ఇదే విషయాన్ని ఎన్నోసార్లు షర్మిల సైతం చెప్పారు
ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరి దు్రష్పచారం చేస్తున్నారు
నేను కేసుల్లో ఇరికించానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం
అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. కుట్రపూరితంగా వైఎస్సార్ పేరును కేసుల్లో కాంగ్రెస్ పార్టీ ఇరికించిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు షర్మిల సైతం చెప్పారన్నారు. తాను ఇరికించానని ఆమె నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. లేకుంటే షర్మిల దేనికి సిద్ధమో చెప్పాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంగళవారం పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహానేత వైఎస్సార్‌ను కాంగ్రెస్ పార్టీ దోషిగా చిత్రీకరించే కుట్రలను అడ్డుకునేందుకు తాను న్యాయపరంగా పోరాటం చేశానన్నారు. కానీ, షర్మిల మాత్రం వైఎస్సార్ మరణానంతరం ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పంచన చేరి తనపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి మహానేత వైఎస్సార్ పేరును ఉచ్ఛరించే అర్హత లేదన్న షర్మిల వ్యాఖ్యలను వీడియోలను ప్రదర్శించి పొన్నవోలు వినిపించారు. వైఎస్సార్‌పై కేసులు పెట్టింది కాంగ్రెస్ అన్న షర్మిల.. ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు.
నాతో ఎవరూ కేసులు వేయించలేదు..
కాంగ్రెస్ నేత శంకర్రావు వైఎస్సార్ పేరును అత్యంత దారుణంగా చిత్రీకరిస్తూ కోర్టుకు లేఖలు రాశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం తాను మాటలు మార్చట్లేదన్నారు. ‘వైఎస్సార్ పేరును కేసుల్లో ఇరికిస్తుంటే అన్యాయమని స్పందించాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబర్‌లో నేను కేసు వేసే నాటికి కనీసం వైఎస్ జగన్‌ను చూడలేదు.. నాకు ఆయనతో పరిచయం లేదు. ఆనాడు వైఎస్సార్‌పై చంద్రబాబు, టీడీపీ నేతలు రాష్ట్రపతికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఇలాంటి కేసుల్లో సంతకాలు చేసిన మంత్రులు, సంబంధిత అధికారులు బాధ్యులు అవుతారు. కానీ వైఎస్సార్, వైఎస్ జగన్ ఎలా బాధ్యులు అవుతారు.
ఈ వాస్తవం కోర్టుకు వివరించే ప్రయత్నం చేశాను’ అని పొన్నవోలు వివరించారు. రాజధానిలో చంద్రబాబు భూదోపిడీ, వందల కోట్ల విలువైన సదావర్తి భూముల దోపిడీ, తెలంగాణలో ఓటుకు కోట్లు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లోనూ తాను పోరాటం చేశానన్నారు. బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన పోరాటం చూసి సీఎం జగన్ ఏఏజీగా అవకాశం కల్పించారన్నారు. క్విడ్ ప్రోకో అంటే వైఎస్సార్‌పై ఫిర్యాదు ఇచ్చిన శంకర్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం కాదా అని నిలదీశారు. తన ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు అక్రమాలపై పోరాటం చేస్తానన్నారు.
షర్మిల చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తనపై, సీఎం జగన్‌పై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. కొంత మంది పకోడిగాళ్లు షర్మిల భుజం మీద తుపాకీ పెట్టి తనను కాలుస్తున్నారని మండిపడ్డారు. అలాగే తన భుజం మీద తుపాకీ పెట్టి సీఎం జగన్‌ను కాల్చాలని చూస్తున్నారని..
ఈ విషయం షర్మిల తెలుసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment