ఫ్యాన్‌కే వేశాం.. కానీ? | Reasons For YSRCP Defeat in 2024 Elections | Sakshi
Sakshi News home page

ఫ్యాన్‌కే వేశాం.. కానీ?

Published Thu, Jun 6 2024 8:02 AM | Last Updated on Thu, Jun 6 2024 8:06 AM

 Reasons For YSRCP Defeat in 2024 Elections

విజయనగరం: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సామాన్యుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికమంది ఫ్యాన్‌కు ఓటేస్తే.. కూటమి అభ్యర్థికి ఎలా పడ్డాయంటూ గ్రామాల్లోని రచ్చబండలపై చర్చ జోరుగా సాగుతోంది. కొన్ని గ్రామాల్లో శతశాతం వైఎస్సార్‌సీపీ అభిమానులు ఉన్న చోట కూడా సైకిల్‌ గుర్తుకు వందల్లో ఓట్లు రావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా ఎలా సాధ్యమైందంటూ ఆయా గ్రామాల ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. 

అందరమూ ఫ్యాన్‌ గుర్తుకే ఓటేస్తే.. కూటమి అభ్యర్థులకు మెజార్టీ ఎలా వచ్చిందంటూ నాయకులు, ప్రజలు ఓ చోటకు చేరి తర్కిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు ఓటువేసేందుకు వెళ్లే సమయంలో పోలింగ్‌ కేంద్రంలో ఏమైనా మతలబు జరిగిందా? లేదంటే ఈవీఎంలలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న సందేహం వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనా ఫలితాలు భిన్నంగా ఉన్నాయని, ఓటర్లు ఓ వైపు ఉంటే.. ఓట్లు మరోవైపు పడ్డాయని, దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికల కమిషన్‌ దృష్టిసారిస్తే నిజాలు బయటకు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.    

                             

అనుమానాలు ఉన్నాయి  
ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి. నాతో పాటు మా ఊరిలో అత్యధిక మంది వైఎస్సార్‌ సీపీకి ఓటు వేశాం. ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయో అర్థం కావడం లేదు. ఫలితాల సందేహాలను ఎన్నికల కమిషన్‌ నివృత్తి చేయాలి. 
– కునుకు వెంకటరావు, సర్పంచ్, గుంకలాం, విజయనగరం జిల్లా 



ఇది ఎలా సాధ్యం?   
మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో మేమంతా ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేశాం. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేద్దామనే దృఢ సంకల్పంతో మా పంచాయతీలో 70 శాతం మంది ఓటర్లు ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి మద్దతు తెలిపామని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో మా పంచాయతీలో 3,686 ఓట్లు పోల్‌ కాగా, ఇందులో 2 వేలకు పైబడి ఓట్లు వైఎస్సార్‌ సీపీకే రావాల్సి ఉంది. కానీ ఫలితాలు చూసే సరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్టకి కేవలం 1507 ఓట్లు, టీడీపీకీ 2,042 ఓట్లు వచ్చాయి. ఇది ఎలా సాధ్యమైందో నాకు అర్థంకావడం లేదు. అంతా అయోమయంగా ఉంది.         

 నక్క వర్షిణి,వైస్‌ ఎంపీపీ, బొద్దాం గ్రామం, రాజాం 

 కుట్ర పూరితమే!  
మా గ్రామంలో నాలుగు పోలింగ్‌ బూతులున్నాయి. మొత్తం 3,417 ఓట్లు పోలయ్యాయి. చాలా ఓట్లు టీడీపీకి వెళ్లాయి. పోలింగ్‌ కేంద్రంలో పనిచేసే సిబ్బంది ఓటర్ల నాడికి వ్యతిరేకంగా పోలింగ్‌ జరిగేలా సహకరించారనిపిస్తోంది. కేవలం కుట్ర పూరితమైన ఎన్నికల్లా ఉన్నాయి. ఇది చంద్రబాబు, స్థానిక బొబ్బిలి రాజులు చేసిన కుట్రనే అనిపిస్తోంది. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఈ ఎన్నికలు జరుగలేదు. ఈసీ దృష్టి సారించాలి.  
     – సీర తిరుపతినాయుడు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, అలజంగి, బొబ్బిలి మండలం  

