేవలం తను అడిగిన గేదె, బంగారు గొలుసు తేలేదన్న ఆగ్రహంతో భార్య సరస్వతిని దారుణంగా కొట్టడం ప్రారంభించాడు. పదే పదే తలను నేలకేసి కొట్టాడు. అయినా అతని ఉన్మాదం చల్లారలేదు. ఆ తర్వాత ఆమెను గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడని హర్దోయ్ పోలీసులు తెలిపారు.
చివరకు స్థానికులు జోక్యం చేసుకుని ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. క్రూరమైన దాడి వీడియోను చూసిన తర్వాత బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల గేదె, బంగారు గొలుసు కావాలంటూ తన బిడ్డను వేధిస్తున్నాడని తండ్రి వాపోయాడు. అంతేకాదు కోరిక తీర్చకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటూ గత వారం రోజులుగా తమని బెదిరించాడని కూడా బాధితురాలి తండ్రి కన్నీరు పెట్టుకున్నారు.
2011లో సరస్వతి మనోజ్ వివాహం చేశామని, మొదట్టో కొన్ని నెలలు బాగున్నారని తెలిపారు. దాదాపు ఆరు నెలల తర్వాత, కట్నం కోసం మానసికంగా, శారీరక హింసకు పాల్పడ్డాడని తెలిపారు. ఇంతకుముందు పలుసార్లు అల్లుడి డిమాండ్లను నెరవేర్చామని, ఇంతలోనే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడంటూ రోదించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు నిమిత్తం టీమ్ ఏర్పాటు చేశామనీ, నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నామని సిటీ సర్కిల్ ఆఫీసర్ వికాష్ జైస్వాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment