Sakshi News home page

ఎన్నికల వేళ బరితెగిస్తున్న కేటుగాళ్లు

Published Sun, Mar 24 2024 4:33 AM

Fraudsters are trying to cheat in the name of Election Commission - Sakshi

రాజకీయ పార్టీలు, ఎలక్షన్‌ కమిషన్‌ పేరిట మోసాలకు తెగబడుతున్న మోసగాళ్లు

ఓటర్‌ కార్డు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని.. సరిచేయాలని నమ్మిస్తున్న సైబర్‌ చీటర్లు

బహుమతులు ఎరగా చూపి బ్యాంక్‌ ఖాతాలు లూటీ

అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

విజయవాడలోని గుణదలకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ టెక్ట్స్‌ మెసేజ్‌ వచ్చింది.  ‘ఎన్నికల సర్వేలో చురుగ్గా పాల్గొంటున్నందున మా పార్టీ నుంచి కొన్ని రీడిమ్‌ పాయింట్లు ఇస్తున్నాం. ఈ పాయింట్ల కోసం ఈ కింది లింక్‌ను క్లిక్‌ చేయండి’ అని అందులో ఉంది. పాయింట్లు వస్తాయనే ఆశతో సదరు వ్యక్తి లింక్‌ను క్లిక్‌ చేసి గూగుల్‌ ఫామ్‌లో వివరాలు నమోదు చేశాడు. ఆ వివరాల ఆధారంగా బ్యాంక్‌ ఖాతాలోని నగదును సైబర్‌ నేరగాళ్లు ఖాళీ చేయడంతో లబోదిబోమన్న బాధితుడు సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు.

విజయవాడ (స్పోర్ట్స్‌): కాలానికి అనుగుణంగా మోసాలకు పాల్పడటంలో ఆరితేరిన సైబర్‌ నేరగాళ్లు ఎన్నికల సీజన్‌ కావడంతో రాజకీయ పార్టీలు, ఎలక్షన్‌ కమిషన్‌ పేరుతో మోసాలకు తెగబడుతున్నారు. సర్వే అంటూ, ఓటరు కార్డు సరి చేయాలంటూ ఫోన్లు చేసి ప్రజల బ్యాంక్‌ ఖాతాలను లూటీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి నేరుగా ఎవరికీ ఫోన్‌ కాల్‌ రాదనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.

సర్వే పేరుతో వివరాలు సేకరించి మోసాలు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు సర్వేల పేరుతో ప్రజలకు ఫోన్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల స్వభావం తెలుసుకునేందుకు, ఓట్లు అభ్యర్థించేందుకు పార్టీలు రికార్డింగ్‌ కాల్స్‌ మాత్రమే చేస్తున్నాయి. దీనినే కొందరు నేరగాళ్లు సైబర్‌ మోసాలకు వాడుకుంటున్నారు. ఫోన్‌ చేసిన ఆగంతకుడు ఏదో ఒక పార్టీ సర్వే పేరుతో తియ్యని మాటలతో ముగ్గులోకి దించుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి స్వభావంపై తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే ఆన్‌లైన్‌లో ఆకర్షణీయమైన గిఫ్ట్‌ పంపుతామని ఆశ పెడతారు.

కొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత మీరు గిఫ్ట్‌ పొందేందుకు అర్హత సాధించారని నమ్మిస్తారు. గిఫ్ట్‌ మీ ఇంటికి రావాలంటే మీ ఓటర్‌ కార్డ్, బ్యాంక్, ఆధార్, పాన్‌ వివరాలు చెప్పాలని అభ్యర్థిస్తారు. ఈ వివరాలన్నీ సేకరించిన తరువాత ఆయా బ్యాంక్‌ ఖాతాలో ఉన్న నగదును ఏఈపీఎస్‌ (ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌) ద్వారా ఖాళీ చేస్తారు. ఏఈపీఎస్‌ మోసాల్లో ఖాతాదారుడికి డబ్బులు వేరే ఖాతాకు డెబిట్‌ అయినట్టు కనీసం మెసేజ్‌ కూడా రాదు. ఖాతాలో నగదు లేకుండా అదే వ్యక్తి పేరున ఓ సిమ్‌ తీసుకుని సోషల్‌ మీడియా ఖాతాలతో పాటు బ్యాంక్‌ ఖాతా తెరుస్తున్నారు.

వేరే వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి నేరగాళ్లు నగదును ముందుగా ఈ బ్యాంక్‌ ఖాతా, యూపీఐ యాప్‌లకు బదిలీ చేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధితుడినే నేరగాడిగా మార్చేస్తున్నారు. సామాన్య ప్రజల పేరునే ఎక్కువగా బ్యాంకు ఖాతాలు తెరిచి నగదును ఆయా ఖాతాలకు నేరగాళ్లు బదిలీ చేస్తున్నారు. ఏదైనా ఫిర్యాదు రాగానే దాని ఆధారంగా ఆయా బ్యాంక్‌ ఖాతాను వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకు ముందుగా స్మార్ట్‌ ఫోన్‌ సరిగ్గా వాడటం తెలియని వ్యక్తులే తారసపడుతున్నారు. 

రీడిమ్‌ పాయింట్లు ఎరగా చూపి..
సర్వే పేరుతో నేరగాళ్లు పలు రకాల ప్రశ్నలు వేసిన అనంతరం.. సర్వేలో చురుగ్గా పాల్గొన్న మీకు కొన్ని ఎస్‌బీఐ రీడిమ్‌ పాయింట్లు ఇచ్చామని, తాము పంపే లింక్‌ క్లిక్‌ చేసి గూగుల్‌ ఫామ్‌లో మీ వివరాలు నింపాలని సూచిస్తారు. ఫామ్‌లో నమోదు చేసిన వివరాల ఆధారంగా బ్యాంక్‌ ఖాతాలోని నగదును మొత్తం ఖాళీ చేస్తున్నారు. 

ఓటర్‌ కార్డు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదంటూ..
ఓటర్‌ కార్డు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని, వచ్చే ఎన్నికల్లో మీరు ఓటు హక్కును వినియోగించుకోలేరని ఫోన్‌ ద్వారా ప్రజ­లను నేరగాళ్లు ఆందోళనకు గురి చేస్తారు. ఎన్నికల సంఘం నుంచి మాట్లాడుతున్నామని నమ్మిస్తారు. వివరాలు చెప్తే సరి చేస్తామని, ఎనేబుల్డ్‌ అయిన కొత్త ఓటరు కార్డుతో నిర్భయంగా ఓటు వేయవచ్చని భరోసా ఇస్తారు. వాట్సాప్‌కు పంపే లింక్‌ క్లిక్‌ చేసి గూగుల్‌ ఫామ్‌లో వివరాలు నమోదు చేయాలని సూచిస్తారు. పాన్, ఆధార్‌తో పాటు అదనంగా బ్యాంక్‌ ఖాతా వివరాలు సేకరించి ఖాతాలోని నగదును లూటీ చేస్తారు.

అప్రమత్తంగా ఉండండి
ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఫోన్లు రావని ప్రజలు గ్రహించాలి. ఓటరు కార్డు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని వచ్చే ఫోన్లకు స్పందించవద్దు. సర్వే పేరుతోరాజకీయ పార్టీలు రికార్డింగ్‌ కాల్స్‌ మాత్రమే చేస్తున్నాయి. అవతలి వ్యక్తి మాట్లాడే సర్వేలకు స్పందించాల్సిన అవసరం లేదు.

గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు.గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే గూగుల్‌ ఫామ్‌లో వివరాలు నమోదు చేయొద్దు. రానున్న రోజుల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగే అవకా>శం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి.   – ఎస్‌డీ తేజేశ్వరరావు, ఏసీపీ, సైబర్‌ క్రైం, విజయవాడ

Advertisement
Advertisement