జిల్లేడు వలస వైఎస్సార్‌సీపీది 
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జిల్లేడువలస గ్రామం మొత్తం ఓట్లు 363. గ్రామస్తులందరూ వైఎస్సార్‌సీపీ అభిమానులు. ఇక్కడ వైఎస్సార్‌సీపీకి 98 ఓట్లు, టీడీపీకి 167ఓట్లు వచ్చాయి. వీటిని చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈవీఎంలపై అనుమానం వ్యక్తమవుతోంది. దీనిపై ఈసీ దృష్టిసారించాలి.  
    – దండి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ నాయకుడు, జిల్లేడువలస  

ఆశ్చర్యం కలిగిస్తోంది  
ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 2014లో గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి  వైఎస్సార్‌సీపీకి 9వేల పైచిలుకు మెజార్టీ ఓట్లు, 2019లో 12వేల పైచిలుకు మెజార్టీ దక్కింది. గత ఐదేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాభివృద్ధి పథకాలు ప్రతీ గడపను తాకాయి. ప్రజలంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన లబ్ధిని పొందారు. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఎంతో సానుకూలతా చూపారు. గతానికి మించి మెజార్టీ వస్తుందని దృఢంగా నమ్మాం. కానీ, ఫలితాలు చూస్తే తారుమారయ్యాయి. తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనుమానాలకు తావుతీస్తోంది.             
– కె.దీనమయ్య, ఎంపీపీ, గుమ్మలక్ష్మీపురం

ఏదో జరిగింది..?  
సార్వత్రిక ఎన్నికల్లో నాతో పాటు మా గ్రామస్తుల్లో అధిక శాతం మంది ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి జగనన్నకు మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో మా గ్రామ పంచాయతీ నుంచి 990 ఓట్లు పోల్‌కాగా, ఇందులో 7 వందలకు పైగా ఓట్లు వైఎస్సార్‌సీపీకి రావాల్సి ఉంది. కానీ ఫలితాలు చూసేసరికి వైఎస్సార్‌ సీపీకి కేవలం 402 ఓట్లు, టీడీపీకి 588 ఓట్లు వచ్చాయి. ఇది  అనుమానాన్ని కలిగించే అంశం. ఎలాగైనా జగనన్నను ఓడించాలని ఎక్కడో కూటమి నాయ కులు మోసం చేశారనిపిస్తోంది. పోలింగ్‌కేంద్రం, ఈవీఎంలలో ఏదో జరిగి ఉంటుంది. 
– మిత్తిరెడ్డి రమేష్‌, పోరలి గ్రామం, దత్తిరాజేరు మండలం, విజయనగరం జిల్లా



అన్ని ఓట్లు ఎలా?  
ఎన్నికల ఫలితాలు ప్రజలందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశాయి. మాది పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామం. మా గ్రామం వైఎస్సార్‌సీపీకి కంచుకోటలా ఉండేది. మా గ్రామంలో 620 ఓట్లు పోలయ్యాయి. మేమంతా జగన్‌మోహన్‌ రెడ్డికి అనుకూలంగానే ఓట్లు వేశాం. వైఎస్సార్‌సీపీకి 247, టీడీపీకి 373 ఓట్లు పడ్డాయి. ఇంతలా వ్యత్యాసం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. గ్రామమంతా ఇదే చర్చ నడుస్తోంది. అత్యధికంగా ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేశామంటున్నారు. టీడీపీకి 373 ఓట్లు రావడంపై చర్చనీయాంశంగా మారింది.  
– జక్కు ప్రవీణ్, సర్పంచ్, లక్ష్మీనారాయణపురం

భిన్నమైన ఫలితాలు
తాజాగా మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. నూరు శాతం వైఎస్సార్‌సీపీ మద్దతు ఉన్న గ్రామాల్లో ప్రజలు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపినప్పటికీ ఫలితాలు చూస్తే అందుకు భిన్నంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని రామలింగాపురం పంచాయతీ సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఇక్కడ 2019 ఎన్నికల్లో 400కు పైగా మెజారిటీ వచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 160లో మొత్తం 578 ఓట్లకు 497 పోలయ్యాయి. అలాగే, బూత్‌ నంబర్‌ 161లో 548 ఓట్లకు 473 పోలయ్యాయి. దీంతో రామలింగాపురం గ్రామంలో మొత్తం 970 ఓట్లు పోలవ్వగా అందులో 400కు పైగా వైఎస్సార్‌ సీపీకి మెజారిటీ రావాల్సి ఉంది. కేవలం 76 ఓట్లు మాత్రమే మెజారిటీ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.  
– ఇప్పిలి అనంతం, వైఎస్సార్‌ సీపీ మండలాధ్యక్షుడు, చీపురుపల్లి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement