Sakshi News home page

సారీ బాబు గారూ.. టీడీపీ పేరు చెబితే బూతులు తిడుతున్నారు

Published Thu, Apr 18 2024 1:00 AM

- - Sakshi

ఇక్బాల్‌కు శృంగభంగం 

మీలా రోజుకో పార్టీ మారలేం

ముఖంపైనే చెప్పిన వైఎస్సార్‌ సీపీ నేతలు

హిందూపురం అర్బన్‌: ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు టీడీపీ అడ్డదారులన్నీ తొక్కుతోంది. ముఖ్యంగా హిందూపురంలో ఈ సారి ఓటమి ఖాయంగా తేలడంతో బాలకృష్ణ కోసం ఆ పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. చివరకు వైఎస్సార్‌ సీపీ నేతలను ఆకట్టుకునేందుకు ప్లాన్‌ వేశారు. ఇందుకోసం వైఎస్సార్‌ సీపీ నుంచి ఇటీవలే టీడీపీలో చేరిన ఇక్బాల్‌ను ప్రయోగించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో బస చేసి హిందూపురానికి చెందిన వైఎస్సార్‌ సీపీ మైనార్టీ నాయకులు, కొందరు కౌన్సిలర్లను పిలిపించారు.

మేం మీలా కాదు ఇక్బాల్‌..
హిందూపురం నేతలతో పరామర్శల తర్వాత ఇక్బాల్‌.. మైనార్టీలకు వైఎస్సార్‌సీపీలో సరైన గౌరవం లేదని టీడీపీలో చేరితే మంచి అవకాశాలు ఇప్పిస్తానంటూ చెప్పబోయారు. అప్పటివరకూ సార్‌ అంటూ గౌరవంతో పిలిచిన వైఎస్సార్‌ సీపీ నాయకులు వెంటనే ఏకవచనంతో ఆయన్ను కడిగిపారేశారు. ‘‘మేం మీలా కాదు.. స్వార్థం కోసం రోజుకో పార్టీ మారలేం.. మా నాయకుడు మాకు ఎప్పుడూ అన్యాయం చేయరు. మీకు కూడా వైఎస్సార్‌ సీపీలో ఎంతో గౌరవం ఇచ్చారు. అయినా మీరు అన్యాయంగా ప్రవర్తించారు. ఇందుకోసమే మమ్మల్ని పిలిపించి ఉంటే అది తప్పు. ఇక వస్తాం’’ అంటూ అక్కడి నుంచి వచ్చేశారు. ఇంతలా ఎదురుదాడి ఊహించని ఇక్బాల్‌ అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన హిందూపురానికి రాలేకపోయారని టీడీపీ నేతలే చెబుతున్నారు.

పార్టీ ఫిరాయించిన వారికీ అవమానం..
ఇక్బాల్‌ మాటలు నమ్మి చిలమత్తూరుకు చెందిన ఒకరిద్దరు టీడీపీలో చేరినా వారికి అక్కడి నేతలతో పొసగడం లేదు. ఇన్నాళ్లూ తమను తిట్టి ఇప్పుడు తమ పంచనే చేరారంటూ టీడీపీ నేతలు చులకనగా మాట్లాడుతున్నారని పార్టీ ఫిరాయించిన ఓ నేత అనుచరులతో వాపోయినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల టీడీపీలో చేరిన చిలమత్తూరు మహిళా నేత ఇటీవల బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి ప్రచారం చేసేందుకు ప్రయత్నించగా... స్థానిక టీడీపీ మహిళా నేతలు ఆమెను ప్రచారవాహనంపైకి కూడా ఎక్కనివ్వలేదు. దీంతో పరువుపోయినట్లు భావించిన ఆమె కన్నీటిపర్యంతమవుతూ... అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

విచ్చలవిడిగా నగదు తరలింపు..
హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ఈ నెల 19వ తేదీన నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో జనసమీకరణకు ఆ పార్టీ నేతలు విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. హిందూపురంలోని వివిధ వార్డులతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి జనాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం భారీగా నగదు తరలిస్తున్నారు. అయితే సామాన్యుల వాహనాలను తనిఖీ చేసే పోలీసులు టీడీపీ నేతల వాహనాలను మాత్రం తనిఖీ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement